చంద్రబాబు సంకల్పం:తీరిన వెలిగొండ ప్రాజెక్టు స్వప్నం..!

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రే దాన్ని పూర్తి చేసి ప్రారంభించడం అరుదైన విషయం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు విషయంలో అదే జరుగుతోంది. ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభానికి సిద్ధంగా ఉంది.ఉమ్మడి రాష్ట్రంలో నాడు ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తుండడం గమనార్హం. తొలుత 1994లో దీనికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధమైంది. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతం, కడప జిల్లాలోని బద్వేల్ ప్రాంతాల్లోని మొత్తం 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు. మార్కాపురం, యర్రగొండపాలెం నుంచి పలుసార్లు శాసనసభ్యునిగా గెలిచిన పూల సుబ్బయ్య ఈ ప్రాంతాలకు నీటిని అందించడం కోసం చేసిన పోరాటాన్ని గౌరవిస్తూ ఆయన పేరు మీద ఈ ప్రాజెక్టుకు “పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు” అని నామకరణం చేశారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది, తద్వారా రైతుల ఆదాయాలు మెరుగుపడతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. తాగునీటి సమస్య తీరడంతో ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, వలసలు తగ్గుతాయి. గతంలో తరచుగా కరువుతో అల్లాడిన ఈ ప్రాంతాలు ఇప్పుడు సస్యశ్యామలం కానున్నాయి. భూగర్భ జల మట్టాలు పెరుగుతాయి, పర్యావరణ సమతుల్యతకు కూడా ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా, కనిగిరి, మార్కాపురం వంటి ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావంతో బాధపడుతున్న ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వస్తుంది, ఇది వారి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం పట్ల ప్రజలు, ముఖ్యంగా ప్రకాశం జిల్లా రైతులు, ఎంతో సంతోషంగా ఉన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూసిన ఈ కల నెరవేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు తమ జీవితాలను మార్చేస్తుందని, తమ పొలాలకు కొత్త జీవం పోస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు ప్రాజెక్టు ఆలస్యంపై విమర్శలు చేసినప్పటికీ, ప్రస్తుతం దీని పూర్తి పట్ల సానుకూల వాతావరణం నెలకొంది. ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది.

ఇక ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్‌-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.  తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైందని  అన్నారు. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును తన చేతుల మీదుగా ప్రారంభిస్తుండడం పట్ల ఆ ప్రాంత వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు విడుదల చేయబోతున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి ఈ నెల 31వ తేదీ మార్కాపురం జిల్లా వేదిక కాబోతోంది. ఫేజ్‌-1తో 1.19 లక్షల ఎకరాలకు… ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరును… అలాగే లక్షలాది మందికి తాగునీటిని అందించి, తరతరాలుగా కరువుతో పోరాడిన ప్రజలకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వం  లక్ష్యమని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు.  31వ తేదీ నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు… ఈ ప్రాంత అభివృద్ధికి సరికొత్త జవసత్వాలను ఇవ్వనున్నాయి.  పశ్చిమ ప్రకాశం ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చాం. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా చేసేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.  నేషనల్ హైవేలు, పోర్టులతో ఈ ప్రాంతానికి లాజిస్టిక్స్ లోటు లేకుండా చేస్తున్నారు. బెంగుళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టులతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త బాటలు వేస్తున్నారు.  ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రజల జీవితాలు మార్చాలి, వెనుకబాటును దూరం చేయాలనే గట్టి పట్టుదలతో శ్రీశైలం మల్లన్న నుండి  మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకువస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.  ప్రతి రైతు పొలానికి నీరు… ప్రతి యువకుడికి ఉపాధి… ప్రతి కుటుంబానికి భరోసా… ఇదే ‘సీబీఎన్ అనే నేను’ సంకల్పం. ప్రతి పౌరుడూ అనే నేను స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *