అది ఏలియన్స్‌ పనేనా?… భూమికి చేరిన రేడియో సిగ్నల్స్ .. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

Spread the love

ఈ యూనివర్స్ గురించి మనిషి ఇప్పటివరకు తెలుసుకున్నది కేవలం ఇసుక రేణువంత. ఈ విశాల విస్తరిస్తున్న అనంత విశ్వంలో జీవం కేవలం ఇక్కడే ఉందా లేక మనలాంటి లేదా మనకంటే తెలివైన జీవులు ఉన్నాయా? ఈ ప్రశ్న వచ్చిన ప్రతిసారీ శాస్త్రవేత్తల పరిశోధనలు మరింత వేగవంతం అవుతుంటాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఖగోళ శాస్త్రంలో ఒక అద్భుతం జరిగింది.

మన సౌర వ్యవస్థకు అవతల ఉన్న ఒక సుదూర గ్రహం  నుంచి వెలువడుతున్న రేడియో సంకేతాలను  శాస్త్రవేత్తలు తొలిసారిగా నేరుగా గుర్తించారు. భూమికి సుదూరంగా ఉన్న ఆ గ్రహం నుంచి నిరంతరం  రేడియో తరంగాలు మన భూమి మీద ఉన్న టెలిస్కోపులకు చిక్కాయి. దీంతో ఒక్కసారిగా సైన్స్ ప్రపంచంలో ఆసక్తి పెరిగింది. భూమికి సుమారు 64 కాంతి సంవత్సరాల  దూరంలో బీటా పిక్టోరిస్ బి అనే ఒక వాయు మహాగ్రహం  నుండే  నేరుగా ఈ రేడియో తరంగాలు వెలువడుతున్నాయి. ఈ అద్భుతాన్ని సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్రసిద్ధ మీర్‌క్యాట్ రేడియో టెలిస్కోప్ సహాయంతో శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు. సాధారణంగా అంతరిక్షంలో ఒక గ్రహ వ్యవస్థ నుంచి రేడియో సంకేతాలు వస్తే, అవి ఆ వ్యవస్థలోని నక్షత్రం నుంచి వస్తున్నాయా లేక దాని చుట్టూ తిరిగే గ్రహం నుంచి వస్తున్నాయా అని ఖచ్చితంగా తేల్చడం చాలా కష్టం. కానీ, కెవిన్ ఎన్. ఓర్టిజ్ సెబల్లోస్ నేతృత్వంలోని ఖగోళ శాస్త్రవేత్తల టీమ్ .. తొలిసారిగా ఈ సంకేతాలు కచ్చితంగా బీటా పిక్టోరిస్ బి గ్రహం నుంచే వస్తున్నాయని సాంకేతికంగా నిరూపించారు. సౌర కుటుంబం వెలుపల ఉన్న ఒక గ్రహం నుంచి రేడియో తరంగాలను నేరుగా గుర్తించడం అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే ఇది తొలిసారి అంటున్నారు. అంతరిక్షం నుండి సిగ్నల్స్ వస్తున్నాయనగానే అందరికీ ముందుగా వచ్చే అనుమానం.. ఏలియన్సేమైనా మనతో కమ్యూనికేట్ అవ్వడానికి ఇవి  పంపుతున్నారా అని.  అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇది గ్రహాంతరవాసులు పంపిన సందేశం కాదని స్పష్టం చేశారు. మరి ఈ రేడియో తరంగాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి.. అంటే దీనికి కారణం అరోరాలు.  మన భూమిపై ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో ఆకాశంలో రంగురంగుల కాంతులు మెరుస్తూ కనిపిస్తాయి కదా, వాటినే అరోరాలు అంటారు. అలాగే  జూపిటర్  లాంటి గ్రహాల మీద కూడా ఇవి ఏర్పడతాయి. అంతరిక్షంలోని  చార్జడ్ పార్టికల్స్  ఆ గ్రహం యొక్క బలమైన  మాగ్నేటిక్ ఫీల్డ్  గుండా ట్రావెల్ అయ్యి, పై వాతావరణాన్ని ఢీకొన్నప్పుడు విపరీతమైన రేడియో ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి రేడియో తరంగాల రూపంలో అంతరిక్షంలో ప్రయాణించి ఇప్పుడు భూమిపై ఉన్న మన టెలిస్కోపులకు చిక్కిందని పరిశోధకులు తెలిపారు.  ఈ రేడియో సంకేతాల  వావేలెంగ్త్స్  నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలకు.. ఆ గ్రహం గురించి విస్తుపోయే నిజాలు తెలిశాయి. బీటా పిక్టోరిస్ బి గ్రహం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్ర బలం కనీసం 1,250 గాస్ ఉంటుందని వారు అంచనా వేశారు.  మన భూమి మ్యాగ్నటిక్ ఫీల్డ్  సుమారు 0.5 గాస్ మాత్రమే ఉంటుంది. మన సౌర వ్యవస్థలోనే అత్యంత భారీ గ్రహమైన  జూపిటర్ కి కూడా ఇంతకంటే తక్కువే ఉంటుంది. అంటే బృహస్పతి కంటే కూడా అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం  ఆ సుదూర గ్రహంపై ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం గురు గ్రహం కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉండి, ఒక బ్రౌన్ డ్వార్ఫ్  లక్షణాలకు దగ్గరగా ఉందని తెలుస్తోంది. 

ఈ ఇన్నోవేషన్ ఆస్ట్రానమీలో కీలకంగా ఉండనుంది. మనం ఇప్పటివరకు వేలాది  సౌర కుటుంబం బయట  గ్రహాలను కనుగొన్నాం. అయితే  వాటి చుట్టూ ఉన్న నక్షత్రాల విపరీతమైన కాంతి వల్ల ఆ గ్రహాలను స్పష్టంగా చూడటం లేదా వాటి వాతావరణాన్ని అధ్యయనం చేయడం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఈ రేడియో తరంగాలను పసిగట్టే టెక్నిక్ ద్వారా, భవిష్యత్తులో విశ్వంలో పుడుతున్న కొత్త వాయు గ్రహాల వాతావరణం, వాటి అయస్కాంత వ్యవస్థలు ఎలా రూపాంతరం చెందుతాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఒక సుదూర గ్రహం వాతావరణం తన అయస్కాంత క్షేత్రంతో ఎలా  ఇంటరాక్షన్ అవుతుందో క్లియర్ గా  వివరించడానికి ఈ ఆవిష్కరణ ఒక అద్భుతమైన శాస్త్రీయ ఆధారంగా నిలిచింది.  కాబట్టి ఈ  అంతరిక్షం నుంచి మన భూమికి అందిన మర్మమైన రేడియో సంకేతాలు ఏలియన్స్ పంపిన సంకేతాలు కాకపోయినప్పటికీ.. రేడియో ఆస్ట్రానమీలో  ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు అని పేర్కొనవచ్చు.  రేడియో టెలిస్కోప్‌ల టెక్నాలజీ మరింత పెరిగితే భవిష్యత్తులో బహుశా నిజంగానే ఏలియన్స్ సిగ్నల్స్ మనకు దొరికే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *