ఆకట్టుకుంటున్న అహ్మదాబాద్ ఫ్లవర్ షో.. ప్రధాని మోడీ ప్రశంసలు  

Spread the love

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో సబర్మతీ తీరంలో ఆహ్లాదపరిచేలా ఏర్పాటుచేసిన 14వ అంతర్జాతీయ పూల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఈ ప్రదర్శన.. నగర ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను తేలియజేయడంతో పాటు క్రియేటివిటీ, సుస్థిరత, సామాజిక భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ఆయన పోస్ట్ చేశారు. దీనిని అహ్మదాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ప్రధాని స్ఫూర్తితోనే ఈ ప్రదర్శనను ఏర్పాటుచేసినట్లు గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్ తెలిపారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన సర్దార్ వల్లభభాయి పటేల్ భారీ విగ్రహం, అతి పెద్ద పూల అలంకరణ రెండూ  గిన్నిస్ రికార్డులు సాధించడం ప్రజలందరికీ గర్వకారణం. ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన భారతీయ పండుగలు, శాస్త్రీయ నృత్యాలు, పౌరాణిక కథలు, ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు, క్రీడలు సహా పలు అంశాలకు సంబంధించిన నమూనాలను ప్రజలు సందర్శించాలని  భూపేందర్ సూచించారు.