ఐక్యరాజ్యసమితిలో గతాన్ని గుర్తుచేసి పాక్ పరువు మరోసారి తీసిన భారత్

భారత్‌పై బురద జల్లాలని పాకిస్థాన్ దశాబ్దాలుగా విఫల యత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్న దాయాది దేశానికి, భారతదేశం ఊహించని రీతిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. పాకిస్థాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. భారత శాశ్వత మిషన్ తొలి కార్యదర్శి భావికా మంగళానందన్ చేసిన ప్రసంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. పాకిస్థాన్ గత చరిత్రను, ముఖ్యంగా 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ తన సొంత సైనికులకు చేసిన ద్రోహాన్ని ఆమె ప్రపంచం ముందు బట్టబయలు చేశారు. ఐరాస వేదికగా ఆమె పాకిస్థాన్ పరువును అంతర్జాతీయ వేదికపై నిలువునా తీసేశారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రతిరోజూ వివిధ అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే యూ.ఎన్ వేదికగా అసాధారణ పరిస్థితులలో అంత్యక్రియల హక్కులు.. మత విశ్వాసాలు అనే అత్యంత సున్నితమైన అంశంపై ఒక చర్చ జరిగింది. యుద్ధ సమయాల్లో లేదా విపత్తుల సమయాల్లో మరణించిన వారికి వారి మత విశ్వాసాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించే హక్కులపై వివిధ దేశాల ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మైక్ అందుకున్న పాకిస్థాన్ రాయబారి.. టాపిక్ ను పూర్తిగా పక్కదారి పట్టించి, కావాలనే భారత అంతర్గత వ్యవహారమైన జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ముస్లింల మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని పాక్ ప్రతినిధి పచ్చి అబద్ధాలను ఎత్తుకున్నారు. దీనిపై భారత ప్రతినిధి భావికా మంగళానందన్.. పాక్ ప్రతినిధికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగం అని, అది మా అంతర్గత విషయం అని ఆమె మరోసారి కుండబద్దలు కొట్టారు. అసలు కశ్మీర్ గురించి మాట్లాడే నైతిక హక్కు పాకిస్థాన్‌కు ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. భారతదేశం వైపు వేలు చూపించే ముందు, పాకిస్థాన్ తన ఆక్రమణలో ఉన్న పీఓకే ప్రాంతాల్లోని మైనార్టీల పరిస్థితి ఏమిటో చూసుకోవాలని చురకలు అంటించారు. పాకిస్థాన్ లో రోజురోజుకూ హిందువులు, సిక్కులు, క్రిస్టియన్ల లాంటి అనేకమంది మైనారిటీలు కనుమరుగవుతున్నారని.. నిరంతరం వారి హక్కుల ఉల్లంఘన, బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని, మొదట ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూటిగా విమర్శించారు.
ఈ చర్చలో భావికా మంగళానందన్ చేసిన అత్యంత కీలకమైన, పవర్ ఫుల్ పాయింట్.. 1999 కార్గిల్ యుద్ధం. అంత్యక్రియల హక్కులు, మత విశ్వాసాల గురించి వేదికపై మాట్లాడుతున్న పాకిస్థాన్ కు ఆ అర్హత ఏమాత్రం లేదని ఆమె కార్గిల్ నాటి ఉదంతాన్ని బయటకు తీశారు. 1999లో కార్గిల్‌లో మరణించిన తమ సొంత సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించడానికి నిరాకరించిన ఒక దేశం.. ఈరోజు ఇక్కడ విశ్వాసం, మత స్వేచ్ఛ, ఖననాల హక్కుల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. నేను వారికి ఒక చారిత్రక సత్యాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. పాకిస్థాన్ తమ సైనికుల మృతదేహాలను ఎత్తైన మంచు కొండల్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో వదిలేసిన సమయంలో.. ఆ మృతదేహాలకు భారత సైన్యమే పూర్తి సైనిక లాంఛనాలతో, ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది అని ఆమె గుర్తు చేశారు. ఈ మాటలతో ఐరాస సమావేశంలో ఉన్న విదేశీ ప్రతినిధులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కార్గిల్ యుద్ధం సమయంలో వాస్తవానికి ఏం జరిగిందంటే.. ముజాహిదీన్ల ముసుగులో పాకిస్థాన్ నార్తర్న్ లైట్ ఇన్ఫాంట్రీ కి చెందిన రెగ్యులర్ సైనికులను కార్గిల్ కొండల్లోకి పంపింది అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్. ఆ చొరబాటుదారులను మట్టుబెట్టిన భారత సైన్యం, వారు పాకిస్థాన్ సైనికులని ఆధారాలతో సహా చూపించినా పాక్ ప్రభుత్వం అంగీకరించలేదు. తమ పరువు పోతుందన్న భయంతో, చనిపోయింది తమ సైనికులు కాదంటూ సొంత దేశపు బిడ్డల శవాలను తీసుకెళ్లడానికి నిరాకరించింది. ఆ సమయంలో శత్రువులైనా సరే ఒక సైనికుడికి దక్కాల్సిన గౌరవాన్ని ఇస్తూ.. ఇండియన్ ఆర్మీ ముస్లిం మత గురువులను పిలిపించి, పవిత్ర ఖురాన్ చదివించి మరీ పాక్ సైనికులకు కార్గిల్ లో అంత్యక్రియలు నిర్వహించింది. భారతదేశపు మానవత్వానికి, పాకిస్థాన్ రాక్షసత్వానికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని భావికా మంగళానందన్ ఐరాస వేదికగా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఐరాస వేదికగా పాకిస్థాన్ డబుల్ స్టాండర్డ్స్ ను ఎండగట్టడంలో భారత ప్రతినిధి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. భావికా మంగళానందన్ లాంటి యువ ఐఎఫ్ఎస్ అధికారులు అంతర్జాతీయ వేదికలపై ఇంత కాన్ఫిడెంట్ గా మన దేశ వాణిని వినిపించడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.



