శభాష్ జై షా..?

Spread the love

అమిత్ షా కొడుకు కాబట్టే కాదు..
అమిత్ షా కొడుకు మాత్రమే..

భారత మహిళల జట్టు ప్రపంచ కప్ చాంపియన్స్ గా నిలిచారు. గత మూడు, నాలుగు రోజుల నుంచి వీరి గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీరితో పాటు మరో పేరు కూడా వినిపిస్తోంది. అతను ఎవరో కాదు..జై షా. ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు. క్రికెట్ గురించి తెలిసిన వాళ్లకు ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు కానీ.. మిగతా వారికి అప్పుడప్పులు పేరు వినడం తప్పా ఏం తెలిసి ఉండదు. అయితే ఈ రోజు ఉమెన్స్ వర్డల్ కప్ లో ఇండియాకు గెలిచిందంటే.. అందులో జై షా దే కీలక పాత్ర అంటున్నారు. ఒకప్పుడు తిట్టిన నోళ్లే.. ఇప్పుడు జై కొడుతున్నాయి. ఇందుకు కారణాలు ఏంటి..? ఆయన అంతలా ఉమెన్స్ టీమ్ కు ఎం చేశారు..? అనేది ఈ స్టోరీ లో తెలుసుకుందాం.

ఇతనా..? ఇతనికి క్రికెట్ గురించి ఏం తెలుసు..? ఎప్పుడైనా గ్రౌండ్ చూసిన మొహమేనా..? కనీసం బ్యాట్ అయిన పట్టుకున్నాడా..? అమిత్ షా కొడుకు కాబట్టే.. అమిత్ షా కొడుకు కాబట్టే ఇంత వరకు వచ్చాడు..? ఇవి ఉమెన్స్ టీమ్ విన్నింగ్ కు ఒక రోజు ముందు వరకు జై షా పై వినిపించిన మాటలు. తర్వాత టోన్ మారింది సార్. అమిత్ షా కొడుకు కాబట్టే ఇంత చేయగలిగాడు అన్న స్థాయికి జై షా ఎదిగాడు. బీసీసీఐ చరిత్రలో జై షా ముందు, జై షా తర్వాత అన్నంతగా ఎదిగిపోయాడు. ముఖ్యంగా మహిళా క్రికెట్ ముఖ చిత్రాన్నే పూర్తిగా మార్చేసిన జై షా.. ఇవాళ ఎంతోమంది మహిళలు భారత క్రికెట్ వైపు చూసేలా చేశాడు. భారత మహిళా జట్టు తొలి వన్డే వరల్డ్ కప్ ముద్దాడేలా చేశాడు.

కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో విమర్శలు వచ్చాయి. బీసీసీఐని పూర్తిగా రాజకీయం చేశారంటూ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులతో పాటు ఎంతోమంది విశ్లేషకులు తప్పుబట్టారు. కానీ జై షా ఆ పదవిలో కూర్చున్న ప్రతి రోజూ భారత క్రికెట్ అభివృద్ధికే పాటుపడ్డాడు. 2019 అక్టోబర్ 24న జై షా బీసీసీఐ సెక్రటరీగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఐదేళ్ల పాటు 2024 డిసెంబర్ 8వ తేదీ వరకు అదే పదవిలో కొనసాగాడు. జై షా బీసీసీఐ సెక్రటరీగా అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటుతో పాటు పురుషులు, మహిళలకు సమాన వేతన విధానాన్ని అమలు చేశాడు. డొమెస్టిక్ క్రికెట్‌ ను బలోపేతం చేసి, ఎంతో మంది యువ క్రీడాకారులను తయారు చేశాడు.

ఐసీసీ ఛైర్మన్‌ గా జై షా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా మహిళా క్రికెట్‌ ను పురుషులకు ఏ మాత్రం తగ్గకుండా చేశారు. అందుకు నిదర్శనం ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌ 2025 ప్రైజ్‌ మనీనే. పురుషుల టోర్నీకి ఏ మాత్రం తీసిపోకుండా 39 కోట్ల రూపాయాల బహుమతిని ప్రకటించారు. ఇది గత మహిళల టోర్నీ కంటే 295 రెట్లు అధికం.భారత మహిళా క్రికెట్‌ వన్డే వరల్డ్ కప్ అందుకోవడంలో జై షా పాత్ర ఎంతో కీలకమని చెప్పాలి. ఐపీఎల్ స్థాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించి అంతర్జాతీయ క్రికెటర్లతో ఒక ప్రొఫెషనల్ లీగ్‌ గా మార్చాడు. భారీ స్పాన్సర్స్‌ షిప్‌ లు, మీడియా కవరేజ్‌ తో పాటు భారీ మార్కెంటింగ్‌ కూడా జరిగింది. దాంతో భారత మహిళా క్రికెటర్లు ఒక్క సీజన్‌ కే కోట్ల రూపాయల వేతనాలు అందుకున్నారు. జై షా ప్రోత్సహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ ఇప్పుడు భారత్‌ లో ఓ ముఖ్యమైన వాణిజ్య క్రీడా విభాగంగా మారింది.

