ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన మొదటి పార్టీ టీడీపీనే నని నంద్యాల పార్లమెంట్ సభ్యులు శబరి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె నేడు లోక్ సభలో మాట్లాడారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని తిరుపతిలో ఉమెన్స్ యూనివర్సిటీ ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు. ఉమెన్స్ కోసం స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసిందన్నారు. ఏపీలో సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుమీదనే ఇస్తున్నారన్నారు. దేశంలోనే డ్వాక్రా కార్యక్రమం విజయవంతమైన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని ఇప్పటికే లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేశామన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించినట్లు తెలిపారు. టీడీపీ మొదటి నుంచే మహిళా సాధికారత కోసం పనిచేస్తోంది. ఎన్టీఆర్ తీసుకువచ్చిన అనేక మహిళా సాధికారత విధానాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశంలోనే మొదటిసారి మహిళలకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఇచ్చిన నేత చంద్రబాబు ప్రభుత్వానిదని పేర్కొన్నారు.