భారత సీనియర్ పేసర్ షమీ రాజకీయాల్లోకి వస్తున్నదంటూ సరికొత్త చర్చ నడుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని రాష్ట్రీయ లోక్ దళ్ ఛీఫ్ (ఆర్.ఎల్.డీ)అధినేత జయంత్ చౌదరీతో ఆయన భేటీ కావడమే ఈ చర్చకు కారణం. అయితే రాజకీయ ప్రకటనకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఢిల్లీలో వీరిద్దరూ కలిసినట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఎన్నికల్లో షమీ పోటీ చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడితే కానీ అసలు విషయంపై స్పష్టత రాదు. అమ్రోహా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆర్ఎల్డీ నుండి షమీ పోటీ చేయనున్నట్లు ప్రచారం మొదలైంది. షమీ అమ్రోహా జిల్లాలోనే జన్మించారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్ఎల్డీ పార్టీ మిత్రపక్షంగా ఉంది. ఇక, అమ్రోహా అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ నేత మహబూబ్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలీ.. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 71వేల ఓట్లతో విజయం సాధించి వరుసగా నాలుగోసారి ఈ స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఇక్కడ షమీ రంగంలోకి దిగితే విజయావకాశాలు బలంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు రాజకీయాల్లో కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. మరి షమీ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇక క్రికెట్ విషయానికి వస్తే దేశవాళీ టోర్నీల్లో షమీ బాగా రాణిస్తున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత నుండి అతడు జాతీయ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.