పుతిన్ కు ట్రంప్ డెడ్ లైన్..?!

Spread the love

Trump And Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే కఠినమైన టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. ఈ సుంకాలు రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కూడా ఉంటాయని తెలిపారు. నిజంగా ట్రంప్ ఇచ్చిన ఫైనల్ డెడ్ లైన్ ఇదేనా..? అసలు పుతిన్ ఎందుకు శాంతి చర్చలకు ఒప్పుకోవడం లేదు? రష్యా డిమాండ్‌లు ఏమిటి? రష్యా శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే మిత్రదేశాలపై ఎలాంటి ప్రభావం పడనుంది?

గతంలో అమెరికా తన సైనిక శక్తిని చూపించి.. దేశాలను బయటపెట్టేంది. కాని ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత టారిఫ్ ల పేరు చెప్పి ప్రపంచ దేశాలను భయపెడుతోంది అమెరికా. ఇప్పుడు ఉక్రెయన్ విషయంలో రష్యాను టారిఫ్ పేరు చెప్పే ట్రంప్ భయపెడుతున్నారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్‌తో జరిగిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ రష్యాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 50 రోజుల్లో ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే, రష్యాపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ సుంకాలు రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై కూడా ఉంటాయన్నారు. దీనివల్ల రష్యాను ఆర్థికంగా ఒంటరిగా చేయొచ్చని ట్రంప్ భావిస్తున్నారు. తాము పుతిన్‌తో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నామని.., ఉదయం పుతిన్ మంచిగా మాట్లాడి.. రాత్రి ఉక్రెయిన్ పై పుతిన్ దాడులు చేయిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. ఇలా మూడు, నాలుగు సార్లు జరిగిన తర్వాత, ఈ మాటలకు అర్థం లేదని అర్థమవుతుందని అన్నారు. ఇప్పుడు చర్చల బదులు.. చర్యలు తీసుకుంటేనే పుతిన్ దారికి వస్తారని ట్రంప్ భావిస్తున్నారు. దీనికి సుంకాలు ఒక్కటే పరిష్కార మార్గమని చెబుతున్నారు డోనాల్డ్ ట్రంప్. రష్యా ఎగుమతులు, ముఖ్యంగా చమురు, సహజ వాయువులపై సుంకాలు విధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకం. అయితే ట్రంప్ ఈ సుంకాలను ఎలా అమలు చేస్తారనేది స్పష్టంగా తెలియలేదు, కానీ కాంగ్రెస్ కొత్త చట్టం ద్వారా ఆయనకు ఈ అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఒక్క రష్యాపైనే కాదు ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ సెకండరీ సుంకాలు విధించనున్నారు. ముఖ్యంగా రష్యన్ చమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలపై ఈ సుంకాలు ఉండనున్నాయి. ఈ దేశాలలో చైనా, భారతదేశం, బ్రెజిల్, టర్కీ ఉన్నాయి. 2024లో భారతదేశం రష్యన్ చమురు ఎగుమతులలో 35% భాగాన్ని కొనుగోలు చేసి, చైనాను అధిగమించింది, చైనా 19% కొనుగోలు చేసింది. టర్కీ కూడా 2023లో రష్యా నుండి 58% శుద్ధి చేసిన పెట్రోలియం దిగుమతి చేసుకుంది. ఈ సుంకాలు విధించడం వల్ల ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడవచ్చు, ఎందుకంటే అవి అమెరికా మార్కెట్‌లో వాణిజ్యం కోసం రష్యన్ చమురును వదులుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ గతంలో వెనిజులా, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 25% సుంకాలు విధించారు, ఇది చైనాపై గణనీయమైన ప్రభావం చూపింది. రష్యాపై సుంకాలు కూడా ఇలాంటి ఒత్తిడిని సృష్టించే అవకాశం ఉంది. Trump And Putin.

