ప్రముఖ దర్శకుడు సుకుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను చాటుకున్నారు. ఇటీవల జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా అవార్డు అందుకుని మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే బాలనటిగా జాతీయ అవార్డు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు మరోసారి తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె సాధించిన విజయం సినిమాకు సంబంధించినది కాదు. సంగీత రంగంలో తన ప్రతిభతో మెరిశారు. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ నుంచి పూర్తి స్కాలర్ షిప్ ను అందుకోవడం విశేషంగా మారింది.సుకృతి వేణి చిన్నప్పటి నుంచే ఆర్ట్స్ పై ఆసక్తి కనబరుస్తూ వస్తుంది. అందుకే నటనతో పాటు సంగీతంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆమె, రెండింటిలోనూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇటీవల విడుదలైన ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో సుకృతి వేణి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమెకు 2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు లభించింది. జాతీయ అవార్డు అందుకున్న కొద్ది రోజులకే ఇప్పుడు మరో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంగీత విద్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిన అమెరికాలోని బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నిర్వహించే సమ్మర్ మ్యూజిక్ ప్రోగ్రామ్‌కు సుకృతి వేణి ఎంపికయ్యారు. అంతేకాదు, ఆమెకు ఎన్సెంబుల్ ఎక్సెలెన్స్ అవార్డుతో పాటు పూర్తి స్కాలర్షిప్ కూడా లభించింది.ప్రపంచవ్యాప్తంగా సంగీతాన్ని అభ్యసించాలనుకునే విద్యార్థుల కలల గమ్యస్థానంగా బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కాలేజీలో ప్రవేశం పొందడమే చాలా పెద్ద విషయం. అలాంటిది అక్కడ నిర్వహించే ప్రత్యేక సమ్మర్ మ్యూజిక్ ప్రోగ్రామ్‌కు పూర్తి స్కాలర్‌షిప్‌తో ఎంపిక కావడం ఎంతో అరుదైన అవకాశం. అందుకే సుకృతి సాధించిన ఈ ఘనత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.