తమిళ అగ్రనటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా పలు కారణాలతో ఇంకా విడుదల కాలేదన్న సంగతి తెలిసిందే. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాలేదు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన సీన్లు అంటూ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇక ప్రతి సినిమా వందలాది మంది కార్మికుల కష్టంతో రూపొందుతుందని దయచేసి పైరసీని నిరోధించాలని థియేటర్లలో విడుదలయ్యే వరకు వేచి ఉండండి మరియు సినిమాను థియేటర్లలోనే చూడండని పలువురు ప్రముఖులు తమ స్పందనను తెలుపుతున్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలను తీసుకోవాలని పేర్కొంటున్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. జననాయకన్ చిత్రం లీక్ అవ్వడం దురదృష్టకరమని అది ఎంతగానో కలచివేస్తోందన్నారు. సినిమా అనేది నమ్మకం, కృషి మరియు ఎంతోమంది సామూహిక కలల మీద నిర్మించబడుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు చిత్ర పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి మరియు మన క్రియేటివ్ వర్క్ ను రక్షించుకోవడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తాయన్నారు. తన ఆలోచనలు మరియు మద్దతు ఎప్పుడూ ఆ చిత్ర బృందానికే ఉంటాయని తెలిపారు. సినిమాను గౌరవించడానికి మరియు రక్షించడానికి మనమందరం బాధ్యత తీసుకుందామన్నారు. పైరసీని అంతం చేద్దాం. సినిమాను కాపాడుకుందామని మెగాస్టార్ పిలుపునిచ్చారు.