లెక్క తప్పిన వేళ..!

Spread the love

Israel Intelligence Doha Attack: తమ దేశానికి ప్రమాదకరంగా భావించే వ్యక్తులను లక్ష్యం చేసుకోవడం ఇజ్రాయెల్‌కు కొత్తేమీ కాదు. ఎంత కట్టుదిట్టమైన భద్రత మధ్య శత్రువున్నా అంతమొందించగల సత్తా ఆ దేశ నిఘా విభాగం మొస్సాద్‌ సొంతం. అలాంటిది ఖతార్‌ రాజధాని దోహాలోని హమాస్‌ నాయకులపై ఇటీవల చేసిన దాడి ఎందుకు విఫలమైంది? ఇజ్రాయెల్‌ లెక్క ఎక్కడ తప్పింది? హమాస్‌ నాయకులను వేటాడటంలో ముందుండే మొస్సాద్‌.. దోహా ఆపరేషన్‌ను ఎందుకు తీవ్రంగా వ్యతిరేకించింది?.. ఇవన్నీ చర్చకు తెరతీశాయి.

ఖతార్‌ రాజధాని దోహాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో హమాస్‌ కీలక నేతలు తప్పించుకున్నారు. అయితే ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్‌ భద్రతా సంస్ధలే తీవ్రంగా వ్యతిరేకించాయని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ తెలిపింది. ముఖ్యంగా నిఘా సంస్థ మొస్సాద్‌.. దాడికి అభ్యంతరం తెలిపినట్లు పేర్కొంది. మొస్సాదే కాదు.. ఐడీఎఫ్‌ చీఫ్‌ ఇయాల్‌ జామిర్, జాతీయ భద్రతా సలహాదారుడు జాకీ హనెగ్‌బీ కూడా దోహా ఆపరేషన్‌ను వ్యతిరేకించారు. హమాస్‌తో జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నీట్‌జాన్‌ లోన్‌ను కూడా చర్చలకు ఆహ్వానించలేదు. ఆపరేషన్‌ను ఆయన వ్యతిరేకిస్తారన్న భయమే ఇందుకు కారణమని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

దోహా ఆపరేషన్‌ నిర్వహిస్తే.. గాజా యుద్ధం ముగించడానికి జరుగుతున్న శాంతి చర్చలు విఫలమవడమే కాకుండా, ఖతార్‌తో తమ సంస్థకున్న కీలక సంబంధాలు దెబ్బతింటాయని మొస్సాద్‌ చీఫ్‌ డేవిడ్‌ బార్నే భావించారు. అందుకే దాడి ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. అంతేకాదు.. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో హమాస్‌ నేతలను చంపాలన్న నిర్ణయాన్ని కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ‘‘మూడు నాలుగేళ్లలో వాళ్లను ఎలాగైనా అంతమొందిస్తాం. వారిని హతమార్చడం ఎలాగో మొస్సాద్‌కు తెలుసు’’ అని బార్నే తెలిపినట్లు పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ గగనతల దాడిని ఎంచుకోవాల్సి వచ్చింది. చివరకు వాయుసేన.. అంతర్గత భద్రతా సంస్థ ‘షిన్‌బెట్‌’తో కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాల్సి వచ్చింది.

సౌదీ గగనతలంలోకి ప్రవేశించకుండా ఎర్రసముద్రం నుంచే ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఆ పత్రిక కథనం ప్రకారం ఈ ఆపరేషన్‌లో ఎనిమిది ఎఫ్‌-15లు, నాలుగు ఎఫ్‌-35లు పాల్గొన్నాయి. అమెరికా ఎక్కడ అభ్యంతరం చెబుతుందోనని ఈ ఆపరేషన్‌ గురించి ఆఖరి నిమిషం వరకు ఆ దేశానికి ఇజ్రాయెల్‌ చెప్పలేదు. తమకు సమాచారం అందిన సమయానికే క్షిపణులు లక్ష్యాన్ని తాకాయని అమెరికా రక్షణ అధికారి ఒకరు తెలిపారు. Israel Intelligence Doha Attack.

దాడిలో హమాస్‌ నాయకులెవ్వరూ చనిపోలేదని ఇజ్రాయెల్‌ భద్రతాధికారులు నిర్ధరించారు. అసలు ఆ నాయకులు తాము దాడిచేసిన భవనంలో ఉన్నారా లేరా అన్నది అనుమానమేనని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఆ భవనంలోనే మరో భాగంలో హమాస్‌ నేతలు ఉన్నారని కూడా కథనాలు వస్తున్నాయి. సాధారణ పౌరులకు ఏమైనా జరిగితే ఖతార్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుందన్న భయం కూడా దాడి తీవ్రత తగ్గడానికి కారణమని ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ కథనం తెలిపింది. భవనంలోని కొన్ని గదులను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుంది. ఒకరిద్దరు కీలక హమాస్‌ నాయకులు గాయపడ్డారని.. అందులో అల్‌-హయ్యా ఉన్నారని ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది.