అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పరిణామాలు చాలా వేగంగా మారిపోతుంటాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వైరం తారాస్థాయికి చేరుకున్న వేళ, ప్రాంతీయ భద్రత పేరుతో పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి ఒక కొత్త మిలిటరీ కూటమిని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. దీన్నే మక్కా రక్షణ ఒప్పందం అని పిలుస్తున్నారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు రోజురోజుకూ బలోపేతం అవుతుండటం, మరోవైపు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ముస్లిం దేశాలన్నీ ఒకతాటిపైకి రావాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి ఈ కొత్త కూటమికి పునాది వేశాయి. మొదట ఈ రెండు దేశాలు మాత్రమే ఉన్నా, ఆ తర్వాత నాటో సభ్య దేశమైన టర్కీ కూడా ఇందులో చేరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏ దేశంపై శత్రు దేశాలు దాడి చేసినా, అది తమ మూడు దేశాలపై జరిగిన దాడిగానే భావించి ఉమ్మడిగా ప్రతీకార దాడులకు దిగుతాయి. సరిగ్గా నాటో కూటమి ఎలా పనిచేస్తుందో, ఈ మక్కా ఒప్పందం కూడా అలాగే పనిచేస్తుంది. భవిష్యత్తులో ఈ కూటమి ఇజ్రాయెల్‌కు మాత్రమే కాకుండా, భారత్‌కు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
ఈ కూటమి బలాన్ని మరింత పెంచడానికి ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియాలతో పాటు ఈజిప్ట్‌ను కూడా ఇందులో చేర్చుకోవాలని పాకిస్తాన్ భావించింది. కానీ, అనూహ్యంగా ఈజిప్ట్ ఈ కూటమికి దూరంగా ఉండిపోయింది. ఇప్పటికైతే దీనిపై నిర్ణయం తీసుకోలేదు. మరి ముందు ముందు ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. అయితే భారత్ తో ఈజిప్తుకు మంచి సంబంధాలే ఉన్నాయి. భారతదేశం వంటి దేశాలతో తమకు ఉన్న సుదీర్ఘమైన సత్సంబంధాలను దెబ్బతీసుకోవడానికి ఈజిప్ట్ ఏమాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. ఒకవేళ పాక్ కూటమిలో చేరితే, భవిష్యత్తులో భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది ఈజిప్ట్‌కు ఏమాత్రం ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది. భారత్ ఈజిప్ట్ ల మధ్య స్నేహంలో ఒక బలమైన చారిత్రక నేపథ్యం ఉంది. అది 1956 సంవత్సరం. ఈజిప్ట్ తమ దేశంలోని అత్యంత కీలకమైన సూయజ్ కాలువను జాతీయం చేసినప్పుడు, బ్రిటన్ , ఫ్రాన్స్ దేశాలు తమ విముఖత వ్యక్తం చేశాయి. వెంటనే బ్రిటిష్-ఫ్రెంచ్ దళాలు సూయజ్ కాలువ వైపు దూసుకుపోగా, ఇజ్రాయెల్ సాయుధ దళాలు సినాయ్ మీదుగా ఈజిప్ట్‌పై దాడికి దిగాయి. ఆ క్లిష్ట సమయంలో భారత్ ఈజిప్ట్‌కు అండగా నిలబడింది. ఆంగ్లో-ఫ్రెంచ్-ఇజ్రాయెల్ సైనిక చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. సూయజ్ కాలువపై ఈజిప్ట్‌కు మాత్రమే పూర్తి హక్కు ఉంటుందని ఐక్యరాజ్యసమితి వేదికగా బలంగా మద్దతు తెలిపింది. నాడు భారత్ చేసిన ఆ సాయాన్ని ఈజిప్ట్ ఎప్పటికీ మర్చిపోలేదు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత, అంటే 1961లో ఈజిప్ట్ కూడా భారత్ కు సాయం చేసింది. అప్పట్లో భారత భూభాగమైన గోవా ఇంకా పోర్చుగీసు వారి కాలనీగానే ఉంది. గోవాను విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు ఆపరేషన్ విజయ్ పేరుతో కవాతు ప్రారంభించాయి. ఆ సమయంలో పోర్చుగీసు వారు తమ సైన్యాన్ని రక్షించుకోవడానికి, అదనపు బలగాలను సముద్ర మార్గం గుండా గోవాకు పంపాలని చూశారు. కానీ ఆ పోర్చుగీస్ యుద్ధ నౌకలు సూయజ్ కాలువ గుండా వెళ్లకుండా ఈజిప్ట్ ప్రభుత్వం అడ్డుకుంది. భారత్‌కు మద్దతుగా కాలువను బ్లాక్ చేసి పోర్చుగీస్ బలగాలకు చుక్కలు చూపించింది. అలా గోవా విముక్తి పోరాటంలో భారత్‌కు ఈజిప్ట్ పరోక్షంగా సహాయం చేసింది. అలా దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న ఈ చారిత్రక సైనిక దౌత్యపరమైన బంధం ఉంది మరి ఈజిప్ట్ దీనిపై ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాలి.