
Nakkapalli Bulk Drug Park: అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, రాయవరం మండలాల్లో ఏర్పడుతున్న బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు వివాదాలకి కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు మత్స్యకారులు పార్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే మరోవైపు బల్క్ డ్రగ్ పార్క్ పనులు వేగం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజయ్యపేటలో 35 రోజులుగా మత్స్యకారుల ఆందోళన చేస్తున్నారు. అసలు బల్క్ డ్రగ్ పార్క్ పై జరుగుతున్న వివాదంపై మెగా 9టీవీ ప్రత్యేక కథనం
విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో నక్కపల్లి మండలంలో గతంలో సేకరించిన భూమిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఓవైపు పనులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో బల్క్ డ్రగ్ పార్క్ పై నక్కపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. బల్క్ ట్రక్ పార్క్ ఎట్టి పరిస్థితిలో ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులు పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నినాదించారు. మరోవైపు పరిశ్రమలు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
ఇక మరోవైపు నక్కపల్లి మండలంలోని ప్రభుత్వం సేకరించిన భూములలో ఏపీఐఐసీ పనులు ప్రారంభించింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. తమ గ్రామం చుట్టూ బల్క్ డ్రగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై రాజయ్యపేట గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో తమ పోరాటాన్ని ప్రారంభించారు.
గ్రామంలో తమ పోరాటంపై పోలీసుల ఆంక్షలు నడుమ రాజయ్యపేట గ్రామస్తులు నిరాహార దీక్షలు చేపట్టారు. 35 రోజులుగా వేటకు సైతం వెళ్లకుండా గ్రామస్తులంతా ధర్నా కొనసాగిస్తున్నారు.
రాజయ్యపేట సమీపంలో 2,200 ఎకరాల్లో ప్రభుత్వం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ పార్క్ ఏర్పాటైతే ఇక్కడ వందలాది ప్రమాదకర రసాయన పరిశ్రమల యూనిట్లు ఏర్పాటు చేస్తారని, ఫలితంగా ఈ ప్రాంతమంతా కాలుష్యమయం అవుతుందని మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ రాజయ్యపేట మత్స్యకారులు రోజులుగా గ్రామంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఈ ఆందోళనకు పోలీసులు అనేక అడ్డంకులు కల్పిస్తున్నారంటూ మత్స్యకారులు ఆవేదనతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో 15 రోజుల క్రితం పనుల్ని అడ్డుకున్నారు. హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టడంతో గత నెల 30న హోంమంత్రి అనిత గ్రామంలోకి వచ్చారు. మంత్రిని కూడా అడ్డుకుని ఘెరావ్ చేశారు. మత్స్యకారుల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని, పనులు తాత్కాలికంగా నిలిపివేయిస్తానని హామీ ఇచ్చారు హోమంత్రి అనిత.
గ్రామం నుంచి 30 మంది కమిటీగా వస్తే సీఎం దగ్గరకు తీసుకెళ్తా నని ప్రకటించారు. ఇది జరిగి 35 రోజులు గడుస్తున్నా హోంమంత్రి నుంచి గాని, ప్రభుత్వం నుంచి గాని ఎటువంటి స్పందన లేదు. మత్స్యకారులు గ్రామంలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మత్స్యకారులకు సంఘీభావంగా వచ్చే వివిధ రాజకీయ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. స్థానికేతరులను గ్రామంలోకి రానివ్వడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. N.akkapalli Bulk Drug Park
దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణను ఉపమాకలో అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో రగిలిపోయిన మత్స్యకారులు ఆదివారం మధ్యాహ్నం నిరాహార దీక్ష శిబిరం నుంచి 6 కిలోమీటర్ల దూరం ర్యాలీగా వెళ్లి నక్కపల్లి జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. మార్గంమధ్యలో పోలీసులు మత్స్యకారులను ట్రాక్టర్లు, ఐరన్ స్టాపర్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నప్పటికీ వాటిని తొలగించుకుంటూ వందలాది మంది మహిళలు, మత్స్యకారులు జాతీయ రహదారిపై ఉపమాక జంక్షన్ వద్ద ధర్నాకు దిగారు.
తక్షణమే బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేయాలని ఆందోళనకు దిగిన మత్స్యకారులు డిమాండ్ చేశారు. మత్స్యకారులు, నాయకులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని, రాజయ్యపేటలో అమల్లో ఉన్న 144వ సెక్షన్ ఎత్తివేయాలని, మత్స్యకారులకు సంఘీభావంగా వచ్చే వివిధ పార్టీల నాయకులను అడ్డుకోవడానికి వీల్లేదని, ర్యాలీ సందర్భంగా మహిళలపై దౌర్జన్యం చేసి గాయపర్చిన ఎస్.రాయవరం సీఐ లొడ్డు రామకృçష్ణను, నక్కపల్లి ఎస్ఐ సన్నిబాబును సస్పెండ్ చేయాలని పోలీసులు అడ్డుకున్న వీసం రామకృష్ణను తక్షణమే ఆందోళన వద్దకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు.