అటా..ఇటా..పవర్ పాలి’ట్రిక్స్

Spread the love

ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు ఒక వివాదాస్పద అంశంగా మారాయి. ఒక పార్టీ గుర్తుపై ఓట్లు పొంది  గెలిచిన తర్వాత, తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ సాకులు చూపుతూ పార్టీలు మార్చేయడం ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తోంది. ఈ అంశం సామాన్య ఓటరు ఆలోచనలపై  మరియు సమాజంపైనా ప్రభావం చూపుతూ  రోజు రోజుకు దిగజారుతున్న రాజకీయ విలువలను మరింత అధః పాతాళానికి తీసుకెళ్తున్నాయనే వాదన వినిపిస్తోంది. 

రాజకీయ నాయకులు తమ ఫిరాయింపులను సమర్థించుకోవడానికి నియోజకవర్గ అభివృద్ధి అనే అంశాన్ని తరచుగా తెరపైకి తెస్తుండడం చూస్తూనే ఉన్నాం. అధికార పార్టీలో చేరితేనే నిధులను తీసుకురాగలమని, తద్వారా ప్రజలకు మేలు చేయగలమని వారు తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ ఉంటారు.   అయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం ఉంటుంది. కేవలం పదవుల కోసమో వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీలు మారడం నైతికంగా వారిని ప్రజల ముందు పలుచన చేస్తాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో ఉన్నప్పటికీ, అందులోని లూప్ హొల్స్ ను ఉపయోగించుకుని  ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ మారే నాయకులు తమ పదవికి రాజీనామా చేసి, మళ్ళీ ప్రజల ముందుకు వెళ్లి ప్రజా తీర్పు కోరడం అసలైన ప్రజాస్వామ్య పద్ధతి. అప్పుడే రాజకీయ వ్యవస్థలో అకౌంటబిలిటీ పెరుగుతుంది. లేదంటే, రాజకీయం అనేది కేవలం పవర్ గేమ్ గా  మిగిలిపోయే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. 

పార్టీ ఫిరాయింపులను సామాన్య ప్రజలు ఒక రకమైన విశ్వాస ఘాతుకంగానే చూస్తారు. ఆ నాయకుడు చేసే పనిని ఆ నాయకుడి అనుచరులు, అభిమానులు స్వాగతించ వచ్చేమో గానీ ఓటరు ఒక అభ్యర్థిని ఎన్నుకునేటప్పుడు ఆ  అభ్యర్థి వ్యక్తిత్వంతో పాటు, అతను పోటీచేస్తున్న పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోను కూడా దృష్టిలో ఉంచుకుని తన ఓటును వినియోగించుకుంటాడు. గెలిచిన తర్వాత పార్టీ మారడం అంటే, తమకు ఓటు వేసిన ప్రజల తీర్పును అపహాస్యం చేయడమేనని  మెజారిటీ ప్రజలు భావిస్తారు. ఇది ఓటరును కేవలం ఒక నెంబర్ గానే చూస్తున్నారనే ధోరణిని తెలియజేస్తుంది. 

ఈ రకమైన ధోరణి వల్ల సామాన్య ఓటర్లలోకి  చాలా ప్రతికూలమైన సందేశం వెళ్తుంది. రాజకీయాల పట్ల సామాన్యుల్లో అపనమ్మకం పెరిగి ఎవరికి ఓటు వేసినా చివరికి అందరూ ఒక్కటే అనే భావన కలుగుతుంది. ఇది ఎన్నికల ప్రక్రియ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో ఉదాసీనతను పెంచుతుంది, ఫలితంగా ఓటింగ్ శాతం పై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. సిద్ధాంతాల కంటే నేతల వ్యక్తిగత  ప్రాధాన్యతకే ప్రాధాన్యత  ఉంటుందనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లి వారికి రాజకీయాల పట్ల చులకన భావాన్ని ఏర్పరుస్తుంది. 

ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల పర్వం కొత్తదేమీ కాదు. పోటీ చేసి గెలిచి తమ పార్టీ అధికారంలోకి రాకపోతే గెలిచిన పార్టీల్లోకి వెళ్లి పలు పదవులు పొందిన ఘటనలు చూశాం. మరీ ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా ఈ ధోరణి బాగా పెరిగింది. అధికారం రాకపోతే ఫిరాయింపే మార్గమని నమ్మిన నేతలు ఎందరో ఇటు నుండి అటు అటు నుండి ఇటు జంపింగ్ లు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా అలాంటి నేతలను మళ్లీ ఓటు వేసి ప్రోత్సహించిన సందర్భాలు ఉండడం గమనార్హం. 

ఇక పెద్దల సభైన రాజ్యసభలో పరిస్థితి మరొక రకంగా ఉంది. పార్టీ ఎంపీల్లో చీలిక వర్గానికి 2/3 వంతు మెజార్టీ ఉంటే నేరుగా తమకు ఇష్టమైన రాజకీయ పార్టీలో  విలీనం కావడం, లేదంటే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుడిని గెలిపించే వీలున్న పార్టీలోకి చేరి రాజీనామా చేసిన స్థానం నుండి  తిరిగి ఎన్నికైరావడం అన్న ఉదాహరణలు  ఇటీవల కనిపిస్తున్నాయి.  2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత  ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు  ఆ పార్టీకి రాజీనామా చేసి రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించిబీజేపీలో విలీనం అయ్యారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 4(2)లోని నిబంధనలను అనుసరించి బీజేపీలో విలీనమయ్యారు. 

ఇక తాజాగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలు ఏడుగురు బీజేపీలోకి వెళ్లనున్నారు. సభలో పార్టీకున్న మొత్తం సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు కలిసి వేరే పార్టీలో చేరడానికి సిద్ధమైనప్పుడు దాన్ని విలీనంగా పరిగణించాలని చెబుతున్న ఆ నిబంధనను అనుసరించి  తాము బీజేపీలో  చేరుతున్నట్లు రాఘవ్ చడ్డా సహా మిగిలిన ఆప్ రాజ్యసభ సభ్యులు ప్రకటించారు. ఆ పార్టీకి రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులున్నారు. అయితే అందులో ఏడుగురు బీజేపీలో  చేరుతుండటంతో  వారు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురికాకుండానే పార్టీ మారడానికి వీలు కలుగుతోంది. 

ఇక మరికొందరు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలిచి వచ్చినవారు కూడా ఉన్నారు. 2024 వైసీపీ పరాజయం తరువాత ఆ పార్టీ నుండి రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్.కృష్ణయ్య రాజీనామా చేసి తర్వాత ఏపీ నుండి కూటమి పార్టీల నుండి బరిలోకి దిగి తిరిగి ఎన్నికయ్యారు. వైసీపీ నుండి విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణలు కూడా రాజీనామా చేశారు. అయితే ఆ రెండు సీట్లు కూటమి వైపు బలం ఉండడంతో ఈ సారి కూటమికి దక్కాయి. దీంతో టీడీపీ నేత సాన సతీష్, బీజేపీ నేత పాకా సత్యనారాయణలు ఎన్నికయ్యారు.  ఇక తెలంగాణాలో బీ.ఆర్.ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవ రావు రాజీనామాతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *