
Amazon Guava Leaves Online: జామ కాయలకే కాదు వాటి ఆకులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ డిమాండ్ బహిరంగ మార్కెట్ లో కాదండోయ్.. ఆన్ లైన్ అంగట్లో.అవునా..? నిజమా? ఆన్ లైన్ లో ఆకులు అమ్ముకోవటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. జామ ఆకులతో చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయని తెలియడంతో ఎండిన, పచ్చి జామాకులను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అదనుగా ఈ-కామర్స్ సైట్ అయిన అమెజాన్ 50 జామ ఆకులను ఏకంగా 300కు అమ్ముతోంది. మరో సైట్ ఎండిపోయిన 20 జామ ఆకులను 300కు దర్జాగా విక్రయిస్తోంది. గతేడాది ఈ జామాకులతోనే దాదాపుగా 1300 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో జామ తోట సాగు చేసే రైతుల పంట పండినట్లైంది. జామ ఆకులతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఏర్పడింది.
సంజీవనీ పుట్టుకొచ్చిన నేల మనది. ప్రపంచాన్నే బతికిస్తున్న వేప పండే భూమి మనది. వేలాది రకాల పూలు, పళ్లు, ఆకుకూరల తోటలకు నిలయం మన భారత దేశం. ఈ భూమ్మీద వందల, వేల రకాల మొక్కలు ఉన్నాయి. వాటన్నిటిలో భారతదేశంలోనే 90శాతం పెరుగుతుంటాయి. అలాంటి మన దేశంలో ప్రతీ మొక్క విలువైనదే. ప్రతీ చెట్టుకు ఓ ఔషధ గుణం ఉంటుంది. అలాంటి మొక్కలు మనముందే ఉన్నా పట్టించుకోం. మన పెరట్లోనే పెరుగుతున్నా చూడము. అందులో ఒకటి మన జామచెట్టు. పేద వాడి ఆపిల్ గా పిలిచే జామ కాయల వల్ల కలిగే లాభాలు తెలుసు.. వాటికి మార్కెట్ లో ఉండే డిమాండ్ తెలుసు. కానీ లేటెస్టుగా ఔషధ గుణాల లక్షణాలు అధికంగా ఉండడంతో జామాకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
ప్రస్తుత బిజీ లైఫ్‌లో.. మనం ఏం తింటున్నాం.. ఎప్పుడు తింటున్నామన్నది పెద్దగా పట్టించుకోవడంలేదు. విపరీతమైన కాలుష్యం మన శరీరంలో ప్రవేశిస్తోంది. భయట తినే ఆహారం కూడా కలుషితం అయిపోతోంది. దీంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. హెల్త్ బాగుండాలంటే మంచి లైఫ్స్టేలే కాదు.. సరైన డైట్ కూడా ఇప్పుడు అవసరం. ఇప్పుడిప్పుడే చాలా మంది ప్రజల్లో ఆరోగ్య స్పృహ వస్తోంది. ప్రతీరోజు తాము తీసుకునే డైట్లో ఆర్గానిక్ ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి ఆర్గానిక్ ఆరోగ్యానికి సరికొత్త ఔషధంగా మారింది జామ ఆకు పొడి. ఈ జామ పౌడర్ కలిపిన టీలు, కషాయాలు ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి.ఒకప్పుడు ఈ జామ ఆకుల పొడిని మన పూర్వికులు మౌత్ ఫ్రెష్నర్గా వాడేవారు. జామాకులో చింతపండు పెట్టుకుని తిన్న జనరేషన్ కూడా ఉంది. ఈ పొడి వల్ల అనేక ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ ఉండడంతో జామాకులకు ఆన్ లైన్ లో డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది.
ఒకప్పుడు నర్సరీలలో క్లోనింగ్ అనంతరం మిగిలిన జామ ఆకులను చెత్తగా భావించి తగలబెట్టేవారు. ఇప్పుడు అది చెత్త కాదు వారి పాలిట వరమైంది. ఈ జామాకు కోసం వ్యాపారులు ఎగబడుతుండడంతో నర్సరీ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. నర్సరీల్లో కుప్పలుగా పేరుకుపోయే ఈ జామ ఆకును.. వ్యాపారులు కిలోకి 20 నుంచి 50 రూపాయల వరకు ఇచ్చి కొని మార్కెట్ చేస్తున్నారు. జామ తోటలకు కూడా వచ్చి మరీ జామ ఆకులను సేకరిస్తున్నారు. అలా కొన్న జామాకులను వ్యాపారులు గోడౌన్లు, ఖాళీ ప్రదేశాల్లో ఎండబెట్టి, దానిని పొడిగా చేసి బెంగళూరు, చెన్నైతోపాటు.. ఇతర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి జామ ఆకుల పొడిని.. డికాషనల్లా ఉపయోగించి తేనెతోపాటు తీసుకుంటే ఎంతో ఉపయోగకరం అని పలు పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. అందుకే ఇంత డిమాండ్ ఉందని ట్రేగ్ నిపుణులు చెబుతున్నారు. టన్ను జామ ఆకు ధర 35 నుంచి 40 వేల రూపాయలు పలుకుతుందంటే దానికున్న డిమాండ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.అంతే కాదు ఆకుల కోసం బెంగళూరు, చెన్నై నుంచి వ్యాపారుల సైతం తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారట. Amazon Guava Leaves Online.
జామలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని డైట్, న్యూట్రీషన్ నిపుణులు చెబుతున్నారు. కల్తీ లేని ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది ఒక జామకాయేనని అంటున్నారు. ఒంట్లో వేడి కారణంగా ఆరోగ్యం దెబ్బతిన్నా.. నోటి రుగ్మతలు ఏర్పడినా జామాకు నమిలితే వెంటనే ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు జామాకు మంచి ఔషధం. వేడి నీటిలో జామ ఆకుల్ని మరిగించి ఉదయం కషాయంలా తాగితే దీర్ఘకాలిక రోగాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. మరి జామ సాగు చేసే రైతులు ఆకులకు మార్కెట్ ఎక్కడుందో తెలుసుకుని వారికి విక్రయిస్తే అదనపు ఆదాయం పొందవచ్చు. అంతే కాదు ఆకులను మీరే ప్రాసెస్ చేసి విక్రయిస్తూ మరింత సొమ్ము చేసుకోవచ్చు.