మన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారుల కోసం కీలకమైన వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా సేవలను ప్రారంభించింది. ఈ సేవల కోసం వాయిస్ ఓవర్ వైఫైకి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘వైఫై కాలింగ్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులందరికీ ఎలాంటి అడిషనల్ ఛార్జీలు లేకుండానే అందుబాటులో ఉంటాయి. మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యను అధిగమించేందుకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. కస్టమర్లు తమకు అందుబాటులో ఉన్న బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ లేదా ఇతర ఏదేని వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించి, తమ ఫోన్‌లోని సాధారణ డయలర్ నుంచే నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి మొబైల్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు.దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను మోడ్రనైజ్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ వాయిస్ ఓవర్ వైఫై సేవలను తీసుకొచ్చినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. “దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సరైన సేవలు లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఇది ఒక కీలకమైన అడుగని పేర్కొంది.