డ్రోన్లు,మిస్సైల్స్ కాదు..హౌతీల కొత్త ఆయుధం అదే..!

మిడిల్ ఈస్ట్ అనగానే ఒకప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరిగే కోల్డ్ వార్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ తమ ప్రధాన శత్రువైన సౌదీ అరేబియాపై ఇప్పుడు ఒక సరికొత్త యుద్ధానికి తెరతీశారు. సౌదీ అరేబియాపై దాడి చేయడానికి హౌతీలు ఇప్పటివరకు బాలిస్టిక్ మిస్సైల్స్, సూసైడ్ డ్రోన్లను మాత్రమే వాడేవారు. అయితే వాటిని ఎదుర్కోవడానికి సౌదీ అరేబియా అమెరికా నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చుపెట్టి పేట్రియాట్ లాంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసింది. ఆకాశం నుంచి ఏమొచ్చినా సౌదీ రాడార్లు పసిగట్టి గాల్లోనే పేల్చేస్తున్నాయి. దీంతో ఎయిర్ స్పేస్ అటాక్స్ వర్కౌట్ కావడం లేదని గ్రహించిన హౌతీలు .. ఇప్పుడు తమ రూట్ మార్చారు. డ్రోన్లు కాదు, క్షిపణులు కాదు.. ఏకంగా సౌదీకి కళ్లు బైర్లు కమ్మేలా ఒక కొత్త ఆయుధాన్ని రంగంలోకి దించారు.
హౌతీలు తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. ఆకాశంలో దాడులు చేస్తే రాడార్లకు ఈజీగా దొరికిపోతున్నారు , కాబట్టి ఏ రాడార్కూ చిక్కని ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే సముద్ర మార్గం. గాల్లో ఎగిరే డ్రోన్ల ప్లేస్‌లో ఇప్పుడు ఏకంగా నీటి మీద, నీటి అడుగున ప్రయాణించే సరికొత్త డ్రోన్లను సౌదీపైకి ఉసిగొల్పుతున్నారు. హౌతీలు వాడుతున్న ఆ కొత్త ఆయుధం అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెస్సెల్స్ అంటే... పేలుడు పదార్థాలతో నిండిన రిమోట్ కంట్రోల్ బోట్లు. అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్స్, అంటే.. నీటి అడుగున వెళ్లే మినీ జలాంతర్గామి డ్రోన్లు. ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వందలాది కిలోల భయంకరమైన ఆర్డీఎక్స్, ఇతర పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు. అవి నీటి అడుగున ప్రయాణిస్తాయి కాబట్టి, ఎంత పవర్ఫుల్ రాడార్ అయినా సరే వీటిని పసిగట్టడం దాదాపు అసాధ్యం. జీపీఎస్ కో-ఆర్డినేట్స్ సెట్ చేసి వదిలేస్తే.. ఇవి నేరుగా వెళ్లి సౌదీ నౌకాశ్రయాలు, పోర్టులు, తీర ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక వాడలను ఢీకొట్టి భారీ పేలుడు సృష్టిస్తాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను బైపాస్ చేసి నేరుగా టార్గెట్‌ను హిట్ చేయగల ఈ టెక్నాలజీ ఇప్పుడు సౌదీ రక్షణ దళాలకు సవాలుగా మారింది. హౌతీలు ఒక సాధారణ రెబల్ గ్రూప్. మరి వారికి ఇంతటి ఆధునిక టెక్నాలజీ, నీటి అడుగున వెళ్లే డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న ఏకైక శక్తి ఇరాన్ . మిడిల్ ఈస్ట్‌లో సౌదీ అరేబియా, అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి ఇరాన్ కమాండర్లు హౌతీలు ఈ టెక్నాలజీని, విడిభాగాలను స్మగ్లింగ్ ద్వారా అందిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త ఆయుధాల వల్ల సౌదీ అరేబియాకు ఒక అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చమురు ఎగుమతుల పైనే ఆధారపడి ఉంది. వారి ప్రధాన ఆయిల్ టెర్మినల్స్ అన్నీ సముద్ర తీరంలోనే ఉన్నాయి. అలాగే ఎడారి దేశమైన సౌదీకి మంచి నీటిని అందించే అతిపెద్ద డీశాలినేషన్ ప్లాంట్లు కూడా సముద్ర తీరంలోనే ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రోన్ పడవలు, అండర్ వాటర్ మినీ సబ్మెరైన్లు నేరుగా వెళ్లి ఆ ఆయిల్ టెర్మినల్స్, డీశాలినేషన్ ప్లాంట్లను ఢీకొడితే.. సౌదీ ఎకానమీ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆ దేశానికి తాగునీరు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఈ పాయింట్‌ను టార్గెట్ చేసుకునే హౌతీలు ఈ కొత్త ఆయుధాలను రంగంలోకి దించారు.
గగనతల దాడులు విఫలం కావడంతో రూట్ మార్చి, సముద్ర మార్గం గుండా సరికొత్త, అదృశ్య ఆయుధాలతో సౌదీ అరేబియాను హౌతీ రెబల్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు పోసి కొన్న ఆయుధాలు గగనతలాన్ని మాత్రమే రక్షించగలవు.. కానీ శత్రువు నీటి అడుగు నుంచి అదృశ్యంగా వస్తే ఎంతటి అగ్రరాజ్యమైనా చేతులెత్తేయాల్సిందే అని హౌతీ దాడులు నిరూపిస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీతో హౌతీలు ఇప్పుడు కేవలం సౌదీకే కాదు.. ఎర్ర సముద్రంలో ప్రయాణించే ప్రపంచ వాణిజ్య నౌకలకు కూడా అతిపెద్ద ముప్పుగా మారారు. దీన్ని అడ్డుకోవడానికి సౌదీ అరేబియా, అమెరికా నేవీలు తమ నావల్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



