ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని అంతం చేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ACB) సరికొత్త సాంకేతికతతో రంగంలోకి దిగింది.ఈ మేరకు విజయవాడలో 2025 వార్షిక నివేదికను విడుదల చేసిన ఏసీబీ డీజీ అతుల్ సింగ్, అవినీతిపరుల బినామీ ఆస్తుల గుట్టు రట్టు చేసేందుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు ప్రకటించారు.రిజిస్ట్రేషన్ శాఖ (IGRS) నుండి బినామీ ఆస్తుల వివరాలు, అనుమానిత బ్యాంకు లావాదేవీలను ఏఐ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, తద్వారా కరుడుగట్టిన అవినీతి తిమింగలాల పని పడతామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.అవినీతికి పాల్పడిన వారికి గరిష్టంగా మూడేళ్లలోనే శిక్ష పడేలా చేసి జైలుకు పంపడమే తమ ప్రాథమిక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 115 కేసులు నమోదు కాగా, అందులో రెవెన్యూ శాఖ (19 కేసులు) అగ్రస్థానంలో ఉందని డీజీ వెల్లడించారు.గత ఏడాది శిక్షల రేటు 46 శాతంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఇకపై కోర్టులో సాక్షులు మాట మార్చకుండా ఉండేందుకు వారి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు (164 సెక్షన్ కింద) నమోదు చేయిస్తామన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అవినీతి నిర్మూలనలో ప్రజలను భాగస్వాములను చేస్తూ టోల్ ఫ్రీ నెంబర్ 1064, వాట్సాప్ నెంబర్ 9440440057లను అందుబాటులోకి తెచ్చామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది రెవెన్యూతో పాటు మరో నాలుగు కీలక శాఖలపై ప్రత్యేక నిఘా ఉంటుందని అతుల్ సింగ్ ప్రకటించారు