భారత్ అంత సాయం చేసినా…మాల్దీవుల డబుల్ గేమ్!

గ్లోబల్ పాలిటిక్స్ లో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఇప్పుడు ఒక పెద్ద చదరంగం నడుస్తోంది. వ్యూహాత్మకంగా భారత్‌కు అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న మాల్దీవులు.. ఇప్పుడు ప్రమాదకరమైన డబుల్ గేమ్ ఆడుతోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అధికారంలోకి రాగానే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాల్దీవుల ప్రజలను రక్షించడానికి భారత్ పంపిన హెలికాప్టర్లను నడిపే సైనిక సిబ్బందిని వెనక్కి పంపించి వివాదానికి తెరలేపారు. ఆ తర్వాత మాల్దీవుల ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోవడం, టూరిజం దెబ్బతినడంతో దారికొచ్చి.. నెమ్మదిగా భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేశారు. భారత్ కూడా పెద్దన్న పాత్ర పోషించి ఆర్థిక సాయం అందించింది. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో, ముయిజ్జు తన తాజా పర్యటనతో ఇండియాకు పెద్ద షాక్ ఇచ్చారు. ఒకవైపు భారత్‌తో స్నేహం నటిస్తూనే, మరోవైపు దాయాది దేశం పాకిస్థాన్‌తో సీక్రెట్ డీల్స్ కుదుర్చుకుంటూ డబుల్ గేమ్స్ ఆడుతున్నారు .
అక్టోబర్ 20 నుంచి 22 వరకు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు పాకిస్థాన్‌లో అధికారికంగా పర్యటించారు. గత 11 ఏళ్లలో ఒక మాల్దీవుల అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన వేళ ఈ పర్యటన జరగడం విశేషం. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ముయిజ్జు జరిపిన చర్చల అనంతరం.. ఇరు దేశాల మధ్య ఏకంగా 20 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పర్యాటకం లాంటి సాధారణ అంశాలతో పాటు.. అత్యంత వ్యూహాత్మకమైన రక్షణ, సముద్ర భద్రత , పోలీసింగ్ లాంటి సున్నితమైన రంగాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య కేవలం 1.3 కోట్ల డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, రాబోయే రెండేళ్లలో 20 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇది వినడానికి బాగానే ఉన్నా.. అసలు పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో ప్రపంచానికి తెలిసిన విషయమే. మరి అలాంటి దేశం మాల్దీవులకు వ్యవసాయం, పర్యాటకం లాంటి రంగాల్లో ఏమి సాయం చేయగలదు? అనే అనుమానం రాక మానదు. ఈ వాణిజ్య ఒప్పందాలన్నీ కేవలం ఒక ముసుగు మాత్రమే. దీని వెనుక ఉన్న అసలు టార్గెట్ రక్షణ, సముద్ర భద్రతా ఒప్పందాలు. ఇండియాను ఇరిటేట్ చేయడానికి పాకిస్థాన్ వేసిన ఎత్తుగడకు, ముయిజ్జు సులభంగా ఆకర్షితుడయ్యారనే టాక్ వినిపిస్తోంది.



