స్టార్ లింక్ తెగిందా..?..పుతిన్ కోసం జెలెన్స్కీకి అమెరికా వెన్నుపోటు?
కామెంట్లు (0)

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడు సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ ఒకవైపు ఫిరంగులు, క్షిపణులతో భౌతిక యుద్ధం జరిగితే, ఇప్పుడు టెక్నాలజీ కేంద్రంగా మరో సైలెంట్ వార్ మొదలైంది. రష్యా లాంటి అగ్రరాజ్యాన్ని ఉక్రెయిన్ ఇన్నాళ్లు నిలువరించగలిగింది అంటే దానికి ప్రధాన కారణం వారి డ్రోన్ దాడులు, కమ్యూనికేషన్ వ్యవస్థ. దానికి వెన్నెముకగా నిలిచింది ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అందిస్తున్న స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు. కానీ, ఇప్పుడు అదే స్టార్‌లింక్ ఉక్రెయిన్ సైన్యానికి ఊపిరి ఆడకుండా చేస్తోంది. ఉక్రెయిన్ సైనిక డ్రోన్ల దాడులు, గగనతల రక్షణ వ్యూహాలను తీవ్రంగా దెబ్బతీసేలా స్టార్ లింక్ సేవలను నిలిపివేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
ఉక్రెయిన్ సైన్యంలోని డ్రోన్ యూనిట్లు పూర్తిగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ మీదే ఆధారపడి పనిచేస్తాయి. ముఖ్యంగా హులియైపోల్ సెక్టార్లో పనిచేస్తున్న బలగాలకు ఈ కమ్యూనికేషన్ చాలా కీలకం. ఎప్పుడైతే స్పేస్ ఎక్స్ ఈ సేవలపై ఆంక్షలు విధించిందో, ఆ క్షణం నుంచే హులియైపోల్ సెక్టార్లో కమ్యూనికేషన్ వైఫల్యం తలెత్తింది. డ్రోన్లకు సిగ్నల్స్ అందకపోవడం, టార్గెట్స్ లాక్ అవ్వకపోవడంతో ఉక్రెయిన్ సైన్యం తమ కీలకమైన అటాక్ మిషన్లను మధ్యలోనే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఒక యుద్ధభూమిలో కమ్యూనికేషన్ లోపిస్తే సైన్యం ఎంతటి ప్రమాదంలో పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కళ్లెదుటే రష్యా బలగాలు వస్తున్నా ఎదురుదాడి చేయలేని నిస్సహాయ స్థితిలోకి ఉక్రెయిన్ సైన్యం ఉంది.
ఈ పరిణామం ఉక్రెయిన్ డిఫెన్స్ ను వీక్ చేసింది. ఈ సాంకేతిక ఆంక్షలతో తమ దేశం మరింత ప్రమాదకర స్థితిలోకి నెట్టబడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సైన్యం ఈ పరిస్థితుల్లో ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్‌కు కారణమైన ఎలాన్ మస్క్ ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ఈ వివాదంపై మస్క్ స్పందిస్తూ.. స్టార్‌లింక్ అనేది ప్రధానంగా పౌర అవసరాలు , రక్షణ రంగానికి మాత్రమే ఉద్దేశించిన వాణిజ్య సేవ. దాన్ని మీరు దురాక్రమణలకు, డ్రోన్ దాడులు లాంటి అఫెన్సివ్ సైనిక చర్యలకు ఉపయోగిస్తామంటే కుదరదు అని చాలా స్పష్టంగా తేల్చిచెప్పారు. ఇంటర్నెట్ ఇచ్చింది ప్రజల ప్రాణాలు కాపాడటానికి అంతేకాని యుద్ధ చర్యల కోసం కాదనే మోడ్ లో స్పందించారు. సైనిక స్థాయి ఆపరేషన్ల కోసం, మిలిటరీ కమ్యూనికేషన్ల కోసమే ప్రత్యేకంగా స్టార్‌షీల్డ్ అనే సేవలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ స్టార్‌షీల్డ్ సేవలు ఎవరికి ఇవ్వాలి, వాటిపై ఎలాంటి ఆంక్షలు విధించాలి అనేది పూర్తిగా అమెరికా ప్రభుత్వం, అమెరికా సైన్యం నియంత్రణలోనే ఉంటాయి అని వెల్లడించారు.



