మిథాలి రాజ్ ఒక లెజెండ్…ఆమె రికార్డు బద్దలు కొడతానని ఊహించలేదు..!

Spread the love

స్మృతీ మంథాన ఈ తరపు అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లతో భారత క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె తాజాగా అత్యధిక అంతర్జాతీయ రన్స్ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ నెలకొల్పిన రికార్డును తాను బద్దలు కొడతానని కలలో కూడా అనుకోలేదని తాజాగా ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 3న హాంకాంగ్ తో  ఆసియా కప్ మ్యాచ్ లో  సెంచరీ (124) చెలరేగిన ఆమె అత్యధిక అంతర్జాతీయ పరుగుల (10,880)తో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో భారత దిగ్గజ క్రికెటర్ మిథాలి రాజ్  (10,868)ని ఆమె అధిగమించింది. నేను బ్యాటింగ్ చేస్తున్నపుడు ఈ రికార్డు గురించే తెలియదన్నారు.  ప్రపంచ రికార్డు సరిగ్గా ఎన్ని పరుగులకు అన్నది తెలీదని పేర్కొన్నారు. ఇక మిథాలి భారత క్రికెట్లో ఒక దిగ్గజం. మాకందరికీ మార్గదర్శకురాలు. ఆమె ఆటను చూస్తూ పెరిగాను. రన్స్ లో ఆమెను దాటడం అన్నది కలలోనూ ఊహించలేదు. టాప్-2లో ఇద్దరూ ఇండియన్ క్రికెటర్స్  ఉండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ మ్యాచ్ లోనే  స్మృతి అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు (18) సాధించిన బ్యాటర్ గా కూడా మరో రికార్డు నెలకొల్పింది. ఆమె ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్ లానింగ్ (17)ను అధిగమించింది. 

ఈ అద్భుత ప్రదర్శనపై క్రీడా నిపుణులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా స్మృతి ఆడే షాట్లు, ఆమె టెక్నిక్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లకు దీటుగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ విజయంతో భారత జట్టు ఆసియా కప్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌లోకి అధికారికంగా ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై మూడు పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హాంకాంగ్ జట్టు భారత బౌలర్ల ఉచ్చులో చిక్కుకుని కేవలం యాభై ఆరు పరుగులకే కుప్పకూలింది. భారత ప్రధాన స్పిన్నర్ దీప్తి శర్మ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ప్రీమా రావత్, శ్రీ చరణి, నందిని శర్మ తలా రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *