యూరోప్ దేశాల్లో ఇప్పుడు ఒక సరికొత్త మార్పు మొదలైంది. ఇమ్మిగ్రేషన్, తమ దేశ సంస్కృతి పరిరక్షణ పేరుతో ప్రభుత్వాలు అత్యంత కఠినమైన నిర్ణయాలకు వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తనదైన కఠిన నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఇటలీలో విద్యావ్యవస్థ , సాంస్కృతిక నిబంధనలపై ఉక్కుపాదం మోపడానికి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె తీసుకున్న మొదటి నిర్ణయం ఇటలీ స్కూల్స్ లో ముఖం కనిపించకుండా వేసుకునే బుర్ఖా , నిఖాబ్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం. అంతేకాకుండా తరగతుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యపై కూడా ఒక కఠినమైన పరిమితిని, అంటే క్యాప్ ను విధించేలా నూతన చట్టాన్ని ఆమె తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూరోప్ అంతటా ఇమ్మిగ్రేషన్ పట్ల వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ లాంటి దేశాల్లో వలసదారుల వల్ల నేరాలు పెరుగుతున్నాయని, స్థానిక సంస్కృతి దెబ్బతింటోంది అన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీసుకుంటున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాలు మిగతా యూరోపియన్ దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మతపరమైన దుస్తుల విషయంలో యూరోప్ దేశాలు ఈమధ్య చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇప్పటికే స్కూళ్లలో ఇలాంటి మతపరమైన దుస్తులపై నిషేధం విధించాయి. ఇప్పుడు అదే బాటలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా కఠినమైన అడుగులు వేస్తున్నారు. రోమ్ లో జరిగిన బ్రదర్స్ ఆఫ్ ఇటలీ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా సరే ముఖం తెరిచే పాఠశాలలకు రావాలి. ఒక యువతి తన ముఖాన్ని దాచుకోవాలని ఆదేశించే హక్కు ప్రపంచంలో ఏ సంప్రదాయానికీ లేదు అని ఆమె చాలా స్పష్టంగా, నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. ముఖం కనబడకుండా పూర్తిగా కప్పి ఉంచే ముస్లిం మహిళలు ధరించే బుర్ఖా, నిఖాబ్ ల పైనే ఈ నిషేధం పూర్తిగా వర్తిస్తుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉండడం గమనార్హం. కేవలం తలను మాత్రమే కప్పుకుంటూ, ముఖం స్పష్టంగా కనిపించే హిజాబ్ పై ప్రధాని ఎలాంటి నిషేధ వ్యాఖ్యలు చేయలేదు. అంటే ముఖం కనిపించాలి కానీ ముఖాన్ని కప్పేస్తే మాత్రం స్కూల్స్ లోకి నో ఎంట్రీ అని ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మెలోని తీసుకురాబోతున్న కొత్త చట్టంలో మరో అత్యంత కీలకమైన అంశం.. తరగతి గదుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించడం. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించినా, దీని వెనుక ఇటలీ ప్రభుత్వానికి ఒక బలమైన లాజిక్ ఉంది. సాధారణంగా వలస వచ్చిన విదేశీయులు అంతా ఒకే కమ్యూనిటీగా ఏర్పడి, ఒకే స్కూల్ లో తమ పిల్లలను చేర్పించడం అయితే దీనివల్ల ఒకే తరగతి గదిలో విదేశీ విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా విదేశీయుల సంఖ్య ఎక్కువైతే, వారు ఇటలీ స్థానిక భాషను, ఇటాలియన్ సంస్కృతిని నేర్చుకోవడంలో తీవ్రంగా వెనుకబడిపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతి క్లాస్రూమ్లోనూ ఉండాల్సిన విదేశీ విద్యార్థుల గరిష్ట సంఖ్యపై స్పష్టమైన పరిమితి ని విధించనున్నారు.
చట్టం కేవలం విద్యార్థుల వరకే పరిమితం కాలేదు, ఇటలీలో స్థిరపడాలి అనుకుంటున్న విదేశీయుల తల్లిదండ్రులకు కూడా మెలోని ప్రభుత్వం ఒక గట్టి నిబంధన పాస్ చేస్తోంది. ఇటలీ సమాజంలో త్వరగా కలిసిపోలేకపోతున్న విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇకపై తప్పనిసరిగా ఇటాలియన్ భాషను నేర్చుకోవాలనే నిబంధనను తీసుకువస్తున్నారు. ఈ నిబంధన తీసుకురావడం వెనుక మెలోని ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. ఇటలీకి వచ్చి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే ఎవరైనా సరే.. ముందుగా తమ దేశ భాషను గౌరవించి నేర్చుకోవాలి. ఇటలీ సంస్కృతిని అర్థం చేసుకుని, ఇక్కడి చట్టాలను కచ్చితంగా గౌరవించాలి. అప్పుడే వాళ్ళను మేము బాధ్యతాయుతంగా స్వాగతించడానికి సరైన విధానం అవుతుంది అని ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రతిపాదనలన్నింటినీ ఇటలీ కేబినెట్ ముందుకు తీసుకువచ్చి చట్టబద్ధం చేయనున్నట్లు ప్రధాని మెలోని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత, ఈ బిల్లు చట్టంగా మారడానికి 60 రోజుల్లోగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇటలీ పార్లమెంట్ లో మెలోని పార్టీ అయిన బ్రదర్స్ ఆఫ్ ఇటలీ వారి మిత్రపక్షాలకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి, ఈ చట్టం పాస్ అవ్వడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.