ఇండియన్ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధనౌక ‘ఐ.ఎన్.ఎస్ తారాగిరి’ నేడు జలప్రవేశం చేసింది. విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమంలో రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీ.డీ.ఎస్ ఛీఫ్ అనిల్ చౌహన్, నేవీ ఛీఫ్ దినేశ్ కె.త్రిపాఠి సహా నేవీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు అధికారులు పాల్గొన్నారు. స్టెల్త్ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫ్రిగేట్ వార్ షిప్ భారత సముద్ర సరిహద్దు రక్షణలో సేవలందించనుంది. ఇక ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ మాట్లాడారు. ఈరోజు ఇండియన్ నేవీలో అత్యాధునిక యుద్ధనౌక ‘తారాగిరి’ కమిషనింగ్ జరుగుతోంది. తారాగిరి రాక భారత దేశం యొక్క పెరుగుతున్న సముద్ర శక్తికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్, ఇండియన్ నేవీతో పాటు దేశప్రజలందరికీ అభినందనలు తెలిపారు.పర్షియన్ గల్ఫ్ నుండి మలక్కా జలసంధి వరకు మన నౌకాదళం హిందూ మహాసముద్రంలో నిరంతరం తన ఉనికిని చాటుకుంటోంది. తరలింపు చర్యలు (evacuation operations) అయినా లేదా మానవతా దృక్పథంతో సాయం అందించడమైనా, ఏదైనా సంక్షోభం ఎదురైనప్పుడు మన నేవీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. మన నౌకాదళం భారతీయ విలువలకు మరియు నిబద్ధతకు ప్రతీకని కొనియాడారు. INS తారాగిరి చేరిక మన నౌకాదళం యొక్క బలాన్ని, విలువలను మరియు అంకితభావాన్ని మరింత పెంచుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా మన వాణిజ్య నౌకలు మరియు ఆయిల్ ట్యాంకర్ల భద్రతను ఇండియన్ నేవీ కాపాడుతూ వస్తోందన్నారు. మన నౌకాదళం కేవలం భారత ప్రయోజనాలను కాపాడటమే కాకుండా, అవసరమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన పౌరులను మరియు వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచేందుకు ఏ చర్యకైనా సిద్ధమని నిరూపించిందని పేర్కొన్నారు. ఈ సామర్థ్యమే భారతదేశాన్ని ఒక బాధ్యతాయుతమైన సముద్ర శక్తిగా నిలబెట్టిందన్నారు.