ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని లద్ధాక్ లో సైన్యంపై అరిచిన ఒక యువతి వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ద్రాస్ ప్రాంతంలోని మినామార్గ్ చెక్‌పోస్ట్ వద్ద జరిగిన ఈ ఘటనపై ఆమె భారత సైన్యంతోపాటు జమ్మూకశ్మీర్, లద్దాఫ్ పోలీసులకు క్షమాపణలు తెలిపారు. ఆ రోజు గంటల తరబడి తమను ఎందుకు ఆపుతున్నారో తెలియక విసిగి అలా మాట్లాడానని ఒక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఆర్మీని అవమానించాలనో లేదా పాపులర్ అవ్వాలనో అనుకోలేదని తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు తెలిపారు. తానొక సాధారణ యువతిని అని సైన్యం అంటే ఎంతో గౌరవం ఉందని తన మాటల వలన బాధ కలుగుతుందని అనుకోలేదని ఏదేమైనా తాను తప్పుగా మాట్లాడానని విషయం ఇంత పెద్దది అవుతుందనుకోలేదని అన్నారు. జరిగిన దానిపట్ల అందరికీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు క్షమాపణలు చెప్పారు. ‘జెన్ జీ’ అనే మాటలు కూడా అనుకోకుండా వచ్చేశాయని వీటిపై విమర్శలు రావడం బాధించిందన్నారు.
ఇక లద్ధాక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువతి మాట్లాడిన ఈ వీడియో గత నెల 26న ‘కార్గిల్ విజయ్ దివస్’ అప్పటిది. భద్రతా కారణాల కారణంగా ఆ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. భద్రత, ప్రతికూల వాతావరణం, రోడ్డు పరిస్థితుల కారణంగా మినామార్గ్- జోజిలా మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆమె “మేము జెన్ జీ, ఈ ఇటువంటి వాటిని మేము సహించం” అని పెద్ద స్వరంతో మాట్లాడటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన తర్వాత, దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే సైనికుల పట్ల ఆమె చూపిన అగౌరవంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై మాజీ ఆర్మీ చీఫ్, ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా ఉన్న జనరల్ వీకే సింగ్ స్పందించారు. భారత సాయుధ దళాలు మన దేశానికి, దేశానికి హాని తలపెట్టాలని చూసే శక్తులకు మధ్య రక్షణ గోడలా నిలబడతాయి. మీనామార్గ్ సంఘటన మన సైనికుల ధైర్యం, త్యాగం మరియు నిరంతర నిఘాకు ఒక నిదర్శనం. పరిస్థితులు ఏవైనాప్పటికీ, మన సైనికులను అన్యాయంగా నిందించడం లేదా గౌరవించకపోవడం తప్పు. విమర్శ అనేది భావోద్వేగాలు లేదా విచక్షణారహితమైన ఆరోపణల ఆధారంగా కాకుండా, వాస్తవాల ఆధారంగా ఉండాలి. భారతదేశం కోసం సేవ చేస్తూ, త్యాగాలు చేస్తున్న మన సైనికులకు మేము అండగా నిలుస్తాము అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన సైనికుల త్యాగాలను, దేశభక్తిని మరోసారి చర్చకు తెచ్చింది. లడఖ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు దేశ భద్రతకు అత్యంత కీలకం. సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతుంటారు. వారి ప్రతి కదలిక, ప్రతి నిబంధన దేశ భద్రత దృష్ట్యానే ఉంటుందని అర్థం చేసుకోవాలి. జనరల్ వీకే సింగ్‌తో పాటు, ఇతర సైనిక ప్రముఖులు కూడా ఈ ఘటనను ఖండించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ వీడియోపై స్పందించారు. “మేము జెన్ జీ” అనే పదం ఇప్పుడు “జాంతే నహీ హో మేరా బాప్ కౌన్ హై” అన్నట్లుగా మారిందని, తరాల లేబుల్‌ను బెదిరింపుగా ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.