
కోల్‌కతా పోలీసులు షర్మిష్ట పనోలీ అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై డచ్ ఎంపీ నుంచి మొదలు పవన్ కల్యాణ్ వరకు చాలా మంది స్పందించారు. ఇంతకీ షర్మిష్ట ఎవరు? ఆమె ఎందుకు అరెస్ట్ అయ్యింది? ఆపరేషన్ సిందూర్ గురించి ఆమె ఏం మాట్లాడింది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ అరెస్ట్‌పై ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? పవన్ కల్యాణ్, డచ్ లీడర్ ఏం అన్నారు?
ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన విధంగా వారు కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది ఆపరేషన్ సిందూర్ మద్దతు పలుకుతుంటే.. కొంతమంది వేరే విధంగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే షర్మిష్ట పనోలీ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన పోస్టుల ద్వారా వివాదాల్లో చిక్కుకుంది. షర్మిష్ట పనోలీ పూణేలోని ఒక లా కాలేజీలో నాల్గవ సంవత్సరం చదువుతోంది. ఆమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఇన్‌స్టాగ్రామ్‌లో 94,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజకీయాలు, సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను ఘాటుగా చెప్పే వీడియోలతో ఆమె పాపులర్ అయింది. ఇటీవల షర్మిష్ట చేసిన ఒక వీడియో ఆమెను చిక్కుల్లో పడేసింది. మే 14, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఒక టెర్రర్ దాడిలో 26 మంది అమాయకులు చనిపోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని టెర్రర్ క్యాంప్‌లపై దాడులు చేసింది, దీన్నే ఆపరేషన్ సిందూర్ అని పిలుస్తున్నారు. ఈ ఆపరేషన్‌కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. షర్మిష్ట తన వీడియోలో ఈ ఆపరేషన్ గురించి మాట్లాడుతూ, బాలీవుడ్ నటులు ఈ విషయంపై మౌనంగా ఉన్నారని విమర్శించింది. అంతేకాదు, ఆమె పాకిస్థాన్, ప్రవక్త మహమ్మద్ గురించి కూడా అపమానకరమైన, మతపరమైన భావాలను గాయపరిచే వ్యాఖ్యలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. భారత్ ఎందుకు పాకిస్థాన్‌పై దాడి చేసింది, దీనికి సరైన కారణం లేదని ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అయింది, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆమె దాన్ని తొలగించి, బేషరతుగా క్షమాపణ చెప్పింది. తన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఎవరి భావాలను గాయపరిచే ఉద్దేశ్యం తనకు లేదని.. ఎవరైనా బాధపడితే క్షమించాలని కూడా కోరింది.
అయితే, షర్మిష్ట క్షమాపణ చెప్పినప్పటికీ, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. కోల్‌కతాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లలో మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, శాంతి భద్రతలను కలచివేసేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం వంటి నేరాలు ఉన్నాయి.
కోల్‌కతా పోలీసులు షర్మిష్టకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ ఆమె, ఆమె కుటుంబం దొరకలేదని, ఉద్దేశపూర్వకంగా తప్పించుకుంటున్నారని పోలీసులు ఆరోపించారు. దీంతో కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మే 30న షర్మిష్టను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. ఆమె అప్పటికి తన కుటుంబంతో గురుగ్రామ్‌లో ఉంది. అక్కడి నుంచి ఆమెను ట్రాన్సిట్ రిమాండ్‌పై కోల్‌కతాకు తీసుకొచ్చారు. ఆమెను కోల్‌కతాలోని అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ఇప్పటికే ఆమె ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారని.. కస్టడీ అవసరం లేదని షర్మిష్ట లాయర్ వాదించినప్పటికీ, కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. షర్మిష్టకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
షర్మిష్ట పనోలీ అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎంతో మంది స్పందిస్తున్నారు. ఈ ఘటన రాజకీయ వివాదంగా మారింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, షర్మిష్ట వీడియో తొలగించి, క్షమాపణ చెప్పినప్పటికీ, కోల్‌కతా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె వ్యాఖ్యల వల్ల ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని.. ఇది కేవలం ఓ వర్గం ఓటు బ్యాంక్‌ను సంతృప్తి పరచడానికి చేపట్టిన అరెస్ట్ అని ఆరోపించారు అమిత్ మాల్వియా. మమతా గతంలో ఇంతకంటే విభజనాత్మక వ్యాఖ్యలు చేశారని.., దానివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని., కానీ ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా మమతా ప్రభుత్వాన్ని విమర్శించారు. సనాతనీలపై మాత్రమే చర్యలు తీసుకుంటారని… హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు, రామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపులపై రాళ్ల దాడులు జరిగినప్పుడు కోల్‌కతా పోలీసుల ఉత్సాహం ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కూడా షర్మిష్టకు మద్దతుగా నిలిచారు. షర్మిష్ట కొన్ని అసభ్యకరమైన మాటలు వాడింది, కానీ ఈ రోజుల్లో యువత ఇలాంటి మాటలే వాడుతుందని.. ఆమె క్షమాపణ చెప్పిందని.. అది సరిపోతుందని… ఆమెను ఇంకా వేధించడం, హరాస్ చేయడం అవసరం లేదని కంగనా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు.
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా ఈ అరెస్ట్‌ను విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఈ అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని.. దానికి ఆమె తన తప్పు ఒప్పుకుని, వీడియో తొలగించి, క్షమాపణ చెప్పిందని.. . కానీ పశ్చిమ బెంగాల్ పోలీసులు వెంటనే ఆమెపై చర్యలు తీసుకున్నారని పవన్ అన్నారు. అయితే, టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు లక్షల మందికి కలిగే బాధ గురించి మాట్లాడరెందుకని ప్రశ్నించారు. తమ విశ్వాసాన్ని గంధ ధర్మం అని పిలిచినప్పుడు పోలీసులు ఇంత వేగంగా ఎందుకు స్పందించలేదని పవన్ ప్రశ్నించారు. మమతా బెనర్జీ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను పవన్ కల్యాణ్ షేర్ చేశారు. సెక్యులరిజం కొందరికి షీల్డ్‌లా, మరికొందరికి కత్తిలా ఉండకూడదన్నారు.. ఇది రెండు వైపులా సమానంగా ఉండాలన్నారు. పశ్చిమ బెంగాల్ పోలీసులను, దేశం చూస్తోందని… అందరికీ న్యాయం చేయండని అన్నారు పవన్. #IStandWithSharmistha, #EqualJustice హ్యాష్‌ట్యాగ్‌లతో తన మద్దతును తెలిపారు. ఇదే విషయంపై డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ కూడా స్పందించారు. గీర్ట్ వైల్డర్స్ నెదర్లాండ్స్‌లోని రైట్-వింగ్ పార్టీ ఆఫ్ ఫ్రీడమ్ నాయకుడు. షర్మిష్ట పనోలీని విడుదల చేయండని.. ఆమెను అరెస్ట్ చేయడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కు అవమానమని తెలిపారు. పాకిస్థాన్, మహమ్మద్ గురించి నిజం మాట్లాడినందుకు ఆమెను శిక్షించడం సరికాదన్నారు. గీర్ట్ వైల్డర్స్ గతంలో 2022లో బీజేపీ నాయకురాలు నుపూర్ శర్మ వివాదంలో కూడా మద్దతు తెలిపారు. ఈ అరెస్ట్ భారత్‌లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మతపరమైన అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న విషయంపై మళ్లీ చర్చను రేకెత్తించింది.