ఎంచుకున్న రంగంలో ఎన్నో అత్యున్నత శిఖరాలు చూస్తూ తరాలను ప్రభావితం చేస్తూ ముందుకు సాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. నేడు ఆయన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ తో తనకున్న కొన్ని జ్ఞాపకాలను పంచుకుంటూ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్నయ్య గురించి తలచుకోవడం ఎప్పుడూ ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున జ్ఞాపకాల దొంతరల్లోకి వెళ్తే, నా కంటికి కనిపించిన కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఇవి…మా చిన్నతనంలో, నర్సాపూర్ కాలేజీలో చదువుకోవడం కోసం ఆయన ఇంటికి దూరంగా వెళ్లారు. వేసవి సెలవులకు ఆయన ఇంటికి తిరిగి రావడం మాకొక పెద్ద పండుగలా ఉండేది. మళ్లీ కాలేజీకి తిరిగి వెళ్లేటప్పుడు అపారమైన బాధ, తీవ్రమైన నిరాశ ఆవహించేవి. ఆయన లేని లోటును, ఆ వెలితిని మేమంతా అనుభవించేవాళ్లం. ఆయన మళ్లీ వచ్చే వరకు ఇంట్లో ఆ ఉత్సాహమే ఉండేది కాదు. నా పాఠశాల రోజుల్లో, ఆయన పక్కన నడవడం నాకొక గర్వకారణమైన క్షణం. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తితో కలిసి నడుస్తున్నట్లు అనిపించేది; కానీ అప్పటికి ఆయన కాలేజీలోనే ఉన్నారు. మా నాన్నగారి బైక్ (బులెట్ – 350 సిసి) పైన ఆయన అలా వెళ్తుంటే… కర్లీ (రింగుల) జుట్టు, ఎన్సీసీ కేడెట్గా ఫిట్గా ఉన్న శరీరం, బెల్ బాటమ్ ప్యాంట్లు, కళ్లద్దాలతో ఆయన కనిపించే రూపం – అబ్బో, అదొక పక్కా ఫ్యాన్ బాయ్, ఒక హీరోని ఆరాధించే క్షణం అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు పవన్. నా అన్నయ్య హీరో కావడానికి ముందే నాకు ఎప్పుడూ హీరోనే. ఆయన సినిమా కెరీర్ ప్రారంభంలో, తన మొదటి సింగపూర్ ట్రిప్ నుండి ఒక పెద్ద నీలిరంగు బ్యాగ్ తెచ్చారు. ఆ నీలిరంగు బ్యాగ్‌లో నాకు దొరికిన నా మొదటి చిన్న లేగో హెలికాప్టర్, కొన్ని రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కొన్ని కామిక్స్, మ్యూజిక్ టేప్‌లు, టేప్ రికార్డర్, సువాసనల పౌడర్లు, సోప్‌లు, కొన్ని పెర్ఫ్యూమ్‌లు మరికొన్ని చిన్న చిన్న కానుకలు… ఆయన ఎప్పుడూ మా చిన్న ఇంట్లోకి ఆనందాన్ని, చిరునవ్వులను మోసుకొచ్చేవారని అన్నారు. ఇక చిరుకు పెళ్లయినప్పుడు, ఆయన అందరికీ దూరమైపోతారేమోనని భయపడ్డానని పవన్ తెలిపారు. ఒక గదిలో కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నాను. అప్పుడు ఆయన మా వదినను తీసుకువచ్చి, “రా, ఈరోజు నిన్ను ఒక పెద్ద మనిషికి పరిచయం చేస్తాను” అన్నారు. ఆ ఏడుపుకు కారణం తెలుసుకుని వాళ్లిద్దరూ నవ్వుకున్నారని పవన్ చెప్పారు. ఆ తర్వాత, నన్ను మద్రాస్ తీసుకువెళ్లి అన్నయ్య, వదినల దగ్గరే ఉంచుకున్నారు. వారు నాపై కురిపించిన ప్రేమాభిమానాలను వర్ణించడానికి పదాలు సరిపోవన్నారు. షూటింగ్‌లలో ఆయన పడిన శ్రమ, కష్టం, ఎదుర్కొన్న గాయాలను నేను దగ్గరుండి చూశాను. చెన్నై తీవ్రమైన వేడి, ఉక్కపోతలో… చెమటతో తడిసిపోయిన దుస్తులు, షూలతో రోజుకు 18 గంటల పాటు కష్టపడి పనిచేసి, అర్ధరాత్రి వేళకి నిలబడటానికి కూడా ఓపిక లేని స్థితిలో ఇంటికి వచ్చేవారని మెగాస్టార్ కష్టపడ్డ రోజులను పవన్ గుర్తుచేసుకున్నారు. ఆయన కష్టం, త్యాగంతో నేను బతుకుతున్నందుకు నాకు తరచూ గిల్టీ ఫీల్ కలుగుతుండేది. కానీ నా చదువుల్లో వైఫల్యాలు, నా జీవితంలో స్పష్టమైన గమ్యం లేకపోవడం గురించి ఆయన ఒక్క మాట కూడా అనలేదని అన్నారు. అలాగే సమాజ సేవ చేసే గుణం, ఆదర్శవంతమైన కుటుంబ సభ్యుడు… సూపర్ స్టాండమ్ నుండి మెగాస్టార్డమ్ వరకు, కేంద్ర కేబినెట్ మంత్రిగా, జాతీయ అవార్డులు, దేశ అత్యున్నత పౌర పురస్కారాల వరకు ఆయన చూడనిది, సాధించనిది ఏముంది? అయినా ఆయన విశ్రమించరు. ఇటీవల ఒక పెద్ద వెన్నుముక ఆపరేషన్ జరిగినప్పటికీ, అతి తక్కువ సమయంలోనే స్ట్రెంత్ ట్రైనింగ్‌తో మళ్లీ కోలుకుని పనిలోకి వెళ్లారు. నిద్రపోని నగరంలా, ఆయన విశ్రాంతి ఎరుగని మనిషి. ఆయనలో ఆపలేని శక్తి పుట్టుకతోనే ఉంది. అందుకే ఆయన మన అందరి ‘మెగా స్టార్’ మరియు నా ఒక్కగానొక్క హీరో అయ్యారు.నా ప్రియమైన అన్నయ్యకి ప్రకృతి మాత నిండైన ఆరోగ్యాన్ని, అపారమైన శక్తిని మరియు ఆయన జీవిత మార్గంలో అద్భుతమైన విజయాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.