10 నిమిషాల డెలివరీ సీక్రెట్: ఏజెంట్ల వేగం కాదు, డార్క్ స్టోర్లే కారణమన్న దీపిందర్ గోయల్!

Spread the love

జొమాటో, బ్లింకిట్ అందిస్తున్న 10 నిమిషాల ఫాస్ట్ డెలివరీ వెనుక ఉన్న అసలు గుట్టును ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు.ఈ వేగవంతమైన సేవలకు డెలివరీ భాగస్వాములు వేగంగా వాహనాలు నడపడం కారణం కాదని, కస్టమర్లకు అత్యంత సమీపంలో ఏర్పాటు చేసిన ‘డార్క్ స్టోర్ల’ నెట్‌వర్కే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. ఆర్డర్ ప్యాకింగ్‌కు 2.5 నిమిషాలు పడుతుందని, సగటున 2 కిలోమీటర్ల లోపు దూరమే ఉంటుంది కాబట్టి గంటకు 15 కిలోమీటర్ల సాధారణ వేగంతో వెళ్లినా 8 నిమిషాల్లో డెలివరీ చేయవచ్చని ఆయన వివరించారు. డెలివరీ ఆలస్యమైతే ఏజెంట్లకు ఎటువంటి జరిమానాలు ఉండవని, అలాగే సమయానికి చేర్చినందుకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వమని, దీనివల్ల వారిపై ఎటువంటి ఒత్తిడి ఉండదని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతూ, ఇది సామాజిక అలవాటే తప్ప డెలివరీ ఏజెంట్ల సమస్య మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. గిగ్ వర్కర్ల నిరసనల మధ్యే న్యూ ఇయర్ రోజున జొమాటో, బ్లింకిట్ ఏకంగా 75 లక్షల రికార్డు స్థాయి ఆర్డర్లను పూర్తి చేయడం విశేషం.