ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. 2017 తర్వాత ఆయన చేస్తున్న రెండో పర్యటన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం, అక్కడి మీడియా భారత ప్రధానికి ఘన స్వాగతం అందించేందుకు రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రముఖ వార్తాపత్రిక ‘ద జెరూసలేం పోస్ట్’ ప్రధాని మోదీ గౌరవార్థం ఒక ప్రత్యేక ఫ్రంట్ పేజీని రూపకల్పన చేసింది. ఆ పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ జ్వికా క్లెయిన్ తన ‘ఎక్స్’ ఎకౌంట్ లో ఈ స్పెషల్ కవర్ పేజీని షేర్ చేశారు. ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న ఫోటోతో పాటు ‘‘వెల్కమ్ మోదీ’’, ‘‘నమస్తే’’ అంటూ హెడ్డింగ్స్ఉన్నాయి. భారత్-ఇజ్రాయెల్ మధ్య బలపడుతున్న స్నేహానికి ఇది నిదర్శనమని పత్రిక పేర్కొంది. ఇక ఈ పర్యటనలో భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘నెసెట్’ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ గౌరవం అందుకుంటున్న మొదటి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు.
ప్రధాని నెతన్యాహుతో కలిసి మోదీ డిఫెన్స్, సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఇజ్రాయెల్ లోని హోలోకాస్ట్ మెమోరియల్ ‘యాద్ వాషెమ్’ను కూడా విజిట్ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 4:00 గంటలకు మోదీ ఇజ్రాయెల్ లో అడుగుపెడతారు. సాయంత్రం నెసెట్ లో ప్రసంగిస్తారు. రేపు ఉదయం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో భేటీ అవుతారు.