ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో పల్లెలకు మహర్దశను సంతరించుకున్నాయి. గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమం సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమైంది. వేల కోట్ల రూపాయలతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే ఈ బృహత్తర ప్రాజెక్టును క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 29న సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ నెల్లూరు జిల్లాలోని రామాపురం గ్రామంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోనే అత్యున్నత పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలు ఒకేసారి ఒకే గ్రామానికి వస్తుండటంతో.. రామాపురంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. ఈ భారీ కార్యక్రమం కోసం అధికార యంత్రాంగం రామాపురంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే రామాపురం చేరుకుని ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.11 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామాల్లో 2,700 కోట్ల వ్యయంతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. 7,550 కోట్ల వ్యయంతో 9,500 కిలోమీటర్ల బిటి రోడ్ల పనులు. 300 కోట్లతో పాడి రైతుల కోసం 22,000 మిని గోకులాల నిర్మాణం. 225 కోట్ల వ్యయంతో ఉద్యానవన శాఖ ద్వారా 50,000 ఎకరాల్లో తోటల పెంపకం. 110 కోట్ల వ్యయంతో 1,000 కిలోమీటర్ల మేజిక్ డ్రెయిన్లు నిర్మాణం. 200 కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
మొత్తం 11,085 కోట్లలో కేంద్ర వాటా 5,391 కోట్లు కాగా , రాష్ట్ర వాటా 5,694 కోట్లు. వీబీ–జీ రామ్ జీ కింద 1,750 కోట్లు, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద 3,800 కోట్లు, నాబార్డ్, సాస్కీ, ఇతర నిధులతో 2,000 కోట్లతో పనులు చేపట్టనుంది ప్రభుత్వం. పల్లె పండుగ 1.0 కింద 4 వేల కిలో మీటర్ల సిసి రోడ్లు, 22 వేల 514 పశువుల షెడ్లు, 21 వేల వ్యవసాయ పంట కుంటలు, 64 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకం చేపట్టింది పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డవలప్మెంట్ శాఖ. ఇక పల్లె పండుగ 2.0 కింద 2,500 కిలో మీటర్ల సిసి రోడ్లు, 8 వేల 300 కిలో మీటర్ల బీటీ రోడ్లు, 15750 పశువుల షెడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 86 వేల వ్యవసాయ కుంటలు, 82 వేల వ్యక్తిగత సోక్ పిట్లు, 32 కీలో మీటర్ల మ్యాజిక్ డ్రైన్లను నిర్మించారు. ఇప్పుడు పల్లె పండుగ 3.0 కింద 11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున పనులు చేపడుతోంది కూటమి ప్రభుత్వం. ఈ చారిత్రక ఘట్టానికి రామాపురం వేదిక కావడం ఆ గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు.
ఈ రామాపురం పర్యటన కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, దీనికి బలమైన రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలా కలిసి ఒక గ్రామ స్థాయి బహిరంగ సభలో పాల్గొనడం వల్ల.. కూటమి ప్రభుత్వంలో ఎంత ఐక్యత ఉందో ప్రజలకు స్పష్టమైన సందేశం వెళుతుంది. సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంలో కూటమి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోందని చెప్పడానికి ఈ పర్యటనే నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ డ్యామేజ్‌ను కవర్ చేసి, పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావడం ద్వారా గ్రామీణ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భావిస్తోంది. ఈ కార్యక్రమంతో ఏపీలోని పల్లెల్లో మళ్లీ నిజమైన అభివృద్ధి పండుగ మొదలైందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధానులు మార్చడం కాదు.. ప్రతి పల్లెకు సీసీ రోడ్డు, ప్రతి రైతుకు సరైన నీటి సదుపాయం కల్పించడమే నిజమైన వికేంద్రీకరణ అని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా నిరూపిస్తోంది.