పుతిన్ ఎందుకు శాంతికి ఒప్పుకోవడం లేదు?
ట్రంప్ ఒత్తిడి ఉన్నప్పటికీ, పుతిన్ శాంతి చర్చలకు ఒప్పుకోవడం లేదు. రష్యా ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలను ఆక్రమించుకుంది. అక్కడి నుంచి వెనక్కు తగ్గడం రష్యాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ ప్రాంతాల కోసం ఉక్రెయిన్‌తో యుద్ధం తప్పనిసరి. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరకుండా అడ్డుకోవడం రష్యాకు ఎంతో ముఖ్యం. ట్రంప్ ప్రతిపాదించిన 30-రోజుల కాల్పుల విరమణను పుతిన్ తిరస్కరించారు, ఎందుకంటే ఉక్రెయిన్ ఈ సమయంలో పశ్చిమ దేశాల ఆయుధాలతో తిరిగి సన్నద్ధమవుతుందని ఆయన భావిస్తున్నారు. వీటితో పాటు పుతిన్ యూరోపియన్ సెక్యూరిటీ విధానంలో మార్పులు కోరుతున్నారు. ఇందులో నాటో రష్యా వైపు దృష్టి పెట్టడం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు, యూరోపియన్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌లను తొలగించడం వంటివి కూడా పుతిన్ డిమాండ్లలో ఉన్నాయి. అయితే డిమాండ్‌లు ఉక్రెయిన్, పశ్చిమ దేశాలకు ఆమోదయోగ్యంగా లేవు, ఎందుకంటే అవి ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రాజీపడేలా చేస్తాయి. నాటో సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయి. పుతిన్ ఈ డిమాండ్‌లను వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల శాంతి చర్చలు ముందుకు సాగడం లేదు. దీంతో మూడేళ్లుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకోవడం, డొన్బాస్ ప్రాంతంలో ఏర్పాటు వాదుల తిరుగుబాటును సమర్థించడంతో ప్రారంభమైంది. 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడిని ప్రారంభించింది. దీనిని పుతిన్ ప్రత్యేక సైనిక ఆపరేషన్ గా పేర్కొన్నారు. ఈ యుద్ధం మూడు సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది, రష్యా ఉక్రెయిన్‌లోని 20% ప్రాంతాన్ని ఆక్రమించింది. 2025 జూలై వరకు, రష్యా రాత్రివేళల్లో కీవ్‌తో సహా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ కూడా కుర్స్క్ ప్రాంతంలో రష్యన్ భూభాగంలోకి చొచ్చుకొని, రష్యా లోపల డ్రోన్ దాడులు నిర్వహిస్తోంది. ఈ యుద్ధం ఇప్పటి వరకు వేలాది మరణాలకు, మిలియన్ల మంది వలసలకు, రెండు దేశాల్లో మౌలిక సదుపాయాల నాశనానికి దారితీసింది.

అటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచంలో ఎక్కువగా గోధుమలు, సన్ ఫ్లవర్ ఆయిల్, సహజ వాయువు, చమురు ఎగుమతి చేసే దేశాల్లో రష్యా, ఉక్రెయిన్‌ ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య వల్ల యుద్ధం ఆహారం, ఇంధన ధరల పెరుగుదలకు కారణమైంది. 2022-2023లో గ్లోబల్ ఇన్‌ఫ్లేషన్ గణనీయంగా పెరిగింది, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార సంక్షోభాలకు దారితీసింది. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు గ్లోబల్ సప్లై చైన్‌లను దెబ్బతీశాయి, ముఖ్యంగా యూరప్‌లో సహజ వాయువు కొరత ఏర్పడింది. రష్యా తన చమురు ఎగుమతులను చైనా, భారతదేశం, టర్కీ వంటి దేశాలకు మళ్లించింది, దీనివల్ల ఈ దేశాలు రష్యన్ చమురుపై ఆధారపడ్డాయి. మరోవైపు ఈ యుద్ధం నాటోను మరింత బలోపేతం చేసిందని కూడా చెప్పొచ్చు. ఇదే అవకాశంగా ఫిన్లాండ్, స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేశాయి. యూరప్ దేశాలు రష్యన్ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక శక్తి, ఎల్‌ఎన్‌జీ దిగుమతులపై దృష్టి సారించాయి.

అయితే ఇప్పుడు ట్రంప్ .. రష్యాకు 50 రోజుల డెడ్ లైన్ విధించారు. ట్రంప్ తాజా బెదిరింపులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పును తెలియజేస్తున్నాయి. ట్రంప్ గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీని విమర్శించి, రష్యాతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. కానీ, పుతిన్ నిరంతర దాడులు, శాంతి చర్చలలో సహకరించకపోవడం ట్రంప్‌ను నిరాశపరిచాయి. ట్రంప్ ఉక్రెయిన్‌కు పాట్రియాట్ మిస్సైల్ సిస్టమ్‌లతో సహా అత్యాధునిక ఆయుధాలను నాటో ద్వారా సరఫరా చేయడానికి అంగీకరించారు, దీనిని యూరోపియన్ దేశాలు ఆర్థికంగా సమర్థిస్తాయి. ఈ చర్య ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. అయితే ట్రంప్ టారిఫ్ బెదిరింపులను రష్యా పెద్దగా పట్టంచుకోవడం లేదు. 50 రోజుల్లో యుద్ధంలో, లేదా ట్రంప్ వైఖరిలో మార్పులు రావొచ్చని అంటున్నారు.

Also Read: https://mega9tv.com/slideshow/singapore-is-the-most-luxury-city-to-live-in-says-julius-baer-global-wealth-report-2025/