బుద్ధిమార్చుకోని చైనా…రంగంలోకి శౌర్య కమాండోలు..అరుణాచల్ బార్డర్స్ లో హైటెన్షన్ ..!

లద్దాఖ్ గాల్వన్ వ్యాలీ ఘటన తర్వాత ఇండియా-చైనా సరిహద్దుల్లో కాస్త ప్రశాంతత నెలకొంది అనుకుంటున్న తరుణంలో, డ్రాగన్ కంట్రీ చైనా మళ్లీ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటోంది. ఎప్పుడూ ఏదో ఒక నెపంతో భారత భూభాగంలోకి చొరబడాలని చూసే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ .. ఇప్పుడు ఏకంగా ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారీ ఉద్రిక్తతలకు తెరలేపింది. అరుణాచల్ ప్రదేశ్‌ను మొదటి నుంచి దక్షిణ టిబెట్ గా భావించే చైనా.. ఇప్పుడు అక్కడ మన ఆర్మీతో నేరుగా ఘర్షణలకు దిగుతోంది. ఈ విషయాన్ని ఎమన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ కపూర్ స్వయంగా ఒక సంచలన ప్రకటన చేశారు. ఇండియా-చైనా సరిహద్దు అనగానే మనకు గుర్తొచ్చేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ సుదీర్ఘమైన సరిహద్దును కాపాడే బాధ్యత ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ దళాలదే. తాజాగా ఐటీబీపీ సిబ్బందికి నిర్వహించిన ఒక వార్షిక సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఐటీబీపీ డీజీ శత్రుజీత్ కపూర్.. బార్డర్ లో జరుగుతున్న టెన్షన్ వాతావరణం గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. గత కొన్ని రోజులుగా అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మన ఐటీబీపీ జవాన్లకు, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు. అంతేకాదు, ఆ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆయన చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ సందర్భంగా ఆయన ప్రతి భారతీయుడు గర్వపడేలా మరో కీలక విషయాన్ని పంచుకున్నారు. సరిహద్దుల్లో అత్యంత కఠినమైన మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో, ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఐటీబీపీ సిబ్బంది పనితీరును ఆయన కొనియాడారు. ముఖ్యంగా డ్రాగన్ ఆటలు కట్టించడానికి భారత సైన్యం కొత్తగా ఏర్పాటు చేసిన శౌర్య కమాండోలు ఈ ఘర్షణల సమయంలో అసాధారణ ప్రతిభ కనబరిచారని ఆయన ప్రశంసించారు.



