
Musk’s The America Party: టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. అమెరికాలో ది అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. ఈ పార్టీ డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలకు స్వేచ్ఛ అందించే లక్ష్యంతో పనిచేస్తుందని మస్క్ పేర్కొన్నారు. అయితే ఈ పార్టీ ప్రజల కోసం ఏర్పడిందా లేక ట్రంప్ పై కోపంతో పెట్టారు..? ఈ కొత్త పార్టీ అమెరికా రాజకీయాలను ఎలా ప్రభావితం చేయనుంది? దీని వెనుక మస్క్ వ్యూహం ఏమిటి? అమెరికాలో ఉన్న రెండు పార్టీల డామినేషన్ ను ఈ కొత్త పార్టీ తగ్గించనుందా..?
మస్క్ .. అపర కుబేరుడు.. ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతా చేసి ట్రంప్ ను గెలిపిస్తే ఈ తిక్క శంకరయ్యలా ట్రంప్.. మస్క్ కే దెబ్బ వేశాడనే వాదనలు వినిపించాయి. ప్రాణ స్నేహితుల్లో కలిసి మెలిసి ఉన్న ట్రంప్, మస్క్ తర్వాత ఒకరినొకరు తిట్టుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకనొక దశంలో మస్క్ ను దేశం నుంచి పంపేస్తామని కూడా ట్రంప్ బెదిరించారు. ఈ నేపథ్యంలో మస్క్ అన్నింటకి తెగించారు. డబ్బులు ఎంత ఉన్నా అధికారం లేకపోతే వృథాయేని ప్రకటించారు. పుష్క సినిమాలో అల్లు అర్జున్ తనకు ఫోటో ఇవ్వని సీఎంను తన డబ్బు ఉపయోగించే ఎలా మార్చాడో.. అలా తనకు అనుకూలంగా లేని ట్రంప్ ను గద్దె దించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. దీని కోసం కొత్త పార్టీని ప్రకటించారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలాన్ మస్క్ ది అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలపై అమెరికా ప్రజలు విసిగిపోయారు. ఆ పార్టీ లేదా ఈ పార్టీ .. ఈ రెండు పార్టీలే ఎప్పటి నుంచో అధికారం పంచుకుంటున్నాయి. మూడో పార్టీకి ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. అయితే మస్క్ కొత్త పార్టీ ఈ రెండు పార్టీలను ఎదుర్కొని పోరాడగలదని చెబుతున్నారు మస్క్. యూనిపార్టీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలకు నిజమైన గొంతును అందించే లక్ష్యంతో ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు మస్క్ తెలిపారు. అమెరికా రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం ప్రజల స్వేచ్ఛను హరిస్తూ, ప్రభుత్వ వ్యయాలు, అవినీతితో కూడిన విధానాలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తోంది మస్క్ అభిప్రాయపడుతున్నారు. అయితే మస్క్ కొత్త పార్టీ వెనుక ప్రధాన కారణంగా ట్రంప్ నిర్ణయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పార్టీ ఏర్పాటు ప్రకటనకు ముందు, మస్క్ ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను తీవ్రంగా వ్యతిరేకించారు మస్క్. ది అమెరికా పార్టీ ప్రజలకు స్వేచ్ఛ, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, పారదర్శకమైన పాలనను అందిస్తుందని ప్రకటించారు. Musk’s The America Party.
ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఇటీవలి గొడవలు ఈ కొత్త పార్టీ స్థాపనకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ టెక్ సంస్థలపై కఠిన నియమాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆంక్షలు విధించే ప్రతిపాదనలను కలిగి ఉంది. దీని వల్ల మస్క్ కంపెనీలకు చాలా నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ బిల్లు టెస్లా, స్పేస్‌ఎక్స్, X కార్పొరేషన్ వంటి మస్క్ సంస్థలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆవిష్కరణలను అడ్డుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మస్క్ ఈ బిల్లును ప్రజల స్వేచ్ఛను హరించే, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చట్టంగా విమర్శించారు. ఈ బిల్లు ఆమోదితమైతే తాను కొత్త పార్టీ స్థాపిస్తానని ముందే హెచ్చరించారు. చెప్పినట్టే మస్క్ కొత్త పార్టీ పెట్టేశారు. కొత్త బిల్లు, ట్రంప్ తో గొడవలు మస్క్‌ను ప్రస్తుత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేలా ప్రేరేపించాయి. ట్రంప్‌తో ఈ ఘర్షణలు అమెరికాలోని రాజకీయ, వ్యాపార రంగాలలో చర్చనీయాంశంగా మారాయి, మస్క్ ఈ పార్టీ ద్వారా సాంకేతిక, ఆర్థిక స్వేచ్ఛను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ది అమెరికా పార్టీ లక్ష్యాలు ఏంటి..?
ది అమెరికా పార్టీ లక్ష్యాలు ఎలాన్ మస్క్ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, అవినీతిని నిర్మూలించడం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అభిప్రాయ స్వేచ్ఛను కాపాడటం వంటి అంశాలపై ఈ పార్టీ ప్రధాన లక్ష్యాలని మస్క్ తెలిపారు. అయితే ఈ పార్టీ సెంటర్-రైట్ భావజాలాన్ని అనుసరించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఈ కొత్త పార్టీ ఎక్కువగా యువతను, సాంకేతిక రంగాన్ని ఆకర్షించే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీ విషయంలో మస్క్ ఎలాంటి నిర్దిష్ట విధానాలను ప్రకటించలేదు. ప్రస్తుతానికి మస్క్ తన వ్యక్తిగత బ్రాండ్‌ను, ఆర్థిక బలాన్ని ఈ పార్టీ కోసం వాడుకుంటున్నారు. అయినప్పటికీ, అమెరికాలో రెండు-పార్టీ వ్యవస్థ బలంగా ఉన్న నేపథ్యంలో ఈ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపగలదనేది ప్రశ్నార్థకంగా ఉంది. Musk’s The America Party.
ది అమెరికా పార్టీపై రియాక్షన్స్ ఏంటి..?
ది అమెరికా పార్టీ స్థాపనపై నిపుణులు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు. అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు బలంగా ఉన్న నేపథ్యంలో, కొత్త పార్టీ ఏర్పాటు గణనీయమైన ప్రభావం చూపే అవకాశం తక్కువని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అమెరికా రాజకీయ వ్యవస్థలో మూడవ పార్టీలు చారిత్రకంగా విజయం సాధించడం అరుదు, ఎందుకంటే ఎన్నికల వ్యవస్థ, ఓటర్ల ధోరణి ప్రధాన పార్టీలకు అనుకూలంగా ఉంటాయి. మస్క్ బ్రాండ్, ఆర్థిక బలం, యువతను ఆకర్షించే సామర్థ్యం ఈ పార్టీకి మొదట్లో ప్రయోజనాన్ని ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలిక విజయం సాధించడానికి స్పష్టమైన విధానాలు, సంస్థాగత నిర్మాణం, గ్రాస్‌రూట్ సమీకరణ అవసరం. అయితే మస్క్ ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయాలు సాధించారు. అతడికి ఆ విషయంలో తిరుగులేదు. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఉండదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మస్క్ సక్సెస్ రేట్, బలమైన ఫాలోయింగ్ మస్క్ పార్టీని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మార్చే అవకాశం ఉందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ది అమెరికా పార్టీ అమెరికా రాజకీయ ల్యాండ్‌స్కేప్‌ను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ ప్రకటన ఇప్పటికే భారీ చర్చను రేకెత్తించింది. ఈ పార్టీని ట్రంప్ దూకుడును కట్టడి చేసే ఒక వ్యతిరేక శక్తిగా భావిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మస్క్ కొత్త పార్టీకి 80 శాతం మద్దతు లభించింది. అంటే చాలా మంది ఈ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో సోషల్ మీడియా, టెక్ సంస్థలపై పెరుగుతున్న నియంత్రణల నేపథ్యంలో, ఈ పార్టీ యువ ఓటర్లను, సాంకేతిక నిపుణులను ఆకర్షించే అవకాశం ఉంది. అయితే, మస్క్ రాజకీయ అనుభవం లేకపోవడం, పార్టీకి స్పష్టమైన ఎజెండా లేకపోవడం వంటి అంశాలు పెద్ద సవాలుగా చెప్పొచ్చు. ఈ పార్టీ విజయం సాధిస్తే, అమెరికా రాజకీయాలలో సాంకేతిక రంగం ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో టెక్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మస్క్ వలసదారుడు కావడంతో ఇది రాజకీయంగా నెగిటివ్ గా మారే అవకాశం ఉంది. అమెరికా చట్టాల ప్రకారం అతడు కింగ్ అయ్యే అవకాశాలు లేవు.. కాని కింగ్ మేకర్ అయ్యే ఛాన్సులు ఎక్కువు.