హనీమూన్ పేరుతో భర్తను చంపేసిన భార్య..!!

Spread the love

మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన ఇండోర్ జంట అదృశ్యం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే పోలీసుల విషయంలో నమ్మలేని నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఈ జంట మే 23, 2025న అదృశ్యమైంది. జూన్ 2న రాజా మృతదేహం ఒక లోయలో లభించింది. కేసులో ఊహించని ట్విస్ట్ ఏంటంటే, రాజా హత్యకు సోనమే కారణమని పోలీసులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ కేసు ఏమిటి? హత్య వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటి? పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు ఏవి? నిందితురాలి కుటుంబం ఏం చెబుతోంది? మిస్సింగ్ కేసు.. మర్డర్ కేసుగా ఎలా మారింది.?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి చెందిన రాజా రాఘువంశీ, సోనం రాఘువంశీ ఈ ఏడాది మే 11న వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన తొమ్మిది రోజులకే, మే 20న, ఈ జంట హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌కు బయలుదేరింది. మే 22న వారు షిల్లాంగ్‌లోని బాలాజీ గెస్ట్ హౌస్‌లో చెక్-ఇన్ చేశారు. మరుసటి రోజు వారు ఒక స్కూటర్ అద్దెకు తీసుకుని చెర్రాపుంజీ వైపు వెళ్లారు. కానీ, అదే రోజు సాయంత్రం వారి ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. మే 24న వారు అద్దెకు తీసుకున్న స్కూటర్ సోహ్రామ్ గ్రామంలో ఒక కేఫ్ బయట కీలతో సహా వదిలేసినట్టు కనిపించింది. ఈ ఘటనతో రాజా, సోనం ఇద్దరూ అదృశ్యమైనట్టు పోలీసులు భావించారు. రాజా కుటుంబం ఆందోళన చెంది, మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్ 2న ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. సోహ్రాలోని వీసావ్‌డాంగ్ జలపాతం సమీపంలో ఒక లోయలో రాజా రాఘువంశీ మృతదేహం లభించింది. ఆటోప్సీ నివేదిక ప్రకారం, రాజా తల ముందు, వెనుక భాగాల్లో రెండు గాయాలు ఉన్నాయి. ఈ గాయాలు ఒక బలమైన ఆయుధం, బహుశా పెద్ద కత్తి లాంటిదానితో దాడి చేసినట్టు భావిస్తున్నారు. మృతదేహం సమీపంలో రక్తం మరకలతో కూడిన మాచెట్ అనే పెద్ద కత్తి, విరిగిన మొబైల్ స్క్రీన్, ఒక మహిళల షర్ట్, స్మార్ట్‌వాచ్ లభించాయి. రాజా ధరించిన బంగారు ఉంగరం, నెక్లెస్ మాత్రం కనిపించలేదు. ఈ సాక్ష్యాలతో ఈ ఘటన హత్య అని పోలీసులు నిర్ధారించారు. వెంటనే కేసును హత్యగా నమోదు చేసి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశారు. మొదట సోనం కూడా అదృశ్యమైందని భావించినప్పటికీ, ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని కాశీ ధాబాలో ఆమె కనిపించింది.

ఈ కేసులో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం ఏంటంటే, రాజా రాఘువంశీ హత్యకు అతని భార్య సోనమే కారణమని పోలీసులు చెబుతున్నారు. సోనం తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి ఈ మర్డర్ ను ప్లాన్ చేసిందని, మధ్యప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించిందని పోలీసులు చెబుతున్నారు. రాజ్ కుశ్వాహా ఈ కుట్రకు సూత్రధారి అని, అతను సోనం సోదరుడు గౌరవ్ రాఘువంశీకి చెందిన ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేసేవాడని తెలిసింది. రాజా సోదరుడు విపుల్ రాఘువంశీ, సోనం రాజ్ కుశ్వాహాతో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడేదని, ఇది హత్యకు సంబంధం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు కేసు విచారణలో కీలకంగా మారింది. పోలీసులు సేకరించిన ఆధారాలు ఈ ఆరోపణలను బలపరుస్తున్నాయి. ముగ్గురు నిందితులు సోనం తమను హత్యకు నియమించిందని ఒప్పుకున్నట్టు మేఘాలయ DGP తెలిపారు. షిల్లాంగ్‌లోని హోటల్‌లో జంట చెక్-ఇన్ చేసిన సీసీటీవీ ఫుటేజ్, వారు అద్దెకు తీసుకున్న స్కూటర్ GPS డేటా ద్వారా జంటతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. రాజా మృతదేహం సమీపంలో లభించిన రక్తం మరకల మాచెట్, సోనం ధరించినట్టు సీసీటీవీలో కనిపించిన షర్ట్ లాంటి వస్తువు కూడా కీలక సాక్ష్యాలుగా ఉన్నాయి. ఒక టూరిస్ట్ గైడ్, మే 23న జంటతో పాటు ముగ్గురు అపరిచితులను చూశానని తెలిపాడు. ఈ ఆధారాలతో, ఈ హత్య ఇండోర్‌లో ప్లాన్ చేయబడి, మేఘాలయలో అమలు చేయబడిందని, సోనం హనీమూన్ ట్రిప్‌ను ఈ కుట్రలో భాగంగా ప్లాన్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సోనం రాఘువంశీ జూన్ 8 రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని నందగంజ్ పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యింది. ఆమె ప్రియుడిగా భావిస్తున్న రాజ్ కుశ్వాహాను ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారు. హత్యను అమలు చేసిన ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో అరెస్టయ్యారు. పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఈ కేసును కేవలం ఏడు రోజుల్లో ఛేదించిన పోలీసులను అభినందించారు. అయితే, సోనం కుటుంబం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. సోనం తండ్రి దేవి సింగ్ రాఘువంశీ, తన కూతురు నిర్దోషియని, ఆమె అలాంటి హత్య చేయలేదని చెబుతున్నాడు. సోనం ఘాజీపూర్‌లోని ధాబాకు స్వచ్ఛందంగా వచ్చి, తన సోదరుడికి ఫోన్ చేసినప్పుడు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపాడు. సోనం తల్లి సంగీతా, తమ కుటుంబం రాజా హత్యపై న్యాయం కోరుతోందని, కానీ సోనంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయింది. వారు ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతున్నారు. మరోవైపు, రాజా తల్లి ఉమా రాఘువంశీ మాట్లాడుతూ సోనం నిజంగా హత్య చేసి ఉంటే ఆమెకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. సోనం హనీమూన్ ట్రిప్‌ను కుటుంబానికి తెలియకుండా బుక్ చేసిందని, రిటర్న్ టికెట్లు లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని రాజా సోదరుడు విపుల్ చెప్పాడు.

హనీమూన్‌కు వచ్చిన జంట అదృశ్యం కేసులో భర్తను నవ వధువే హత్య చేయించిందన్న ఆరోపణలు రావడం తనను షాకింగ్‌కు గురిచేసిందని మేఘాలయ డిప్యూటీ సీఎం ప్రిస్టోన్‌ త్యాన్‌సాంగ్‌ అన్నారు. పర్యాటకులకు తమ రాష్ట్రం సురక్షితమైన ప్రాంతమన్నారు. ఇది నాకు నమ్మశక్యం కాలేదు. తొలుత నాకు సమాచారం రాగానే.. ఇది నిజమని అనుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రతిఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పర్యాటకులకు మేఘాలయ సురక్షితమైన ప్రదేశం. దయచేసి రండి. సురక్షిత ప్రదేశం కాదంటూ కొందరు వ్యతిరేక ప్రచారం చేశారు. కానీ, నన్ను నమ్మండి. పర్యాటకులకు ఇది సురక్షితమైన రాష్ట్రం డిప్యూటీ సీఎం అన్నారు. అసలు ఈ కేసులో అసలేం ఏం జరిగిందో కచ్చితంగా తెలుసుకొనేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.