భారత్ చేతిలో మరో అద్భుత అస్త్రం నాగాస్త్ర-2

భారత సైన్యం, ఫ్యూచర్ వార్ఫేర్ కోసం తన అమ్ములపొదిని భారీగా అప్‌గ్రేడ్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీకి ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ.. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో నాగాస్త్ర-2 ను తయారు చేసి భారత ఆర్మీకి అధికారికంగా అప్పగించింది.
లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో గాల్లోనే చక్కర్లు కొడుతూ, టార్గెట్ దొరికిన వెంటనే దానిపైకి దూసుకెళ్లి పేలిపోయే అత్యాధునిక ఆయుధం. మన నాగాస్త్ర-2 సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. ఈ డ్రోన్ ఏకధాటిగా 60 నిమిషాల పాటు గాల్లో ఎగురుతూ లక్ష్యాలను వెతుకుతుంది. ఇందులో పగలు, రాత్రి వేళల్లో.. ఎంతటి ప్రతికూల వాతావరణంలోనైనా స్పష్టంగా చూడగలిగే అత్యాధునిక ఎలక్ట్రో-ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను అమర్చారు. పాకిస్థాన్ , చైనా సైన్యానికి చెందిన అత్యంత కఠినమైన, బరువైన యుద్ధ ట్యాంకులను నాశనం చేయడానికి వీలుగా నాగాస్త్ర-2లో 4 కిలోల బరువైన ట్యాండమ్ షేప్డ్-ఛార్జ్ వార్‌హెడ్ ను అమర్చారు. దీని ఇంపాక్ట్ ఎంతలా ఉంటుందంటే.. శత్రు ట్యాంకులకు ఉండే 650 మిల్లీమీటర్ల మందపాటి ఉక్కు కవచాన్ని సైతం ఇది వెన్నలా కోసుకుంటూ లోపలికి వెళ్లి పేలిపోతుంది.
ఇక దీని రేంజ్ విషయానికి వస్తే, ఫైర్ అండ్ ఫర్గెట్ మోడ్ లో ప్రయోగిస్తే.. దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను సైతం ఇది కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. ఒకవేళ టార్గెట్ మారినా, లేదా పొరపాటున ఆ ప్రాంతంలో సాధారణ పౌరులు ఉన్నారని గుర్తించి దాడిని విరమించుకుంటే.. పారాచూట్ సహాయంతో 25 కిలోమీటర్ల పరిధిలో దీన్ని తిరిగి సురక్షితంగా బేస్ క్యాంప్ కు రప్పించి, మళ్లీ వాడుకోవచ్చు. దీనివల్ల ఆర్మీకి భారీగా ఖర్చు ఆదా అవుతుంది. ఎలక్ట్రానిక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేలా నాగాస్త్ర-2లో ఎలక్ట్రానిక్ కౌంటర్-కౌంటర్ మెజర్స్ సాంకేతికతను సంస్థ అమర్చింది. శత్రువులు మన జీపీఎస్ ను జామ్ చేసినా, కమ్యూనికేషన్ సిగ్నల్స్ కట్ చేసినా .. ఈ డ్రోన్ ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వదు. తనలో ముందుగా ఫీడ్ చేసిన ఇంటర్నల్ నేవిగేషన్ సిస్టమ్ ద్వారా టార్గెట్ ను లాక్ చేసి కచ్చితంగా దాన్ని నాశనం చేసే తీరుతుంది. ఆగస్టులో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో జరిగిన కఠినమైన పరీక్షల్లో ఈ డ్రోన్ తన సత్తా చాటుకుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. కొద్ది రోజుల క్రితమే భారత సైన్యానికి 450 నాగాస్త్ర 1R లోయిటరింగ్ డ్రోన్లను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అందించింది. ఈ డ్రోన్ల కొనుగోలు కోసం ఇజ్రాయెల్, పోలాండ్ కు చెందిన దిగ్గజ కంపెనీలు పోటీ పడినప్పటికీ.. ఆర్మీ అడిగిన అన్ని కఠినమైన పారామితులను, కచ్చితత్వాన్ని ప్రదర్శించిన ఏకైక కంపెనీ మన స్వదేశీ సంస్థ సోలార్ డిఫెన్స్ కావడం విశేషం. లద్దాఖ్ లోని ఎత్తైన మంచు పర్వతాల్లో, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బబినాలో జరిగిన ప్రత్యక్ష పరీక్షల్లో ఈ డ్రోన్ల పనితీరును అంచనా వేశారు. స్వల్ప-శ్రేణి కార్యకలాపాల కోసం, సరిహద్దుల్లో ఉగ్రవాదుల బంకర్లను ఏరివేయడానికి నాగాస్త్ర 1R వేరియంట్‌ను ఆర్మీ అత్యవసర సేకరణ కింద ఆర్డర్ చేసింది.