జై షా నాయకత్వంలో బీసీసీఐ తీసుకున్న మరో చారిత్రాత్మక నిర్ణయం పురుషులు, మహిళలు సమాన మ్యాచ్ ఫీజు పొందడం. ఈ నిర్ణయం క్రీడా ప్రపంచానికి సమానత్వ సందేశాన్ని పంపింది. మహిళా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది, అలాగే మరిన్ని యువతులు క్రికెట్ వైపు ఆకర్షితులయ్యారు. ఈ నిర్ణయంతో భారత్ ప్రపంచంలోని ప్రముఖ క్రికెట్ బోర్డులలో మొదటగా ఈ సమాన వేతన విధానం అమలు చేసిన దేశంగా నిలిచింది. జై షా పర్యవేక్షణలో మహిళా ఆటగాళ్లకు మంచి వార్షిక కాంట్రాక్టులు, రెటైనర్ ఫీజులు అందేలా చేశారు. అంతేకాకుండా, స్పోర్ట్స్ సైన్స్ టీమ్స్, ఫిజియోలు, న్యూట్రిషన్ నిపుణులు, సపోర్ట్ స్టాఫ్ వంటి వనరులు కూడా విస్తృతంగా ఏర్పాటు చేశారు. దీంతో ఆటగాళ్లు పూర్తిగా క్రీడపై దృష్టి పెట్టే సురక్షిత వాతావరణం ఏర్పడింది.

జై షా ప్రత్యేక శ్రద్ధతో దేశీయ మహిళా టోర్నమెంట్లు, మౌలిక సదుపాయాలు విస్తరించారు. ప్రతి రాష్ట్రంలో గ్రాస్‌ రూట్ ప్రోగ్రామ్‌ లు, శిక్షణ కేంద్రాలు అభివృద్ధి చేశారు. ఏ టీమ్ టూర్లు, ద్వైపాక్షిక సిరీస్‌ ల ద్వారా ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగేలా చేశారు. దీంతో ఇప్పుడు భారతదేశానికి ఎప్పటికంటే విస్తృతమైన మహిళా టాలెంట్ పూల్ లభిస్తోంది. జై షా మార్గదర్శకత్వంలో మహిళా క్రికెట్‌ కు ప్రైమ్‌ టైమ్ టీవీ స్లాట్లు, మెరుగైన ప్రసార ఒప్పందాలు, సోషల్ మీడియా ప్రచారం లభించాయి. దీనివల్ల ఆటగాళ్లు, టోర్నమెంట్లు ప్రజల్లో ఎక్కువగా గుర్తింపు పొందాయి. బ్రాండ్ స్పాన్సర్లు, కార్పొరేట్ భాగస్వామ్యాలు కూడా విస్తృతమయ్యాయి.

జై షా ఎంట్రీతో మహిళా క్రికెట్‌ లో చోటుచేసుకున్న మార్పులను టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా చెప్పింది. ఉమెన్స్ క్రికెట్ ఎప్పుడైతే బీసీసీఐలో భాగమైందో.. అప్పటి నుంచి వారి రాత మారిపోయిందని చెప్పింది. 2005లో భారత్ రన్నరప్‌గా నిలిస్తే కేవలం రూ.8 వేలు మాత్రమే వచ్చాయని, కానీ ఈ రోజు పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని ఆమె జై షా గురించి చెప్పకనే చెప్పింది. భారత వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఎన్నో సందర్భాల్లో జై షా చేసిన సేవలను కీర్తించింది. వరల్డ్ కప్ అందుకునే సమయంలో కూడా జై షా పాదాలను తాకి భారత మహిళా క్రికెట్‌ కు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంది.