‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్.. హీరోగా బాలీవుడ్ స్టార్.!

Spread the love

Sankranthiki Vasthunam Remake Hindi: విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం గత సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కేవలం తెలుగులోనే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ విజయం తరువాత, బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించనున్నారట.

అక్షయ్ కుమార్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, రీమేక్‌లకు పెట్టింది పేరు అయిన అక్షయ్‌కి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి విజయవంతమైన సినిమా రీమేక్ మంచి అవకాశం అని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. అక్షయ్ కూడా ఈ రీమేక్‌పై ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. తెలుగులో నిర్మించిన దిల్ రాజునే హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, ఇందుకోసం బాలీవుడ్ మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. కథ ప్రకారం, తన భార్య, నలుగురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో, ఒక ప్రమాదకరమైన మిషన్‌లో భాగంగా మళ్లీ విధుల్లోకి వస్తాడు. ఈ మిషన్‌లో అతని భార్యతో పాటు మాజీ ప్రేయసి కూడా భాగం కావడంతో హాస్యం, గందరగోళం ఒకేసారి చోటు చేసుకుంటాయి. తెలుగులో వెంకటేష్ కామెడీ టైమింగ్, ఐశ్వర్య రాజేష్ అద్భుతమైన నటన, అనిల్ రావిపూడి దర్శకత్వం సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ ఈ కామెడీ పాత్రలో సులభంగా ఒదిగిపోగలరని చాలామంది అభిప్రాయపడుతున్నారు. Sankranthiki Vasthunam Remake Hindi.

హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేస్తేనే ఈ రీమేక్ విజయం సాధించగలదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించే ప్రముఖ హిందీ దర్శకుడిని ఎంపిక చేసినట్లు సమాచారం. అక్షయ్‌తో పాటు ఇద్దరు హీరోయిన్లు స్క్రీన్‌ను పంచుకోనున్నారని తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వార్తలపై తెలుగు నెటిజన్లు దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు. ఆయన అత్యాశతో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ రీమేక్ తప్పకుండా ఫ్లాప్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.