ట్రాన్స్ జెండర్లకు ఊరట..తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Spread the love

ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపేలా తెలంగాణ హైకోర్టు ఒక సంచలన , చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సమాజంలో వారికి కూడా సమాన హక్కులు ఉన్నాయని, ఉద్యోగ అవకాశాల్లో వారిని దూరం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. తాజాగా పోలీసు కానిస్టేబుళ్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల నియామకాల్లో ట్రాన్స్‌జెండర్ల అప్లికేషన్లను కూడా కచ్చితంగా తీసుకోవాలని పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. అందులో ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. అయితే, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్ దరఖాస్తుల పోర్టల్‌లో ఒక పెద్ద సాంకేతిక,  నైతిక లోపం ఉంది. అప్లికేషన్ నింపేటప్పుడు లింగాన్ని  ఎంచుకునే ఆప్షన్ వద్ద కేవలం పురుషుడు  లేదా స్త్రీ  అని మాత్రమే ఉంది. ట్రాన్స్ జెండర్లకు థర్డ్ జెండర్  ఆప్షన్ లేదు. ఈ విధానాన్ని సవాలు చేస్తూ,  ట్రాన్స్ జెండర్లు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దరఖాస్తు ప్రారంభ దశలోనే ట్రాన్స్‌జెండర్లు తమ లింగాన్ని పురుషుడు లేదా స్త్రీగా పేర్కొంటూ తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. లింగాన్ని కేవలం పురుషుడు, స్త్రీగా మాత్రమే వర్గీకరించే పాత విధానాన్ని ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారని బోర్డును ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ట్రాన్స్‌జెండర్లతో పాటు అందరికీ అవకాశాలు కల్పించేలా మార్గదర్శకాలు, ఆదేశాలు ఎందుకు జారీ చేయడం లేదని సూటిగా అడిగింది. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై కోర్టు సీరియస్ అయ్యింది.ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. పోలీసు బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌ పోర్టల్ లో సాంకేతిక కారణాల వల్ల వెంటనే థర్డ్ జెండర్ ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం లేకపోతే.. ట్రాన్స్‌జెండర్ల నుంచి ఫిజికల్ గా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించింది. వారు ఇచ్చే ఆఫ్ లైన్ అప్లికేషన్లను తీసుకుని, వాటిని ధ్రువీకరించి నియామక ప్రక్రియలో వారికి అవకాశం కల్పించాలని తీర్పునిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై, ట్రాన్స్ జెండర్ల మార్గదర్శకాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 16కు వాయిదా వేసింది.కేవలం పోలీసు ఉద్యోగాల్లోనే కాదు, ఉన్నత విద్యాభ్యాసంలో కూడా ట్రాన్స్ జెండర్లకు న్యాయం జరిగేలా హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఎల్‌ఎం   ప్రవేశాల్లోనూ ట్రాన్స్‌జెండర్లకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలంటూ దాఖలైన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. చదువుకునే హక్కు అందరికీ ఉందని, ప్రవేశాల్లో వారికి రిజర్వేషన్‌ అమలు చేయకపోవడాన్ని సవాలు చేసిన ఆ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కూడా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఉన్నత విద్యా శాఖకు,  సంబంధిత అధికారులకు ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.ఇది కేవలం నలుగురు వ్యక్తుల విజయం కాదు.. ఎన్నో ఏళ్లుగా గుర్తింపు కోసం పోరాడుతున్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సాధించిన ఒక గొప్ప నైతిక విజయం. రేపు మన రోడ్ల మీద ఒక ట్రాన్స్ జెండర్ పోలీసు ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తుంటే, ఈ సమాజం వారిని చూసే దృక్పథం కచ్చితంగా మారుతుంది. చదువు, ఉద్యోగం.. ఈ రెండూ ఒక మనిషికి ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయో హైకోర్టు తన తీర్పు ద్వారా మరోసారి గుర్తుచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *