పాకిస్థాన్ కు బుద్ధి వచ్చింది.. కరవు అంచులో సింధూ నది ప్రాంతం..!

Spread the love

సింధూ జలాల ఒప్పందం భారత్ రద్దు చేసుకుని .. నెలరోజులు దాటింది.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ మొదటగా పాకిస్థాన్ కు కొట్టిన దెబ్బ ఇదే. ఆపరేషన్ సిందూర్ కంటే ముందే సింధూ జలాల ఒప్పందం రద్దుతో పాకిస్థాన్ కు బుద్ధి చెప్పింది భారత్. దీంతో దాయాది దేశం ఇప్పుడు గిలగిలామని కొట్టుకుంటోంది. మరి ఇన్ని రోజుల తర్వాత పాకిస్థాన్‌లో ఇప్పుడు నదుల స్థితి ఎలా ఉంది? పాకిస్థాన్ దీనిపై ఎలాంటి రాయబారం నడుపుతోంది? ఇదే స్థితి కొనసాగితే పాకిస్థాన్ భవిష్యత్తు ఎలా ఉండనుంది?

పహలాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేయడం వల్ల దాయాది దేశానికి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. జలాశయాల్లో నీటిమట్టం దారుణంగా పడిపోయింది. ఇక వాటి నుంచి నీటిని తీసుకోలేని స్థితి ఎదురవుతోంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్‌లో నీటి ప్రవాహం 15 శాతం తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్‌లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. సింధూ జలాల ఒప్పందం రద్దు తర్వాత పాకిస్థాన్‌లో నీటి సరఫరా, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాక్‌లోని పంజాబ్‌లో ఖరీఫ్‌ పంటలు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయి. భారత్‌ నిర్ణయంతో 21 శాతం నీటి కొరత ఏర్పడుతుందని పాక్‌ అంచనా వేసింది.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ దాడికి పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాదులే కారణమని, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం ప్రకారం, సింధూ నది వ్యవస్థలోని ఆరు నదులను రెండు భాగాలుగా విభజించారు. తూర్పు నదులు భారత్‌కు, పశ్చిమ నదులు పాకిస్థాన్‌కు కేటాయించబడ్డాయి. పాకిస్థాన్ వ్యవసాయానికి 80% నీరు ఈ పశ్చిమ నదుల నుంచే వస్తుంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో 24% వాటాను, 37.4% ఉపాధిని అందిస్తుంది. ఒప్పందం నిలిపివేత తర్వాత, భారత్ నీటి ప్రవాహ డేటా పంచుకోవడం ఆపేసింది. దీంతో పాకిస్థాన్‌లో వరదలు, కరవు పరిస్థితులను అంచనా వేయడం కష్టంగా మారింది. పంజాబ్‌లోని రసూల్ బ్యారేజ్ వద్ద నీటి స్థాయిలు బాగా తగ్గాయని స్థానికులు చెబుతున్నారు. ఇక భారత్ పూర్తి స్థాయిలో నీటిని నిలిపివేయడం, డైవర్ట్ చేయడం ప్రారంభిస్తే, పాకిస్థాన్ లో వ్యవసాయ ఉత్పత్తి తగ్గి, ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. కరాచీ, లాహోర్ వంటి నగరాలు గ్రౌండ్‌వాటర్‌పై ఆధారపడతాయి. సింధూ నది వల్లే ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు నీటి కొరత వల్ల ఈ నగరాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సింధూ జలాల ఒప్పందం రద్దు తర్వాత పాకిస్థాన్‌లో నీటి ఆధారిత ప్రాజెక్టులు తీవ్ర అనిశ్చితిలో పడ్డాయి. ముఖ్యంగా వ్యవసాయం, జలవిద్యుత్ ఉత్పత్తి సంబంధిత ప్రాజెక్టులు ఆగిపోయాయి. పంజాబ్‌లోని రసూల్ బ్యారేజ్ వద్ద నీటి స్థాయిలు గణనీయంగా పడిపోయాయి, దీంతో సింధూ, ఝీలం నదులపై ఆధారపడిన తర్బేలా, మంగ్లా, చష్మా ఆనకట్టలు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయి, ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి సరఫరా నిలిచిపోయింది. పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కొత్తగా ప్రారంభించాల్సిన సాగునీటి కాలువలు, చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులు నీటి కొరత, డేటా లేకపోవడం వల్ల నిలిచిపోయాయి. పాకిస్థాన్‌లో వరదలు, కరవు అంచనాలు కష్టతరమై, కొత్త నీటి నిల్వ, విద్యుత్ ప్రాజెక్టుల ప్లానింగ్‌కు ఆటంకం కలిగింది. ఈ పరిస్థితి కొనసాగితే, పాకిస్థాన్‌లో వ్యవసాయ ఉత్పాదకత 5-10% తగ్గి, ఆహార సంక్షోభం, ఆర్థిక అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

పాకిస్థాన్ భారత్ నిర్ణయాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఒప్పందంలో ఏకపక్షంగా రద్దు చేసే నిబంధన లేదని, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమని వాదించింది. పాకిస్థాన్ ఈ ఇష్యూను ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్, అంతర్జాతీయ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వంటి అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పాకిస్థాన్ భారత్‌కు లేఖ రాసి, ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, తమ దేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని పేర్కొంది. దీనికి తోడు చైనాను మధ్యవర్తిగా పిలవాలని చూస్తోంది.

అయితే సింధూ జలాల విషయంలో భారత్ వెనక్కు తగ్గేదే లేదంటోంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు ఈ విషయంలో చర్చలకు తావులేదని తెగేసి చెబుతోంది భారత్. దీనికి తోడు భారత్ ప్రస్తుతం నీటి ప్రవాహ డేటా పంచుకోవడం ఆపివేసింది. పశ్చిమ నదులపై కొత్త హైడ్రోపవర్, నీటి నిల్వ ప్రాజెక్టులను చేపట్టే ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే పాకిస్థాన్‌లో వ్యవసాయ ఉత్పత్తి 5-10% తగ్గవచ్చని, ఆహార ధరలు పెరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ ఇప్పటికే వాతావరణ మార్పులు, గ్రౌండ్‌వాటర్ క్షీణత వంటి సమస్యలతో సతమతమవుతోంది. 2022 వరదల తర్వాత 1 కోటి మంది తాగునీటి సమస్యను ఎదుర్కొన్నారు. దీర్ఘకాలంలో, నీటి కొరత వల్ల ఆహార భద్రత సంక్షోభం, ఆర్థిక అస్థిరత, అంతర్గత అశాంతి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు..