
Chhangur baba Religious conversion: భారత్ లో మత మార్పిడిల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ మత మార్పిడుల కోసం విదేశాల నుంచి భారీగా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమా అవుతున్నట్టు ఈడీ గుర్తించింది.. అసలు ఏ మతం నుంచి మార్పిడిలు జరుగుతున్నాయి..? ఈడీ ఎలాంటి అక్రమ లావాదేవీలను గుర్తించింది..? ఏ రాష్ట్రాల్లో ఎక్కువ మత మార్పిడిలు జరుగుతున్నాయి..?
భారత్ లో మత మార్పిడిలు కామన్ అయిపోయాయి. ప్రేమ, సామాజిక పరిస్థితులు, రిజర్వేషన్లు వంటి కారణాలతో కొంతమంది మతాన్ని మార్చుకుంటున్నాయి. అయితే మతాలను మార్చడమే పనిగా పెట్టుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. దీని కోసం విదేశాల నుంచి భారీగా నగదును సేకరిస్తున్నారు. అలాంటి ఓ బాబాను ఈడీ గుర్తించింది. విదేశీల నుంచి సొమ్ములు పోగేసి.. అక్రమంగా మతమార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియస్ చంగూర్‌బాబా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బాబా ఆర్థిక మూలాలను కనిపెట్టేపనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిమగ్నమైంది. అతడికి సంబంధించిన 30 బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. మరో 18 ఖాతాలా సమాచారం వెలుగులోకి వచ్చింది. వీటిల్లో దాదాపు రూ.68 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటికి గత మూడునెలల్లోనే విదేశాల నుంచి రూ.7 కోట్లు బదిలీ అయినట్లు తేలింది. అతడి చీకటి ఆర్థిక కార్యకలాపాల నెట్‌వర్క్‌లో ఈ ఖాతాలు కూడా భాగమని అధికారులు చెబుతున్నారు.
జలాలుద్దీన్ మతమార్పిడుల రాకెట్‌ను నిర్వహించే క్రమంలో కోడ్ భాషను ఉపయోగించేవాడు. తాజాగా యూపీ ఏటీఎస్ దీనిని ఛేదించింది. అతడి బృందం లక్ష్యంగా ఎంచుకొన్న మహిళలను ప్రాజెక్ట్ అని.. మతమార్పిడిని మిట్టీ పలట్నా అని.. మానసికంగా సదరు మహిళను మభ్యపెట్టడాన్ని కాజల్ కర్నా అని, జలాలుద్దీన్‌తో భేటీ ఏర్పాటు చేయడాన్ని దీదార్ అని కోడ్ భాషలో పిలిచేవారు. చంగూర్‌బాబా ఆర్థిక నెట్‌వర్క్ భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అతడికి భారత్, నేపాల్‌లో 100 వరకు ఖాతాలున్నట్లు భావిస్తున్నారు. గత మూడేళ్లలో అతడికి రూ.500 కోట్ల విదేశీ నిధులు అందగా.. వాటాల్లో రూ.300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకోసం నేపాల్ సరిహద్దులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. అతడికి ముఖ్యంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ నుంచి నిధులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. చంగూర్ బాబాకు సంబంధించి బలరామ్‌పుర్‌లోని భారీ విల్లాను ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. ఇందులో కొన్ని గదులను ఇప్పటికే కూలగొట్టారు. ఇప్పటికే ఏటీఎస్ బృందం చంగూర్‌బాబాను ప్రశ్నించి.. పలు కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకుంది. చంగూర్‌బాబా దాదాపు 15 ఏళ్లుగా మతమార్పిడి రాకెట్‌ను వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నాడని గుర్తించారు.
భారత్‌లో మత మార్పిడులు చాలా కాలంగా జరుగుతున్నా.. ఇటీవలి కాలంలో ఇవి రాజకీయ, సామాజిక వివాదంగా మారాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మతాల మధ్య మార్పిడులు జరుగుతున్నాయి. కొన్ని మార్పిడులు స్వచ్ఛందంగా జరుగుతుంటే, మరికొన్ని బలవంతంగా, మోసపూరితంగా జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 2020లో కేరళలో 506 మంది మతం మారారని ప్రభుత్వ గెజిట్‌లో నమోదైంది. 144 మంది ఇస్లాంలోకి, 119 మంది క్రైస్తవంలోకి మారారు, ఇందులో ఎక్కువగా ఈజవ, తియ్య, నాయర్ సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. ఉచిత విద్య, వైద్యం, ఆర్థిక సహాయం వంటివాటికి ఆకర్షితులై పేద, దళిత, ఆదివాసీలు మతం మారుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్రైస్తవ మిషనరీలు గిరిజన ప్రాంతాల్లో స్కూల్స్, హాస్పిటల్స్, ఆర్ఫనేజ్‌లు నడుపుతూ, వాటి ద్వారా మత ప్రచారం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇస్లాం మతంలోకి మార్పిడులు జరుగుతున్నా.. వాటిపై ఎక్కువగా లవ్ జిహాద్ వంటి ఆరోపణలు వస్తున్నాయి. అటు హిందూ మతంలోకి ఘర్ వాపసీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, ఇవి సంఘ్ పరివార్ సంస్థలైన ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌ల ద్వారా నడుస్తున్నాయి.
మత మార్పిడులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న భారత్‌లో ఎప్పటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. క్రైస్తవ మత మార్పిడులకు విదేశీ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 2016లో కాంపస్సియన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ భారత్‌లోని NGOలకు నిధులు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది., ఎందుకంటే ఈ నిధులు మత మార్పిడుల కోసం ఉపయోగించబడుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. చెన్నైలోని కరుణా బాల్ వికాస్ అనే NGO, 2011-15 మధ్య విదేశీ నిధులను మత కార్యక్రమాల కోసం ఉపయోగించిందని, కేవలం 10% నిధులు మాత్రమే విద్య, ఆరోగ్యం కోసం వాడారని CBI నివేదికలు చెబుతున్నాయి. ఈ నిధులు వాటికన్, క్రైస్తవ దాతృత్వ సంస్థలు, పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు, ఇటు ఇస్లాం మత మార్పిడులకు నిధులు స్థానికంగా, విదేశాల నుంచి వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో చంగూర్ బాబా పలువురు మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు 15 సంవత్సరాలుగా ఒక రాకెట్ నడిపాడని, విదేశీ నిధులతో సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. Chhangur baba Religious conversion.
అటు ప్రపంచ వ్యాప్తంగా మత మార్పిడిలు.. వివిధ కారణాలతో జనాభాలో వివిధ మతాల వారి సంఖ్య మారుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోందని ప్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో ఏ మతాన్ని పాటించని వారి సంఖ్య పెరుగుతోందని, క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతోందని తెలిపింది. ఈ సంస్థ 2010-20 మధ్య కాలంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవంలో జనాభా ఈ పదేళ్లలో 1.8% మేర తగ్గి.. ప్రపంచ జనాభాలో 28.8శాతానికి పడిపోయింది. అయినా.. అతిపెద్ద మత సముదాయంగా క్రైస్తవం కొనసాగుతోంది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9% నుంచి 25.6శాతానికి పెరిగింది. ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ఎదుగుతోంది. ఇక ఏ మతంతో సంబంధం లేదని చెప్పుకొనే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. హిందువులు 15% నుంచి 14.9శాతానికి తగ్గిపోయారని.. అయితే.. వారి సంఖ్య పెరిగిందని వివరించింది. 2010లో ప్రపంచంలో 110 కోట్ల మంది హిందువులు ఉండగా.. 2020లో ఆ సంఖ్య 120 కోట్లకు పెరిగింది. బౌద్ధులు, యూదులు, ఇతర మతస్థుల జనాభా కూడా తగ్గుతోందని పేర్కొంది. కాగా.. మతమార్పిడి అనేది హిందువులు, ముస్లింలలోనే అతి తక్కువగా ఉన్నట్లు వెల్లడిచింది. ప్రపంచంలోని హిందువుల్లో 95%మంది భారత్‌లోనే ఉంటున్నారు. 2010లో భారత్‌లో హిందువుల జనాభా 80% కాగా.. 2020కి ఇది 79 శాతానికి పడిపోయింది. అదే సమయంలో భారత్‌లో ముస్లింల జనాభా14.3% నుంచి 15.2 శాతానికి పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది.