సమోసా, జిలేబీ తినొద్దంటోన్న కేంద్ర ఆరోగ్య శాఖ…?!

Spread the love

The Union Health Ministry: సిగరెట్ల మాదిరిగానే ఇప్పుడు సమోసా, జిలేబీల వంటి చిరుతిళ్లపై కూడా ఆరోగ్య హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అంటే సమోసా, జిలేబీ తినొద్దు.. తింటే మీరు పోతారు అనే బోర్డులు ఇక షాపుల దగ్గర దర్శనమివ్వనున్నాయి. అసలు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోనుంది..? నిజంగా సమోసా, జిలేబీ అంత ప్రమాదకరమా..? ఇంకా ఏ ఇతర ఆహార పదార్థాలు తింటే ప్రమాదమని ఆరోగ్య శాఖ చెబుతోంది..?

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్, లడ్డూ వంటి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహారాలపై ఆయిల్ అండ్ షుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ బోర్డులు సిగరెట్ ప్యాకెట్లపై ఉండే హెచ్చరికల మాదిరిగా, ఈ చిరుతిళ్లలో దాగి ఉన్న కొవ్వు, చక్కెర, కేలరీల సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తాయి. భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఊబకాయం సమస్య ఈ చర్య వెనుక ప్రధాన కారణం . లాన్సెట్ జర్నల్ అంచనా ప్రకారం, 2050 నాటికి భారత్‌లో 44.9 కోట్ల మంది ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది, ఇది ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ స్థానం. ఈ బోర్డులు కేంద్ర సంస్థలైన AIIMS నాగ్‌పూర్ వంటి ప్రదేశాల్లో క్యాంటీన్లు, పబ్లిక్ ఏరియాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా ఉద్యమంతో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా నూనె వినియోగాన్ని 10% తగ్గించడం, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడానికి ఈ చర్యలు ఉపయోగడపతాయని భావిస్తున్నారు.

నూనెతో కూడిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా డీప్-ఫ్రైడ్ చిరుతిళ్లు, ఊబకాయానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్ వంటి ఆహారాలలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్స్, రిఫైన్డ్ షుగర్, కేలరీలు ఉంటాయి. ఒక జిలేబీలో దాదాపు 5 టీస్పూన్ల చక్కెర, ఒక వడాపావ్‌లో 300 కేలరీలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది, ఇది ఊబకాయంతో పాటు గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్స్, రిఫైన్డ్ షుగర్‌లు గుండె జబ్బులకు కారణం అవుతాయి. అలాగే, తక్కువ శారీరక శ్రమ, పేలవమైన ఆహారపు అలవాట్లు ఊబకాయం సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. WHO నివేదిక ప్రకారం, ఊబకాయం టైప్-2 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, ఎముకల సమస్యలు, నిద్రలేమి సమస్యలకు కూడా దారితీస్తుంది. The Union Health Ministry.

అధిక కొవ్వు, చక్కెర కలిగిన చిరుతిళ్లు ఊబకాయానికి ఎక్కువగా దారితీస్తాయి. ఈ జాబితాలో సమోసా, జిలేబీ, గులాబ్ జామున్, పకోడీ, కచోరీ, వడాపావ్, బనానా చిప్స్, బర్గర్, చాక్లెట్ పేస్ట్రీలు, సాఫ్ట్ డ్రింక్స్ ప్రధానమైనవి. ఈ ఆహారాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి.. గుండె జబ్బులకు కారణమవుతాయి. ఒక సమోసాలో దాదాపు 20-25 గ్రాముల కొవ్వు, 200-300 కేలరీలు ఉంటాయి, అలాగే, జిలేబీ, గులాబ్ జామున్ వంటి స్వీట్లలో అధిక చక్కెర కంటెంట్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను వేగంగా పెంచుతుంది, ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక కేలరీలు, తక్కువ ఫైబర్ కలిగిన ఈ ఆహారాలు శరీర బరువును వేగంగా పెంచుతాయి.

భారత్‌లో ఊబకాయం ఒక సైలెంట్ ఎపిడెమిక్ గా మారుతోంది. WHO ప్రకారం, 2022లో ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది పెద్దలు అధిక బరువుతో ఉన్నారు, వీరిలో 89 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. భారత్‌లో, ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. పిల్లలలో ఊబకాయం కూడా వేగంగా పెరుగుతోంది, దీనికి ప్రధాన కారణాలు పేలవమైన ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ. 2022లో, 5-19 సంవత్సరాల వయస్సు గల 39 కోట్ల మంది పిల్లలు, యువకులు అధిక బరువుతో ఉన్నారు, వీరిలో 16 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. లాన్సెట్ జర్నల్ అంచనా ప్రకారం, 2050 నాటికి భారత్‌లో 44.9 కోట్ల మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉండవచ్చు. పట్టణీకరణ, జంక్ ఫుడ్ వినియోగం, జీవనశైలి, ఒత్తిడి వంటి అంశాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఊబకాయం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్, కొన్ని క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.

బరువు పెరిగే సమస్యకు వార్నింగ్ లా ఈ హెచ్చరిక బోర్డులు ఉపయోగపడతాయని అంటున్నారు. అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలను వస్తున్నాయి. కొందరు నెటిజన్లు, ఈ చర్య భారతీయ సాంప్రదాయ ఆహారాలను టార్గెట్ చేసినట్టు ఉందని అంటున్నారు. కోలా, చిప్స్, బర్గర్ వంటి వెస్టర్న్ జంక్ ఫుడ్‌లపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహనను పెంచుతుందని, ఊబకాయంతో పాటు డయాబెటిస్, గుండె జబ్బులను నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు. కేవలం సమోసా, జిలేబీతోనే కాదు.. ఇతర బరువు పెంచే ఆహార పదార్థాలకు ఈ బోర్డులు పెడతామని చెబుతున్నారు.

ఊబకాయం నుంచి బయటపడటానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు కీలకం. పిల్లలలో ఆహార అవగాహన, స్కూల్స్‌లో డైటరీ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడం ద్వారా ఊబకాయాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, లీన్ ప్రోటీన్, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకర కొవ్వులను తీసుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్స్, రిఫైన్డ్ షుగర్ ఉన్న ఆహారాలను తగ్గించాలి. సమోసా, జిలేబీ వంటి చిరుతిళ్లను అప్పుడప్పుడు తినడం మంచిది, కానీ రెగ్యులర్‌గా తీసుకోవడం మానాలి. జిలేబీకి బదులు వేరే స్వీట్లను ఎంచుకోవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా కేలరీలను బర్న్ చేయవచ్చు. పిల్లలలో శారీరక ఆటలను ప్రోత్సహించాలి. ఆహార పదార్థాలపై ఉన్న న్యూట్రిషన్ లేబుల్స్‌ను చదవడం, కేలరీలు, చక్కెర, కొవ్వు సమాచారాన్ని తెలుసుకోవడం. డీప్-ఫ్రైడ్ ఆహారాలకు బదులు బేక్డ్ లేదా రోస్టెడ్ స్నాక్స్, సలాడ్‌లను ఎంచుకోవడం వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు.

Also Read: https://mega9tv.com/national/chhangur-baba-claims-that-he-is-innocent-and-refutes-religious-conversion-allegations/