చంద్రుడిపైకి వెళ్లడం అది ఒకప్పుడు ఊహ అయితే అంతరిక్ష సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత ఆధునిక యుగంలో అక్కడికి వెళ్లడమే కాదు చంద్రుడిపైనే శాశ్వతంగా ఉండిపోతే? అక్కడే ఇళ్లు కట్టుకుని, అక్కడే ఉండడం ఆహా ఆ ఊహే ఎంత బాగుందో కదా…అయితే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ తో ముందుకు వస్తోంది. 2032 నాటికి చంద్రుడి సౌత్ పోల్ పై శాశ్వత మూన్ బేస్ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ అతిపెద్ద ప్రాజెక్టులో మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పాత్ర అత్యంత కీలకం కాబోతోంది. చంద్రుడిపై ఎన్నో ప్రదేశాలు ఉన్నా.. ప్రపంచ దేశాలన్నీ దక్షిణ ధ్రువం వైపే చూస్తున్నాయి. ఎందుకంటే, అక్కడ మనిషి జీవించడానికి అవసరమైన అత్యంత విలువైన వనరులు దాగి ఉన్నాయి.అందుకే నాసా తమ మూన్ బేస్‌కు దక్షిణ ధ్రువాన్ని ఎంచుకుంది. అయితే ఇక్కడ పర్మినెంట్ బేస్ ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. మైనస్ 200 డిగ్రీలకు పడిపోయే తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ప్రమాదకరమైన రేడియేషన్,ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతటి క్లిష్టమైన మిషన్‌లో నాసాకు మన ఇస్రో అందించిన డేటా కీలకంగా మారనుంది. చంద్రుడిపై నీటి జాడల అన్వేషణలో చంద్రయాన్-1 ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ పరికరం చంద్రుడి ధ్రువ ప్రాంతాలను రాడార్ ద్వారా అద్భుతంగా అధ్యయనం చేసింది. 2026లో ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపిన తాజా పరిశోధనల ప్రకారం.. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కొన్ని శాశ్వత నీడ ప్రాంతాల్లోని ఏకంగా నాలుగు క్రేటర్ల అడుగుభాగాల్లో.. ఉపరితలానికి కొంచెం దిగువన నీటి మంచు భారీగా ఉండే అవకాశాన్ని ఈ రాడార్ పరిశీలనలు స్పష్టంగా సూచించాయి. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో ఉపరితల స్వభావం, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎక్కడైతే నీరు సులభంగా దొరుకుతుంది అన్న భౌతిక లక్షణాలకు సంబంధించిన అత్యంత కీలక డేటాను ఇస్రో రూపొందించింది. భవిష్యత్ చంద్ర మిషన్ల ల్యాండింగ్ ప్రాంతాల ఎంపికకు ఈ సమాచారమే ఇప్పుడు నాసాకు ఒక దిక్సూచిలా ఉపయోగపడబోతోంది.
ఇక నాసా విషయానికి వస్తే, ఒకేసారి వ్యోమగాములను పంపి ఇళ్లు కట్టడం సాధ్యం కాదు కాబట్టి, ఒక పక్కా మాస్టర్ ప్లాన్ తో అడుగులు వేస్తోంది. మొదటి దశలో కేవలం రోవర్లు, ల్యాండర్లు, ఇతర అధునాతన రోబోటిక్ వ్యవస్థలను చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపి, అక్కడి వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనంతరం 2029 నుంచి అసలైన నిర్మాణం మొదలవుతుంది. సెమీ-పర్మినెంట్ మౌలిక సదుపాయాలు, సౌర ఫలకాలు లేదా న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్ వ్యవస్థలు, భూమితో కనెక్ట్ అయ్యేలా హై-స్పీడ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, ప్రాథమిక నివాస సదుపాయాల ఏర్పాటు ప్రారంభమవుతుంది. ఈ దశలో భారీ మొత్తంలో కార్గోను, పరికరాలను చంద్రుడిపైకి పంపేందుకు నాసా అనేక కమర్షియల్ ల్యాండర్ మిషన్లను ఉపయోగించనుంది. రోబోట్లు ముందుగా వెళ్లి మనుషులు ఉండటానికి అనువైన వాతావరణాన్ని అక్కడ రెడీ చేస్తాయన్నమాట. ఇక 2032 తర్వాత నాసా లక్ష్యం మరింత పెద్దది. ఆస్ట్రోనాట్ లు చంద్రుడిపై నెలల తరబడి ఎక్కువకాలం నివసించి పనిచేసేలా అత్యాధునిక హ్యాబిటేషన్ మాడ్యూళ్లు, దీర్ఘకాలిక విద్యుత్ వ్యవస్థలు, ఆస్ట్రోనాట్ లు ప్రయాణించడానికి ప్రెషరైజ్డ్ రోవర్లు, నిరంతర ఆక్సిజన్ , నీటి సరఫరా వ్యవస్థలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ప్రస్తుతం నాసా అధికారిక ప్రణాళిక ప్రకారం 2027లో ఆర్టెమిస్-3 ద్వారా నేరుగా చంద్రుడిపై మానవులు దిగరు. ఆ మిషన్ ను కేవలం భూమి ఆర్బిట్ లో కీలక వ్యవస్థల పరీక్షల కోసం మాత్రమే ఉపయోగించనున్నారు. ఇక చంద్రుడి దక్షిణ ధ్రువానికి తొలి ప్రణాళికాబద్ధమైన మానవ ల్యాండింగ్ ఆర్టెమిస్-4 2028లో జరగనుంది. ఆ తర్వాత నుంచే ఈ మూన్ బేస్ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. చంద్రుడిపై మానవాళి దీర్ఘకాలిక ఉనికికి అడుగులు పడుతున్న వేళ.. మన ఇస్రో అందిస్తున్న డేటా భవిష్యత్ అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ను ఒక గ్లోబల్ లీడర్‌గా నిలబెడుతోంది.