ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చూడాలని కలలుకనే మహా పుణ్యక్షేత్రం కైలాస మానస సరోవరం. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ పరమశివుడిని దర్శించుకోవడానికి భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళ్తుంటారు. కానీ ఈ పవిత్ర యాత్రకు ఇప్పుడు ప్రకృతి విపత్తు రూపంలో అడ్డుకట్ట పడింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావం కైలాస మానస సరోవర్ యాత్రపై తీవ్రంగా పడింది. జలప్రళయం కారణంగా కీలకమైన రహదారులు దెబ్బతినడంతో నేపాల్ మీదుగా జరగాల్సిన మానస సరోవర్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గత కొద్ది రోజులుగా నేపాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి మనకు తెలిసిందే. హిమాలయ పర్వతాల పైభాగం నుంచి, ముఖ్యంగా టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక వరదలు నేపాల్ సరిహద్దుల్లోని రసువగఢీ ప్రాంతంలో పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఈ ప్రళయానికి రోడ్లు, భారీ వంతెనలు ప్రవాహ వేగంలో కొట్టుకుపోయాయి. కైలాస మానస సరోవరానికి వెళ్లాలంటే ఖాట్మాండు .. రసువగఢీ.. కీరుంగ్ మార్గం ఎంతో కీలకమైనది. యాత్రికులందరూ ఈ రూట్ గుండానే ప్రయాణించి టిబెట్ లోకి ప్రవేశించాలి. ఇప్పుడు ఆ మార్గమే పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రకృతి సృష్టించిన ఈ విలయం వల్ల, నుంచి ఖాట్మాండు నుంచి ప్రారంభం కావాల్సిన యాత్రను అధికారులు అర్ధాంతరంగా నిలిపివేశారు. ముందుకెళ్లే దారి లేక, ఆ మార్గంలో భక్తులు ప్రయాణించడం ఏమాత్రం సురక్షితం కాదని ఆర్మీ , విపత్తు నిర్వహణ బృందాలు హెచ్చరించాయి. ఈ యాత్ర కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఆరు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి కూడా భక్తులు ఈ యాత్రకు బుకింగ్ చేసుకున్నారు. వాళ్లంతా ఎంతో భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాసాలు ఉంటూ, లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ సడెన్ గా యాత్ర క్యాన్సిల్ అవ్వడంతో నిరాశ పడుతున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ నేపథ్యంలో నేపాల్-టిబెట్ సరిహద్దు అధికారులు.. పర్యాటకులు, యాత్రికులు ఎవరూ ప్రాణాపాయంలో పడకూడదని భావించి, తక్షణమే తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటం వల్ల, యాత్రికుల భద్రత దృష్ట్యా మాత్రమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జలప్రళయం కారణంగా ధ్వంసమైన రహదారులను పునరుద్ధరించడానికి, ఆ ప్రాంతం పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే, కనీసం మరో నెల రోజుల పాటు మానస సరోవర్ మార్గం మూసి ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అంతా సేఫ్ అయిన తర్వాత త్వరలో పూర్తి సమాచారం అందిస్తామని టూర్ ఆపరేటర్లు , సంబందిత వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ భౌగోళిక సమస్యతో పాటు మరో పెద్ద అడ్డంకి కూడా ఉంది. అదే అనుమతుల ప్రక్రియ. కైలాస పర్వతం, మానస సరోవరం చైనా ఆధీనంలోని టిబెట్ ప్రాంతంలో ఉన్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఇప్పుడు చైనా, నేపాల్, టిబెట్ ప్రాంతాలకు సంబందించిన వీసాలు, పర్మిట్ల ప్రక్రియ కూడా చాలా క్లిష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా ఓ కొలిక్కి వచ్చే వరకు, ఎలాంటి కొత్త యాత్రికుల జాబితాలను తమకు పంపవద్దని నేపాల్ , చైనా అధికారులు టూర్ ఆపరేటర్లకు కచ్చితమైన సూచనలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంటే పాత వాళ్ల పరిస్థితే అగమ్యగోచరంగా ఉంటే, ఇక కొత్త బుకింగ్స్ కూడా పూర్తిగా బంద్ అన్నమాట. మొత్తంగా చెప్పాలంటే, ప్రకృతి వైపరీత్యం కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రకు ఇప్పుడు ఒక పెద్ద బ్రేక్ పడింది.