భక్తుల భద్రతే ప్రథమం…ఫుడ్ క్వాలిటీలో రాజీ లేదు..తిరుమలలో గోబీ వంటకాలకు బ్రేక్

Spread the love

ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల. భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల కొండపై ఒక ప్రముఖ వంటకాన్ని పూర్తిగా నిషేధిస్తూ టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్  సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే తిరుమల కొండపైకి వెళ్లిన తర్వాత చాలామంది భక్తులు చైనీస్ ,  ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇష్టంగా తినే ఐటమ్స్.. గోబీ మంచూరియా, గోబీ 65,  గోబీ రైస్. కానీ ఇకపై తిరుమలలో ఎక్కడ చూసినా ఈ గోబీ వంటకాలు అసలు కనిపించవు. క్యాలీఫ్లవర్‌  తో తయారు చేసే అన్ని రకాల వంటకాలను తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తక్షణమే నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి ప్రధాన కారణం.. క్యాలీఫ్లవర్‌లో పురుగులు వస్తున్నాయంటూ భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడమే. ముఖ్యంగా ఈ సీజన్లలో క్యాలీఫ్లవర్‌ లోపల కంటికి కనిపించని సన్నటి పురుగులు ఎక్కువగా ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో శుభ్రం చేయకుండా, హడావిడిగా వంటల్లో ఉపయోగిస్తే భక్తుల ఆరోగ్యానికి, కడుపు సంబంధిత సమస్యలకు దారి తీసి తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. 

భక్తుల  ఫిర్యాదుల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల తిరుమలలోని పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిజంగానే కొన్ని చోట్ల క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉన్నట్లు అధికారులు స్వయంగా గుర్తించారు. దీంతో టీటీడీ హెల్త్ వింగ్  అప్రమత్తమైంది. తిరుమలలో ప్రస్తుతం సుమారు 162 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, 7 జనతా కాంటీన్లు,  5 పెద్ద కాంటీన్లు భక్తులకు సేవలు అందిస్తున్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం హోటల్ నిర్వాహకులందరితో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ ఒక అత్యవసర సమావేశం నిర్వహించారు. క్యాలీఫ్లవర్ వినియోగం వల్ల భవిష్యత్తులో రాబోయే అనారోగ్య సమస్యల గురించి వారికి స్పష్టంగా వివరించారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు ఎవరికీ లేదని, తక్షణమే గోబీ వంటకాలను మెనూ నుంచి తొలగించాలని ఆయన గట్టిగా సూచించారు. 

అధికారుల సూచనలకు హోటల్ నిర్వాహకులు కూడా సానుకూలంగా స్పందించారు. గోబీ రైస్, గోబీ మంచూరియా లాంటి వాటికి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఈ రోజు నుంచే వాటి తయారీని పూర్తిగా నిలిపివేయడానికి వారు అంగీకరించారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని టీటీడీ హెచ్చరించింది.  అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. తిరుపతి నుంచి తిరుమలకు ప్రతిరోజూ టన్నుల కొద్దీ కూరగాయలు సరఫరా అవుతుంటాయి. ఇకపై ఆ వస్తువుల్లో అసలు క్యాలీఫ్లవర్ కొండపైకి రాకుండా చూడాల్సిన బాధ్యతను కూడా అధికారులు తీసుకుంటున్నారు. ఇందుకోసం టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉంది. 

ఇదంతా ఒక ఎత్తైతే, తిరుమలలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రంలో పరిస్థితి ఏంటి? ఇక్కడ క్యాలీఫ్లవర్ వాడకంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రతిరోజూ రెండు లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ భోజనం చేస్తుంటారు. ఇందుకోసం రోజుకు దాదాపు 20 టన్నుల కూరగాయలు దాతల ద్వారా టీటీడీకి ఉచితంగా అందుతున్నాయి. దాతలు విరాళంగా ఇచ్చే ఈ కూరగాయల్లో అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్ కూడా భారీగానే కొండపైకి చేరుతోంది. దాన్ని ఉపయోగించి అన్నదానం ట్రస్ట్ వారు కూరలు  తయారు చేస్తున్నారు. ప్రస్తుతం హోటళ్లకు మాత్రమే బ్రేక్ వేసిన టీటీడీ ఆరోగ్య విభాగం, అన్నదానం సత్రంలో కూడా ఈ క్యాలీఫ్లవర్‌ను వాడాలా వద్దా అనే దానిపై త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనుంది.  టీటీడీ అధికారికంగా పూర్తి స్థాయి నిషేధం విధిస్తే, దాతల నుంచి కూడా క్యాలీఫ్లవర్‌ను స్వీకరించడం పూర్తిగా నిలిపివేస్తామని అన్నదానం విభాగం అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా, రోజుకు లక్ష మందికి పైగా వచ్చే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రంలో, భక్తుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *