టారిఫ్ లో భయపెడుతోన్న ట్రంప్..?!

Spread the love

Donald Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ వాణిజ్య రంగాన్ని కుదిపే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన దిగుమతి సుంకాల అమలును జూలై 9 నుంచి ఆగస్టు 1కి వాయిదా వేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచ దేశాలకు తాత్కాలిక ఊరటను ఇచ్చినప్పటికీ, ఆగస్టు 1 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనే అనిశ్చితి కొనసాగుతోంది. అసలు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? ఏ దేశాలపై ప్రభావం పడుతుంది?

తన టారిఫ్ లతో ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని వణికించారు. కొద్ది నెలల క్రితం టారిఫ్ ల వ్యవహారంపై పెద్ద చర్చే జరగగా.. తాజా మరోసారి ట్రంప్ ఏం చేస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే మరోనెల టారిఫ్ లా వాతను ట్రంప్ వాయిదా వేయడం కొన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. తాజాగా ట్రంప్ అధికారికంగా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇందులో జూలై 9న అమలవ్వాల్సిన టారిఫ్‌లను ఆగస్టు 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, 14 దేశాలకు పంపిన లేఖలు, వాటిలో పేర్కొన్న టారిఫ్ శాతం, ట్రూత్ పోస్టు వేదికపై వాటిని పబ్లిక్‌గా పోస్ట్ చేయడం ఇవన్నీ సంప్రదాయ దౌత్యాన్ని పక్కన పెట్టి ట్రంప్ చేస్తున్న విచిత్రమైన చర్యలుగా పలువురు భావిస్తున్నారు. అయితే టారిఫ్ లు అమెరికా ఆర్థిక స్వావలంబనకు తీసుకున్న కీలక అడుగు అని ట్రంప్ అంటున్నారు. ఈ లేఖల్లో జపాన్, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మయన్మార వంటి దేశాలకు ప్రత్యేకంగా టారిఫ్ శాతం పేర్కొనబడింది.

ఈ టారిఫ్ లేఖల ప్రకారం జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, కజకస్తాన్, ట్యూనీషియా దేశాలపై 25% సుంకం విధించనున్నారు. దక్షిణాఫ్రికా, బోస్నియా దేశాలపై 30%, ఇండోనేషియాపై 32%, బంగ్లాదేశ్, సెర్బియాపై 35%, కాంబోడియా, థాయ్‌లాండ్‌పై 36%, మయన్మార్, లావోస్‌పై 40% సుంకం విధించనున్నారు. ఈ టారిఫ్‌ల్లో ఇప్పటికే ఉన్న స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్ రంగాలపై ఉన్న సుంకాలకు అదనంగా ఉండవు. జపాన్ కార్లపై ఇప్పటికే ఉన్న 25% సుంకం కొనసాగుతుంది, కానీ అదనంగా పెరగదు. ట్రంప్ లేఖల్లో మీరు భారీగా టారిఫ్ పెడితే, తాము వాటిని కలిపి మరింత పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.

ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని మరింత బలంగా వినిపించాలన్న ఉద్దేశంతో ఈ టారిఫ్ ల అంశాన్ని ముందుకు తీసుకువచ్చారు. మీ దేశం నుంచి వస్తువులు దిగుమతి అవ్వాలంటే, మీరు అమెరికాలోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అనే సందేశాన్ని ఆయన ఈ లేఖల ద్వారా పంపిస్తున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడికి పంపిన లేఖలో మీ కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి చేస్తే, సుంకాలు ఉండవు. మేము అనుమతులు త్వరగా ఇస్తాం అని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది అమెరికాలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇది వాస్తవానికి సాధ్యమా? ఒక కంపెనీకి అమెరికాలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం అంటే, భూమి, కార్మికులు, మౌలిక సదుపాయాలు అన్నీ అవసరం. ఇవన్నీ తక్కువ సమయంలో సాధ్యం కాదు. పైగా, అమెరికాలో కార్మిక ఖర్చులు ఎక్కువగా ఉండటంతో, కంపెనీలు లాభాలు కోల్పోయే అవకాశం ఉంది. Donald Trump Tariffs.

ట్రంప్ నిర్ణయం మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ట్రంప్ లేఖలు విడుదల చేసిన వెంటనే, జపాన్, దక్షిణ కొరియా కంపెనీల షేర్లు పడిపోయాయి. టయోటా షేరు 4% తగ్గింది, హోండా షేరు 3.9% తగ్గింది. S&P, డౌజోన్స్ సూచీలు పడిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఈ నిర్ణయాన్ని ఆర్థిక ఒత్తిడిని పెంచే చర్యగా అభివర్ణిస్తున్నారు. అమెరికా దిగుమతిదారులు ఈ సుంకాల భారాన్ని భరించలేరని, దీని ప్రభావం వినియోగదారులపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ కూడా ఈ సుంకాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని సూచించింది. అంతేకాదు, ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రపంచ దేశాలు తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయలేకపోతే, వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా కుదేలవుతాయి.

ఇప్పటికే అమెరికా యునైటెడ్ కింగ్‌డమ్, వియత్నాం వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. భారత్‌తో కూడా చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, మిగతా దేశాలపై మాత్రం తాము లేఖలు పంపుతాం. ఒప్పందం కుదరకపోతే, సుంకాలు అమలవుతాయి అనే స్పష్టమైన హెచ్చరికను ఇచ్చారు. ట్రంప్ చెప్పిన ప్రకారం, ఈ సుంకాలు ఇప్పటికే ఉన్న ఇతర రంగాలపై విధించిన సుంకాలకు అదనంగా ఉండవు. ఉదాహరణకు, జపాన్ కార్లపై ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకానికి అదనంగా ఏమీ ఉండదని స్పష్టం చేశారు. కానీ ఇది నిజంగా ఊరట కలిగించే విషయం కాదు. ఎందుకంటే, ఇప్పటికే ఉన్న సుంకాలు తక్కువేం కావు. వాటికి అదనంగా ఏమీ లేకపోయినా, వాటిని కొనసాగించడం వల్లే కంపెనీలు నష్టపోతున్నాయి. పైగా, ట్రంప్ చెప్పిన విధంగా మీరు ప్రతికార సుంకాలు పెడితే, తాము మరింత పెంచుతాం అనే హెచ్చరిక, వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చు.

భారత్‌కు మాత్రం తాత్కాలిక ఊరట లభించింది. ట్రంప్ ఏప్రిల్ 2న ప్రకటించిన 26 శాతం రెసీప్రెకల్ టారిఫ్ భారత్‌పై అమలవ్వాల్సి ఉంది. కానీ తాజా కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం, ఆగస్టు 1 వరకు భారత్‌పై టారిఫ్ అమలు వాయిదా వేయబడింది. ఇది భారత్‌కు చర్చలు కొనసాగించేందుకు అవకాశం కల్పించింది. భారత్ తన పరిధిని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులో ఉంది అని భారత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఒక రకంగా ట్రంప్ భారత్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందన్న సంకేతం. కానీ ఇది తాత్కాలిక ఊరట మాత్రమే. ఆగస్టు 1 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టత లేదు.

ట్రంప్ తీసుకున్న తాజా టారిఫ్ నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంబంధాలపై దీర్ఘకాల ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆగస్టు 1 వరకు వాయిదా పెట్టిన సుంకాల అమలు తర్వాత, 14 దేశాలపై ఖచ్చితంగా టారిఫ్‌లు అమలవుతాయా లేక మళ్లీ చర్చలు జరిపే అవకాశం ఉందా అనే అనుమానాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ వదిలిన లేఖలు, సోషల్ మీడియాలో చేసిన పోస్టులు, అమెరికాలో కార్మిక శాఖ రూపొందిస్తున్న కొత్త డొమెస్టిక్ ప్రియార్టీ బిల్ ఇవన్నీ కలిపి చూస్తే, ట్రంప్ 2026 ఎన్నికల వ్యూహంలో స్వదేశీయ న్యాయబద్ధతను రాజకీయంగా ప్రధానంగా వాడుకునే సూచనలు కనిపిస్తుంది. అంతేకాదు హెచ్చరిక లేఖలు పంపితే చాలు. దేశాలు ఒప్పందం కోసం పరుగులు తీయాలి అనే ట్రంప్ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితిలో కొన్ని దేశాలు అమెరికా నిర్ణయాలు WTO నిబంధనలకు విరుద్ధం అని తెలిపాయి. ఈ విషయంపై WTO డిస్ప్యూట్ బోర్డు సమావేశం నిర్వహించబోతోంది. మరోవైపు ట్రంప్ టారిఫ్ ల వల్ల టెక్నాలజీ రంగంలో, ముఖ్యంగా సెమీ కండెక్టర్ల దిగుమతులపై సుంకాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇంటెల్, ఏఎండీ, క్వాలకామ్ వంటి కంపెనీలు తమ ప్రస్తుత సరఫరా శ్రేణిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

Also Read: https://mega9tv.com/international/israels-series-of-wars-relentless-attacks-on-enemies-gaza-iran-and-houthi-attack-in-yemen/