
SIR Bihar Voters List Revision: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఓటర్ల జాబితా సవరణ దేశ రాజకీయాల్లో పెను తుపానుగా మారింది. ఈ వివాదం రాజకీయపరంగా వివాదాన్ని రగిలించడమే కాక, పార్లమెంట్‌లోనూ పొలిటికల్ హీట్ పెంచింది. అసలు బిహార్ లో ఓటర్ల అంశంపై రచ్చ ఎందుకు జరుగుతోంది? విపక్షాలు ఈ అంశంపై ఎందుకు ఆందోళన చేస్తున్నాయి? అధికార ఎన్డీయే కూటమి ఏమంటోంది? ఎన్నికల కమిషన్, సుప్రీం కోర్టు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నాయి? బీహార్ ఎన్నికల బలాబలాలు ఎలా ఉన్నాయి?
మరికొద్ది రోజుల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో అప్పుడే చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. దీనికి బిహార్లలో చేపట్టిన SIR ప్రధాన కారణం. ఎన్నికల కమిషన్ బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -SIR అనే ప్రత్యేక ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియలో, 2025 జులై 1 నుంచి రెండు నెలల పాటు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేశారు. ఈ సవరణలో, 52 లక్షల నుంచి 61 లక్షల ఓటర్ల పేర్లు లేవు. వీరిలో కొందరు మరణించారని గుర్తించారు. మరికొన్ని డూప్లికేట్‌గా గుర్తించి జాబితా నుంచి తొలగించారు. అయితే ఈ విధంగా పెద్ద ఎత్తున జరిగిన సవరణ విపక్షాలకు అనుమానాలు కలిగించింది. వారు ఈ ప్రక్రియను ప్రజాస్వామ్యానికి ముప్పుగా చూస్తూ, దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, దళితులు, మైనారిటీలు, పేదలు, వలస కార్మికుల ఓటరు హక్కులు దెబ్బతిన్నాయని విపక్షాలు వాదిస్తున్నాయి. ఈ అంశం బీహారలో రాజకీయ చర్చను రగిలించి, పార్లమెంట్‌లోనూ గట్టి ఆందోళనలకు దారితీసింది. SIR Bihar Voters List Revision.
బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాలు పార్లమెంట్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. లక్షలాది ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా, దళితులు, మైనారిటీలు, వలస కార్మికులు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. సవరణ ప్రక్రియలో పారదర్శకత లేదని, ఓటర్లకు తమ పేర్లు తొలగించబడిన విషయం తెలియజేయకుండా జరిగిందని వాదిస్తున్నారు. ఈ సవరణ ఎన్డీయే కూటమి రాజకీయ లబ్ధి కోసం జరిగిందని, ఎన్నికల్లో విపక్షాల ఓటు బ్యాంక్‌ను బలహీనపరిచే ప్రయత్నమని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. దీని పోరాటం చేసేందుకు అవసరమైతే ఈ ఎన్నికల బహిష్కరిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాల్లో, విపక్ష ఎంపీలు ఈ అంశంపై రెండు రోజుల పాటు తీవ్రంగా నిరసనలు తెలిపారు. వారు ఈ ఓట్ల సవరణను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఎన్నికల కమిషన్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేత రాబ్రీ దేవి, ఓటర్ల హక్కులను లాక్కుంటున్నారు అని విమర్శించారు.
అయితే అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ నేతలు ఈ వివాదాన్ని విపక్షాల రాజకీయ నాటకంగా అభివర్ణించారు. ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల ముందు జరిగే సాధారణ ప్రక్రియ అని, గతంలో 2003లో కూడా ఇలాంటి ఇంటెన్సివ్ రివిజన్ జరిగిందని గుర్తు చేశారు. మరణించినవారు, వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్లు, చట్టవిరుద్ధ ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా జాబితాను శుద్ధి చేయడమే లక్ష్యమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో 97% ఓటర్ల వివరాలు ధృవీకరించబడ్డాయని, మిగిలిన వారికి తమ పేర్లను తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని జేడీయూ నేతలు తెలిపారు. విపక్షాలు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నాయి బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
బీహార్ లో జరుగుతున్న ఈ సవరణ ప్రక్రియను రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించారు. మరణించినవారు, వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్లను గుర్తించి తొలగించారు. ఓటర్లకు తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశం ఇచ్చారు, సరైన ఆధారాలతో తిరిగి నమోదు చేసుకోవచ్చని కూడా తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరిగిందని, ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా నిర్వహించబడిందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ప్రతి అర్హత ఉన్న పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది, కానీ జాబితా శుద్ధీకరణ అవసరం అని వారు స్పష్టం చేశారు.
బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ అధికారాలను ఉపయోగించవచ్చు, కానీ సవరణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరగాలని స్పష్టం చేసింది. ఓటర్ల పేర్లను తొలగించే ముందు ఆధార్, ఓటరు ఐడీ, రేషన్ కార్డు వంటి ధృవీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఓటర్లు లేదా రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశం ఉండాలని, సరైన కారణాలతోనే పేర్లను తొలగించాలని ఆదేశించింది. అయితే, సవరణ ప్రక్రియను పూర్తిగా ఆపాలని కోర్టు ఆదేశించలేదు.
బీహార్ అసెంబ్లీ పదవీకాలం 2025 నవంబర్ 22న ముగుస్తుంది. ఎన్నికల కమిషన్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ కలిసి ఉన్నాయి. విపక్ష ఇండియా కూటమి లో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ ఉండగా.. ఇప్పుడు ప్రధానంగా ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య పోటీ ఉండనుంది. సంక్షేమ పథకాలు, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలపై నితీశ్ కుమార్ పార్టీ ఆధారపడుతోంది. ఓటర్ల జాబితా వివాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ, దళితులు, మైనారిటీలు, యువత, మహిళల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఉంది ఇండియా. నిరుద్యోగం, సామాజిక న్యాయం, కుల ఆధారిత రాజకీయాలు ప్రధాన అంశాలుగా తెలుస్తున్నాయి. ఓటర్ల జాబితా వివాదం, నిరుద్యోగం, కుల రాజకీయాలు, సామాజిక న్యాయం ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి.