అంతర్జాతీయ వేదికలపై శాంతి ప్రవచనాలు పలికే అమెరికా చేసే పనులేమో భిన్నంగా ఉంటాయి. గాజాలో యుద్ధం ఆగిపోవాలని, అమాయక పౌరుల ప్రాణాలు పోకూడదని, కాల్పుల విరమణ జరగాలని ప్రపంచానికి నీతులు వల్లెవేస్తుంది. అయితే గుట్టుచప్పుడు కాకుండా యుద్ధానికి ఆజ్యం పోస్తోందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు ఏకంగా 60 వేల భారీ బాంబులు, మందుగుండు సామాగ్రిని అమెరికా సరఫరా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు చర్చనీయంశంగా మారాయి. ఒకపక్క కాల్పుల విరమణ కోసం చర్చలు జరుపుతూనే.. మరోపక్క ఈ తరహా వైఖరి దేనికి నిదర్శనం అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంత భారీ స్థాయిలో ఆయుధాలు కేవలం హమాస్‌ను ఏరివేయడానికేనా? లేక ఇరాన్, హెజ్బొల్లా లాంటి శత్రువులతో రాబోయే పెద్ద పోరాటానికి రెడీ అవుతుందా అనేది చూడాలి.
2023 అక్టోబర్ 7న హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతికారం మొదలుపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ సైన్యానికి అమెరికా అందిస్తున్న సైనిక సాయం గురించి తెలిసిందే. తాజా నివేదికల ప్రకారం, వేలాది డెడ్లీ వెపన్స్‌ను అమెరికా తరలించింది. ఇందులో అత్యంత ప్రమాదకరమైన 2,000 పౌండ్ల బరువుండే మార్క్-84 అన్‌గైడెడ్ బాంబులు, 500 పౌండ్ల మార్క్-82 బాంబులు భారీ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించే ప్రిసిషన్-గైడెడ్ మ్యూనిషన్స్, 155mm ఫిరంగి గుళ్లు, బంకర్ బస్టర్ బాంబులు కలుపుకుని మొత్తం 60 వేలకు పైగా ఆయుధ సంపదను ఇజ్రాయెల్‌కు బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హమాస్ అనేది ఒక పెద్ద దేశం కాదు, వారి వద్ద ఉన్నది మోడ్రన్ మిలిటరీ కాదు. కేవలం ఒక స్ట్రిప్‌లో దాక్కున్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి 60 వేల భారీ బాంబులు అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కొందరు రక్షణా రంగ విశ్లేషకుల అభిప్రాయం మాత్రం ఇజ్రాయెల్ కేవలం గాజాపై మాత్రమే దృష్టి పెట్టలేదు. ఉత్తరాన లెబనాన్‌లో ఉన్న హెజ్బొల్లా ఎప్పటికైనా అతిపెద్ద ముప్పు. అలాగే డైరెక్ట్‌గా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్న ఇరాన్ మరో టార్గెట్. ఒకవేళ ఇజ్రాయెల్ ఏకకాలంలో పలు ఫ్రంట్లలో యుద్ధం చేయాల్సి వస్తే, ఆయుధాల కొరత రాకుండా ఉండేందుకే అమెరికా ఈ స్థాయిలో ఆయుధాలను డంప్ చేస్తోందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం గాజా కోసం కాదు, మిడిల్ ఈస్ట్‌లో ఒక మహా యుద్ధానికి జరుగుతున్న ముందస్తు ప్రిపరేషన్ అనే డౌట్ ను వ్యక్తం చేస్తున్నారు.
అయితే అమెరికా ఇస్తున్న ఈ ఆయుధాల వల్ల క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రాణనష్టం అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గాజాలో ఇప్పటివరకు వేలాది మంది అమాయకులు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. భారీ విధ్వంసం జరిగి విషాదకరంగా మారింది. కేవలం ప్రపంచ దేశాలే కాదు, అమెరికా సొంత గడ్డపై కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతోంది. కొలంబియా, హార్వర్డ్ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో విద్యార్థులు ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా నిలిపివేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.ఈ ఆయుధాల సరఫరా వెనుక కేవలం రాజకీయాలే కాదు, అతిపెద్ద బిజినెస్ యాంగిల్ కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. అక్కడి భారీ ఆయుధ తయారీ సంస్థలు అమెరికా రాజకీయాలను శాసిస్తుంటాయి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆయా కంపెనీల షేర్ వ్యాల్యూలు ఆకాశాన్ని తాకుతాయి. అమెరికా ప్రభుత్వం ఇజ్రాయెల్ కు ఇచ్చే బిలియన్ డాలర్ల సైనిక సాయం, తిరిగి ఈ అమెరికన్ ఆయుధాల కంపెనీల ఖాతాల్లోకే చేరుతుంది. యుద్ధం ఎంతకాలం కొనసాగితే, వీరికి అంత లాభం. అందుకే ప్రపంచంలో శాంతిని నెలకొల్పాల్సిన అమెరికానే పరోక్షంగా యుద్ధాల ద్వారా తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటోందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఒకవైపు శాంతి వచనాలు పలుకుతూనే, మరోవైపు యుద్ధ ట్యాంకులకు ఇంధనం పోస్తున్నమరోవైపు ఇటువంటి పనులు ఇలా అమెరికా ద్వంద్వ వైఖరి ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌ను మరింత అస్థిరంగా మారుస్తోందని శాంతిని కోరుకునే వారు ఆరోపిస్తున్నారు. ఈ మారణహోమం ఎక్కడికి దారితీస్తుందో, రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ ప్రాంతం ఎలా ఉండబోతోందో చూడాలి.