కదిలిస్తున్న యువకుడి అంకితభావం…అమ్మ కోసం సాహస యాత్ర
కామెంట్లు (0)
ప్రపంచంలో తల్లికి మించిన గొప్ప వ్యక్తి ఎవరూ ఉండరు. మాటలకందని నిర్వచించలేని బంధం తల్లి బిడ్డలది. అనారోగ్యంతో మంచాన పడిన అమ్మ కోసం, ఆమె ప్రాణాలు కాపాడటం కోసం ఒక కొడుకు చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బీహార్కు చెందిన కేవలం 19 ఏళ్ల యువకుడు..తన తల్లి కోసం ఏకంగా దేశమంతా పరిగెడుతున్నాడు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 12 జ్యోతిర్లింగాలను ఏకంగా పరిగెడుతూ దర్శించుకుంటున్నాడు. ఈ కుర్రాడి అంకితభావం చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది.
బీహార్ రాజధాని పాట్నాకు చెందిన మోనూ మెటురబాలా అనే 19 ఏళ్ల యువకుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారాడు. మోనూ వాళ్ల అమ్మ పేరు లల్తీ దేవి. ఆమె కొంతకాలం క్రితం తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా, మందులు వాడినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. కళ్లెదుటే తనను నవమాసాలు మోసిన తల్లి మంచాన పడి నరకం అనుభవిస్తుంటే ఆ కొడుకు చూడలేకపోయాడు. దేవుడా నా తల్లిని ఎలాగైనా బతికించు అని గుండెలు పగిలేలా వేడుకున్నాడు. అదే సమయంలో మోనూ పరమ శివుడికి ఒక కఠినమైన మొక్కు మొక్కుకున్నాడు. స్వామీ, మా అమ్మను ఈ అనారోగ్యం నుంచి బయటపడేలా చెయ్యి.. ఆమె పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా నా కళ్ల ముందు తిరిగితే, దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను పరిగెడుతూ వచ్చి దర్శించుకుంటాను అని వేడుకున్నాడు.
ఆ మహాశివుడు మోనూ ప్రార్థన విన్నాడో ఏమో, లల్తీ దేవి ఆరోగ్యం క్రమంగా కుదుటపడింది. ఆమె పూర్తిగా కోలుకుని మళ్లీ మామూలు మనిషి అయింది. అమ్మ బతికిందన్న ఆనందంలో మోనూ దేవుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఏమాత్రం ఆలోచించకుండా, భయపడకుండా తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించాడు. 2026 మార్చి 15న పాట్నాలో మోనూ తన పరుగును ప్రారంభించాడు. వినడానికి పరిగెత్తడం చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ రోజుకు దాదాపు 50 కిలోమీటర్లు పరిగెత్తడం అంటే అది మామూలు విషయం కాదు. ఎండ, వాన, చలి దేన్నీ లెక్కచేయకుండా శివనామ స్మరణతో మోనూ అడుగులు ముందుకు వేస్తున్నాడు. కేవలం 12 జ్యోతిర్లింగాలు మాత్రమే కాదు, చార్ దామ్ యాత్ర కూడా పూర్తి చేయాలని మోనూ నిర్ణయించుకున్నాడు.



