
Nepal PM Sushila Karki: భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు. భౌగోళిక, రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి రీత్యా వీటన్నిటినీ కలిపి ఉప ఖండం అని పిలుస్తుంటారు. వీటిలో శ్రీలంకకు 65 ఏళ్ల కిందటే ఓ మహిళ ప్రధానమంత్రి అయ్యారు. భారత్ కు 60 ఏళ్ల క్రితమే ఆ ఘనత దక్కింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకూ మహిళలు ప్రధానులు అయ్యారు. భూటాన్ లో రాజరికం ఉంది కాబట్టి చాన్స్ లేదు. చాలా చిన్నది కాబట్టి మాల్దీవుల సంగతి వదిలేద్దాం. కానీ, నేపాల్ లో మాత్రం మహిళలకు ఇప్పటివరకు ప్రధానిగా ఆ ఛాన్సే రాలేదు. అనూహ్యంగా ఇప్పుడు మాత్రం ఓ మహిళ ఆ పీఠంపై కూర్చున్నారు.
సోషల్ మీడియాపై ప్రభుత్వ నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్ యువత చేపట్టిన ఆందోళనలు చివరకు అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారాయి. ఈ క్రమంలో హింస చెలరేగి.. 25 మందికిపైగా చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. అయితే, నిరసనకారులు ఆవేశంతో రెచ్చిపోయి.. ప్రజా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అంతేకాదు, మంత్రులు, అధికారులుపై దాడులకు పాల్పడ్డారు. మంత్రులను వీధుల్లో పరిగెత్తిస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారం రోజులుగా అక్కడ కల్లోల పరిస్థితి నెలకుంది.
నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. తాత్కాలిక ప్రధాన మంత్రిగా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల్ కర్కి పేరును ప్రకటించారు. ఆమె అభ్యర్ధిత్వంపై జెన్ జి, ఆర్మీ, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్లమెంట్‌ను అధ్యక్షుడు రద్దుచేయడంతో తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ కర్కి ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాని ఎంపికపై అధ్యక్షుడు, జెన్-జీ ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. సైనిక హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ఈ చర్చల్లో అధ్యక్షుడితోపాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముందుగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కిను జెన్ జి ప్రతిపాదించింది. తర్వాత కాఠ్మాండూ మేయర్ బాలేంద్ర షా, విద్యుత్తు బోర్డు మాజీ సీఈవో కుల్మన్ ఘీషింగ్, ధరణ్ మేయర్ హర్కా సంపంప్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, జెన్ జి ప్రతినిధులు పట్టువీడకపోవడంతో జస్టిస్ సుశీలను ప్రధానిగా ఎంపికచేయక తప్పలేదు. శుక్రవారం అర్ధరాత్రిలోగా కొత్త ప్రధాని పేరును ప్రకటించకుంటే అద్యక్ష భవనాన్ని పేల్చేస్తామని జెన్ జి ఆందోళనకారులు అల్టిమేటం జారీచేశారు. దీంతో అధ్యక్షుడు, ఆర్మీ దిగిరాక తప్పలేదు. జస్టిస్ కర్కి అభ్యర్ధిత్వానికి వారు ఆమోదం తెలిపారు. దీంతో ఆమె తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా ఓ అరుదైన రికార్డు అందుకున్నారు.
నేపాల్ కు తొలి మహిళా చీఫ్ జస్టిస్ సుశీల కర్కినే. ఇప్పుడు తొలి మహిళా ప్రధాని కూడా అయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించే వరకు సుశీల పదవిలో కొనసాగనున్నారు. కాగా, ఉద్యమకారులైన జెన్ జెడ్ యువతతో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ ఆశోక్ రాజ్ సిగ్దెల్, సామాజికవేత్తలు, న్యాయ నిపుణులు పలు దశల చర్చలు సాగించిన అనంతరం సుశీల పేరుకు ఆమోదం లభించింది.
ఇక ఈమె 1952 జూన్ 7న జన్మించారు. టీచర్ గా జీవితాన్ని ప్రారంభించినా.. న్యాయవాదిగా స్థిరపడ్డారు. విధి నిర్వహణలో నిజాయతీ పరురాలిగా పేరొందారు. 2009లో నేపాల్ సుప్రీంకోర్టులోకి అడుగుపెట్టారు. 2016లో చీఫ్ జస్టిస్ అయ్యారు. తాజా జెన్ జెడ్ ఉద్యమంలోనూ సుశీల కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యమైన విషయం ఏమంటే ఈమె భారత్ లోని బనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. భారత ప్రధాని మోదీతో స్నేహ సంబంధాలు ఉన్నట్లు ఇటీవలే తెలిపారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గాన్ని గతంలో బనారస్ గానూ పిలిచేవారు.
2012లో అవినీతి కేసులో ఒక మంత్రికి శిక్ష విధించిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆమె ఒకరు. అవినీతిపై నేపాల్ చేస్తున్న పోరాటంలో ఇది అప్పట్లో ఒక సంచలనం. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఆమె తీసుకున్న కఠిన వైఖరి ఆమెకు ఉన్నత పదవిని కోల్పోయేలా చేసిందని విశ్లేషకులు చెబుతారు. ప్రధాన న్యాయమూర్తిగా ఆమె పదవీకాలం ఏడాది పూర్తి కాకముందే ప్రభుత్వం ఆమెపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నించింది. ప్రజా ఒత్తిడితో ఆ ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వ వైఖరితో నిరాశకు గురైన కర్కీ స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు.
వ్యక్తిగతంగా చెప్పాలంటే, ఆమె ఒక కఠినమైన న్యాయమూర్తి. ఎవరికీ భయపడరు. న్యాయరంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆమె పవర్ ఏంటో తెలుసు..” అని నేపాల్ బార్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ కేదార్ ప్రసాద్ కొయిరాలా అన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా ఆమె అవినీతిపై గళం విప్పుతూనే ఉన్నారు. “మనం ప్రతిచోటా అవినీతిని చూస్తున్నాం, కానీ మాట్లాడటం లేదు. ఇప్పుడు యువత ముందుకు వచ్చి, నాయకత్వం వహించి, ఎన్నికల్లో నిలబడాలి,” అని ఆమె ఈ ఏడాది మొదట్లో నేపాలీ మీడియాతో చెప్పారు. Nepal PM Sushila Karki.
భారత్‌తో తనకున్న అనుబంధాన్ని ఆమె తరచుగా గుర్తు చేసుకుంటారు. తన పూర్వీకుల ఇల్లు భారతదేశానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉందని చెప్పారు. ఆమె బీహెచ్‌యూలో తన రోజుల గురించి కూడా గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘమైన న్యాయ జీవితం తర్వాత, సుశీలా కర్కీ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రాణాంతక నిరసనల తర్వాత, నేపాల్‌లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి, సైన్యం రోడ్లపై పెట్రోలింగ్ చేస్తోంది, ప్రతిపక్ష నాయకులు తలదాచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఆమె ముందున్న ప్రధాన సవాలు అన్ని పార్టీల మద్దతును పొంది, దేశంలో హింస, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడటం. ఆమె న్యాయ రంగంలో అద్భుతంగా రాణించారు, తనను తాను నిరూపించుకున్నారు. కానీ, రాజకీయ నాయకురాలిగా ఆమె ఎలా రాణిస్తారో కాలమే నిర్ణయిస్తుంది.