ఒకే ఒక్కడు.. ఫౌజీ..సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో సైనికుడిగా ప్రభాస్..అసలు కథ ఇదే!

పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ. సీతా రామం లాంటి క్లాసిక్ బ్లాక్బస్టర్ అందించిన డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ప్రభాస్ బర్త్డే స్పెషల్గా మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. పుట్టుకతో వచ్చిన అతని పేరు ఎవ్వరికీ తెలియదు, కానీ బ్రిటిష్ వాళ్లు మాత్రం అతన్ని భయంతో ఫౌజీ అని పిలుస్తుంటారు. 1932 నుంచి బ్రిటిష్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉంటూ.. మాతృభూమిని కాపలాకాస్తున్న ఒకే ఒక్కడు ఫౌజీ. అతనొక సైనికుడు, వ్యూహకర్త, ఎవరికీ చిక్కని గూఢచారి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ క్యారెక్టరైజేషన్ తో ప్రభాస్ ను హను రాఘవపూడి ప్రెజెంట్ చేసిన విధానం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది.
ఫౌజీ సినిమా కథ ఏ కాలంలో జరగబోతోందో, కథ బ్యాక్డ్రాప్ ఎంత భారీగా ఉండబోతోందో ఈ ప్రచార చిత్రంతో మేకర్స్ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు. రెండో ప్రపంచ యుద్ధం అత్యంత ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో ఈ కథ నడుస్తుంది. గ్లింప్స్ మొదలవ్వగానే జర్మనీలోని బెర్లిన్ నగరంలో అడాల్ఫ్ హిట్లర్, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మధ్య సాగే ఒక ఇంటెన్స్ సంభాషణతో ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. ఒక ఇండియన్ సినిమా గ్లింప్స్ లో ఇలాంటి చారిత్రక ఘట్టాన్ని చూపించడం నిజంగా గూస్బంప్స్ తెప్పించే విషయం. ఈ సంభాషణలోనే సుభాష్ చంద్రబోస్ ఫౌజీ గురించి హిట్లర్ కు వివరిస్తూ.. అతను భగవద్గీత ఆధారంగా ఒక అజేయమైన కోడ్ని సృష్టించాడు. ఆ కోడ్ని ఛేదించడం మీ జర్మన్ ఎనిగ్మా కంటే కష్టమని సాక్షాత్తూ బ్రిటిష్ వారే ఒప్పుకుంటున్నారు అంటూ ఫౌజీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ఒక్క డైలాగ్ తో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. జర్మన్లు రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ఎనిగ్మా మెషీన్ కోడ్స్ ను డీకోడ్ చేయడానికే మిత్రరాజ్యాలకు ఏళ్లు పట్టింది. అలాంటిది మన భగవద్గీత శ్లోకాల ఆధారంగా ప్రభాస్ ఒక ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ కోడ్ ను డెవలప్ చేశాడనే పాయింట్ ఈ సినిమాకు అతిపెద్ద హైలైట్ కాబోతోంది. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీలో ప్రభాస్ ఒక అత్యంత కీలకమైన గూఢచారిగా నటిస్తున్నాడని అర్ధమవుతోంది.



