దిగ్గజ సంగీత విద్వాంసురాలు భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ బయో పిక్ గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె 110వ జయంతి సందర్భంగా ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. స్టార్ నటి రష్మిక మంథన ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్ సినిమాను నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఎం.ఎస్: ఎ లెగసీ ఆన్ స్క్రీన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దశాబ్దాల నాటి సంగీత ప్రస్థానం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఈ సినిమాలో ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ప్రతిష్టాత్మక ది మ్యూజిక్ అకాడమీ వేదికగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ను నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం ఒక సినిమాగా కాకుండా, భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి దృశ్యరూపం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ బయోపిక్ తలపెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి తొలిక్లాప్ కొట్టిచేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తన గాత్రంతో దేశాన్ని, ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి అని కొనియాడారు. సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ ఇలా ఏ భాషలో పాడినా ఆ భాషకు వన్నె తెచ్చిన మహా గాయని ఆమె అని ప్రశంసించారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, అలాగే బన్నీ వాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ సినిమాపై సామాన్య ప్రేక్షకుల్లోనూ, సంగీత ప్రియుల్లోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో నటించడంపై రష్మిక మందన్న తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.