యుద్ధ క్షేత్రం ఒకప్పటి మాదిరి లేదు. మారుతున్న కాలంతో పాటు యుద్ధ వ్యూహాలు కూడా మారిపోతున్నాయి. శత్రువు కంటపడకుండా, వందల కిలోమీటర్ల దూరం నుంచే వాళ్ల కథ ముగించేలా అగ్రరాజ్యాలు తమ ఆయుధాలకు పదునుపెడుతున్నాయి. ఈ రేసులో ఎప్పుడూ ముందుండే అమెరికా .. తాజాగా ఒక సరికొత్త బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే మాలిస్ . ఇది ఒక ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్. సాధారణంగా యుద్ధ విమానాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు మిసైల్స్ ఫైర్ చేసుకుంటాయి. కానీ అమెరికా నేవీ ఆవిష్కరించిన ఈ మాలిస్ మిస్సైల్ అలా కాదు. దీని రేంజ్ ఏకంగా 250 నాటికల్ మైళ్లు.. అంటే సుమారు 463 కిలోమీటర్లు. గగనతల లక్ష్యాలను టార్గెట్ చేసే ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్ లో ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత లాంగ్ రేంజ్ మిసైల్ ఇదే కావడం విశేషం. దీని సాంకేతిక పేరు AIM-424 LRAAM. అమెరికాలోని ప్రముఖ డిఫెన్స్ కంపెనీ అయిన రేథియాన్ సంస్థతో కలిసి యూఎస్ నేవీ దీన్ని డెవలప్ చేసింది. దీని పొడవు సుమారు 4.11 మీటర్లు ఉండగా.. బరువు ఏకంగా 680 కిలోలు ఉంటుంది. ఇందులో అత్యంత శక్తివంతమైన సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను అమర్చారు. శత్రువు రాడార్లకు చిక్కకుండా, సైలెంట్‌గా వెళ్లి టార్గెట్‌ను ఢీకొట్టడం దీని ప్రత్యేకత. అమెరికా నేవీ దీని పూర్తి సాంకేతికతను ఇంకా బయటపెట్టనప్పటికీ, ఇది రక్షణ రంగంలోనే ఒక గేమ్ ఛేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. ఇంతటి శక్తివంతమైన మిసైల్‌ను మోసుకెళ్లాలంటే ఆ యుద్ధ విమానం కూడా అంతే పవర్ఫుల్ అయి ఉండాలి. అందుకే అమెరికా నేవీ ఈ మాలిస్మిస్సైల్ ని తమ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అయిన F-35C కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది. దీనితో పాటు F/A-18E/F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్లలో కూడా వీటిని అమర్చేందుకు ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నారు. ఈ మిసైల్ వల్ల అమెరికాకు ఉన్న అతిపెద్ద లాభం ఏంటంటే.. శత్రు దేశపు గగనతలంలోకి లేదా వాళ్ల రాడార్ పరిధిలోకి అమెరికా యుద్ధ విమానాలు వెళ్లాల్సిన అవసరమే లేదు. బోర్డర్‌కు వందల కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా ఉంటూనే, అక్కడి నుంచే మిసైల్ లాంచ్ చేసి శత్రు విమానాలను కూల్చేయవచ్చు. దీనివల్ల యుద్ధ క్షేత్రంలో అమెరికా పైలట్లకు, యుద్ధ విమానాలకు ప్రాణనష్టం అనేది దాదాపుగా జీరో అయిపోతుంది. మరి ఈ మిసైల్ ఎలాంటి టార్గెట్స్ ను అటాక్ చేస్తుంది? శత్రు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు, లాంగ్ రేంజ్ బాంబర్లు, గగనతల నియంత్రణ విమానాలు , ఇంటెలిజెన్స్ అండ్ గూఢచర్య విమానాలు, ఏరియల్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు.. ఇలా గాల్లో ఎగిరే దేన్నైనా ఈ మాలిస్ మిసైల్ కచ్చితంగా కూల్చేస్తుంది. మరోవైపు ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ రేసులో అమెరికాకు ధీటుగా చైనా కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలు ముఖాముఖి కాకుండా, టెక్నాలజీతో, లాంగ్ రేంజ్ మిసైల్స్‌తోనే జరుగుతాయనడానికి ఈ పరిణామాలే నిదర్శనం. అమెరికా ఆవిష్కరించిన ఈ మాలిస్ మిస్సైల్ తో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కచ్చితంగా చెక్ పడుతుంది అని డిఫెన్స్ నిపుణులు భావిస్తున్నారు.