కడప యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది..?

Spread the love

YSR Architecture and Fine Arts University: కడప జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకుండానే మూడు బ్యాచ్‌లు అడ్మిషన్లు స్వీకరించింది. మొదటి బ్యాచ్‌ మరో నెలరోజుల్లో కోర్సు పూర్తి కాబోతున్నా గుర్తింపు ధ్రువపత్రాలు దక్కే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది. తమ పాలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైసీపీ నేతలు, ఇప్పుడు విద్యార్ధులకు మద్దతుగా ధర్నాలు చేయడం విడ్డూరంగా మారింది.

హైదరాబాద్‌లో ఉన్న ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ఏపీలోనూ ఉండాలనే ఉద్దేశంతో 2020లో కడప కేంద్రంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్​ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి తీసుకోకుండానే నాటా ప్రవేశ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులైన వారిని కోర్సుకు ఎంపిక చేసింది. 2020లో అడ్మిషన్లు ప్రారంభించి 2021, 2022లో విద్యార్థులను చేర్చుకుంది. మొదటి బ్యాచ్ విద్యార్థుల ఐదేళ్ల కోర్సు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఐతే ఇంతవరకూ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అనుమతి లేకపోవడంతో పరీక్షలు రాసినా ప్రయోజనం ఏంటని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారట. సర్టిఫికెట్లు లేకుండా బయటికి వెళ్లి ఏం చేయాలని ఆక్రోశిస్తున్నారు.

ఇక ఇంటర్మీడియట్ అర్హత ఆధారంగా ప్రవేశ పరీక్ష లేకుండా చేర్చుకుంటున్నా మొత్తం సీట్లు భర్తీ కావడం లేదట. ఏటా ఏప్రిల్, మే మధ్యలో యాడ్ సెట్ ప్రవేశాలు నిర్వహించాల్సి ఉండగా, ఈ ఏడాది జూన్ నెల రెండోవారం దాటినా నోటిఫికేషన్ ఇవ్వలేదని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ హయాంలో జగన్ మోహన్ రెడ్డి సొంత బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిని కడప ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించుకున్నారు. ఆ సమయంలో అనేక అక్రమాలకు జరిగినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయట. విద్యార్థుల జీవితాలతో ముడిపడున్న సమస్యపై కూటమి ప్రభుత్వమైనా దృష్టి పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. YSR Architecture and Fine Arts University.

మరో విషయం ఏంటంటే, తమ సమస్యపై విద్యార్దులు ఆందోళనకు దిగుతున్నారు. వీరికి మద్దతుగా వైసీపీ నేతలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కామెడీగా మారినట్లు తెలుస్తోంది. తమ పాలన కాలంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి తీసుకు రావడంలో నిర్లక్ష్యం వహించిన వైసీపీ నేతలు, ఇప్పుడు విద్యార్ధులకు మద్దతుగా ఆందోళనకు దిగడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారట. ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి యూనివర్శిటీ అనుమతి కోసం ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదంతా గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా చాలా మంది చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం యూనివర్శిటీ అనుమతి కోసం ప్రయత్నించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/nara-lokesh-mangalagiri-constituency-mla-is-moving-forward-towards-development/